సింగయ్య మృతి కేసులో కూటమి దొంగాట!

నల్లపాడు స్టేషన్‌లో వెనుక వైపున ఉంచిన వాహనం

నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లోనే సఫారి 0001 వాహనం 

వాహనం కనపడకుండా దాచివేత ∙ గుర్తు పట్టకుండా నంబర్‌ ప్లేట్లు తొలగింపు 

తొలుత ఈ వాహనమే ఢీకొట్టిందని ప్రకటన 

మూడు రోజుల తర్వాత మాట మార్చిన ఎస్పీ 

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వాహనమే ఢీకొట్టిందంటూ కేసు మార్పు 

గుంటూరు: రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య కేసులో కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆడిస్తున్న దొంగాట చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటన సందర్భంగా గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్‌ వద్ద జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య అనే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు గంటల్లోనే గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్‌ ఆగమేఘాలపై మీడియా సమావేశం నిర్వహించి వైయ‌స్‌ జగన్‌ను చూసేందుకు వచ్చిన సింగయ్య ఆయనపై పూలు వేసేందుకు రోడ్డుపైకి వచ్చినప్పుడు ప్రైవేటు వాహనం ఢీకొందని ప్రకటించారు.

ఆసుపత్రికి తరలిస్తుండగా సింగయ్య మృతి చెందాడని చెప్పారు. ఈ ప్రమాదానికి వైయ‌స్ జగన్‌ కాన్వాయ్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాన్వాయ్‌కు 50 మీటర్ల ముందు ఉన్న టాటా సఫారి ఏపీ26 సీవీ 0001 వాహనం తగలడంతో సింగయ్య గాయపడ్డాడని చెప్పారు. ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ రోజే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఆ వాహన డ్రైవర్‌ను తాడేపల్లి స్టేషన్‌కు, తర్వాత ఎస్పీ కార్యాలయానికి, చివరగా నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. తాను ర్యాష్‌గా డ్రైవ్‌ చేసిన మాట నిజమేనని, వైయ‌స్ జగన్‌ను ఫొటోలు తీసేందుకు ముందుకు వచ్చానని, ప్రమాదం జరిగిన విషయం తనకు తెలియదని ఆ వాహన డ్రైవర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. తర్వాత వాహనాన్ని సీజ్‌చేసి, డ్రైవర్‌కు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు.   

ఆ తర్వాత కథ మార్చేశారు 
మూడు రోజులు తిరిగేసరికి పోలీసులు మొదట్లో చెప్పిన కథను మార్చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాహనమే ఢీకొట్టిందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఆ వాహనం డ్రైవర్‌ రమణారెడ్డితోపాటు మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజిని పేర్లు చేర్చి సెక్షన్లు కూడా మార్చారు. మళ్లీ ఇదే ఐజీ, ఎస్పీ మీడియా ముందుకు వచ్చి కూటమి పెద్దలు ఇచ్చిన  స్క్రిప్ట్‌ చదివారు.

డ్రైవర్‌ రమణారెడ్డిని విచారించడంతో పాటు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతా సిబ్బందిని కూడా పిలిచి ఆ సమయంలో ఎక్కడ ఉన్నారంటూ విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి కారణమని మొదట గుంటూరులోని నల్లపాడు స్టేషన్‌లోనే ముందుభాగంలో ఉంచిన ఏపీ 26 సీవీ 0001 వాహనాన్ని రాత్రికి రాత్రి స్టేషన్‌ వెనక్కి మార్చేశారు. దానిని ఎవరూ గుర్తుపట్టకుండా నంబర్‌ ప్లేట్లను కూడా తొలగించారు. ఆ వాహ­నం యాక్సిడెంట్‌కు కారణం కానప్పుడు.. ఆ వాహ­­నాన్ని వదిలేయకుండా స్టేషన్‌ వెనుక దాచడం కూటమి పెద్దల దొంగాటను బయటపెట్టింది.  

Back to Top