నంద్యాల గెలుపుతో ఏం సాధించినట్టు..?

– భవిష్యత్తులో టీడీపీకి అసలైన సవాళ్లు 
– ఎన్నికల హామీలు విస్మరిస్తే టీడీపీకి అధోగతే
– నంద్యాల విజయం ప్రలోభాలు, భయానికి దక్కిందే 
– నంద్యాల తరహాలో నిధుల కోసం పట్టుపడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు

నంద్యాల ఎన్నికలు ముగిసాయి. టీడీపీ గెలిచింది. ముఖ్యమంత్రి కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇదంతా మా గొప్పతనమని ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబు వ్యూహాత్మక చాణక్యానికి నంద్యాల ఎన్నిక నిదర్శనమని పచ్చ మీడియా బ్యాండ్‌ బజాయించింది. ఆయన్ను ఆకాశానికికెత్తేసి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. అయితే నంద్యాల విజయంతోనే అంతా సాధించేసినట్టేనని టీడీపీ అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అసలు కథ ఇక్కడే మొదలైంది. నంద్యాల ఉప ఎన్నికల విజయం టీడీపీకి అంత ఈజీగా దక్కలేదు. ఇంటింటికీ తిరిగి బెదిరింపులు, డబ్బులు, కుట్టు మిషన్ల పంపిణీ, ఇళ్లు కట్టిస్తామని నకిలీ ఇంటి పట్టాలతో ప్రచారం, ఉన్నవారికి పింఛన్లు తీసేస్తామని బెదిరింపులు, కొత్తగా 9వేల పింఛన్లు ఇవ్వడం.. రాత్రికే రాత్రే రోడ్లు వేయడం.. అభివృద్ధి పేరుతో ఇళ్లు పడగొట్టడం, కులాల మీటింగ్‌లు, మసీదులు, చర్చిల మరమ్మతులకు నిధులు, రంజాన్‌ పండగ ఆర్భాటం, ట్రాక్టర్లు పంచడం... ఒక్క నంద్యాల ఎన్నికల కోసం టీడీపీ చేసిన రాజకీయం ఇది. 

మంత్రివర్గం మొత్తాన్ని నంద్యాల్లో మోహరించడం, కాలేజీ విద్యార్థులను ఇంటింటికీ పంపించి సర్వే పేరుతో ఆధార్‌ నంబర్లు సేకరించి భయపెట్టడం ఇన్ని చేస్తే కానీ టీడీపీకి విజయం సొంతం కాలేదు. చేతిలో అధికారం ఉందనే ధీమాతో మూడేళ్లలో చేయని అభివృద్ధిని ఎన్నికల ముందు హడావుడిగా మొదలుపెట్టి రెండేళ్లుగా అద్భుతం చేయబోతున్నామని నమ్మబలికి గెలుచు‘కొన్నారు’. అంతేనా ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇళ్లలో సోదాలు, బెదిరింపులు, అరెస్టులు, శిల్పా ఇంటిపై ఆస్తులపై దాడులు, ఆయన వ్యక్తిత్వంపై దిగజారి విమర్శలు గుప్పించడం వెరసి ఒక సాధారణ ఉప ఎన్నికను మహా సంగ్రామాన్ని తలపించేలా సృష్టించారు. ఓటమి భయంతో టీడీపీ ఏం చేసినా ప్రజలకేమైనా మంచి జరిగిందంటే అది వైయస్‌ఆర్‌సీపీ పుణ్యమే. 

ఇళ్లు అలకగానే పండగకాదు..
టీడీపీ గెలవడంతోనే చంద్రబాబు ఏదో సాధించేశారని అనుకుంటే పొరపాటే. అసలు కథ ఇప్పుడే మొదలైంది. నంద్యాల ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎన్నికలప్పుడు ఎంత ఆర్భాటంగా హామీలు గుప్పించారో అంతే ఆర్భాటంగా పనులు పూర్తి చేయకపోతే వారికి ప్రజలు రానున్న కాలంలో గుణపాఠం చెబుతారు. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి పనులు పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందన్న ఒకే ఒక్క కారణంతో ప్రజలు టీడీపీని గెలిపించారు తప్ప మరే ఇతర కారణం లేదు. పైగా నంద్యాల విజయం తరువాత జరిగిన తీరును పరిశీలిస్తే చంద్రబాబు దానిని మోడల్‌గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంటే ప్రతి నియోజకర్గానికి వంద కోట్లు ఖర్చు చేయడానికి సిద్దంగా ఉండాలని పరోక్షంగా నాయకులను హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఉప ఎన్నిక కాబట్టి డబ్బులు పంచడం ద్వారా అధికార పార్టీ గెలిచి ఉండవచ్చు. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే పంథాలో వెళ్లి నోట్లు పంచి ఓట్లు కొంటామని భ్రమ పడితే అంతకన్నా అవివేకం ఉండదు. అన్నింటి కంటే ఇంకో ముఖ్య విషయం టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమకు నంద్యాలకు కేటాయించినట్టుగానే నిధులు ఇవ్వమని ముఖ్యమంత్రిని ఇప్పటికే డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. అయితే చంద్రబాబు ఇచ్చే పరిస్థితుల్లో లేరన్నది వాస్తవం. నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైన పరిస్థితుల్లో చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు చేయకతప్పని పరిస్థితి నెలకొంది. అంతేకానీ రాష్ట్రంలో ఉన్న 175 స్థానాల్లో కానీ.. టీడీపీ అధికారంలో ఉన్న నియోజకవర్గాల స్థితిగతులు.. గత మూడేళ్లుగా జరిగిన అభివృద్ధిని గమనిస్తే జరిగింది శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో నంద్యాల విజయాన్ని మోడల్‌గా తీసుకోవాలని నాయకులకు చంద్రబాబు పిలుపునివ్వడం ఆయన పబ్లిసిటీ చేసుకోవడం తప్ప మరొకటి కాదు.  

తాజా వీడియోలు

Back to Top