భారతీ రెడ్డి పేరు ఛార్జ్ షీట్ లో వేయడానికి కారణం ఇదేనా???


గమనించండి. చంద్రబాబు నిన్నటిదాకా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్- బిజెపి పొత్తు అని ప్రచారం చేసాడు. వైయ‌స్ జగన్ కేసుల మాఫీ కోసమే బిజెపితో కలిసాడు అని కారు కూతలు కూసారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధానిని కలిసిన.. దానిమీద కూడా టిడిపి నానా యాగీ చేసింది. ఓ రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యుడు ప్రధానిని కలవడాన్ని దారుణమైన తప్పులుగా వక్రీకరించి సొంత మీడియాతో గొడవ గొడవ చేయించింది. ప్రధాని కార్యాలయంలో నిందితులంటూ నోటికొచ్చిన చెత్తంతా వాగింది. కట్ చేస్తే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో అటు కాంగ్రెస్, ఇటు బిజెపిల్లో ఎవ్వరినీ సమర్థించేది లేదని ఎన్నికలను బహిష్కరించింది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే బిజెపి వైయ‌స్ఆర్‌సీపీ  పొత్తు అంటూ చంద్రబాబు చేసిన ప్రచారం అంతా పచ్చి అబద్ధం అని రుజువైపోయింది. ఇక రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలు పూర్తైయిన ఒక్క రోజు వ్యవధిలోనే వైయ‌స్ జగన్ పై కొత్త ఛార్జిషీట్ దాఖలైంది. అంటే టిడిపి కోరుకున్నట్టుగా బిజెపి వైయ‌స్ జగన్ పై మరిన్ని కేసులతో విరుచుకుపడేందుకు సిద్ధమైంది. తమకు అనుకూలంగా లేనన్న విషయాన్ని బహిరంగంగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చాటిచెప్పడమే ఇందుకు కారణం అనుకోవాలా? దీన్ని బట్టి బిజెపి వైయ‌స్ జగన్ కు కేసుల నుంచి రక్షణ కల్పిస్తోందనే సొల్లు వాదనకు పులిస్టాప్ పడ్డట్టే.

ఇక ఛార్జ్ షీట్ విషయానికొద్దాం...భారతీ సిమెంట్స్ లో క్విడ్ ప్రోకో జరిగిందని 7 సంవత్సరాల క్రితం సిబిఐ, ఈడీ రెండూ కలిసి కేసులు నమోదు చేసాయి. వాటిపై దర్యాప్తు జరుగుతోంది కూడా. అయితే భారతీ సిమెంట్స్ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణలో సిబిఐ ఎలాంటి అభియోగాలూ చేయనేలేదు. కానీ ఈడీ మాత్రం కొత్తగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి భార్య వైయ‌స్ భారతీ రెడ్డి పేరును ఛార్జ్ షీట్ లో నమోదు చేసింది. ఇంత వరకూ జరుగుతున్న విచారణ జరుగుతున్న కేసుల్లో వేటిలోనూ సరైన ఆధారాలు లేవని తేటతెల్లం అవుతోంది. సిబిఐ కోర్టు, హైకోర్టు సైతం ఒక్కో కేసునూ కొట్టేస్తున్నాయి. కేసుల్లో అప్పటి మంత్రులు, ఛార్జి షీట్ లో పేర్కొన్న అధికారులకు ఏ సంబంధం లేదని, నిబంధనల ప్రకారమే అన్నీ జరిగాయని తేలడంతో వారిపై ఉన్న కేసులను కొట్టేయడం జరుగుతోంది. అంటే వైఎస్ జగన్ పై కుట్ర పూరితంగా, కక్ష పూరితంగా వేసిన కేసుల్లో నిజాలు నిలకడమీద బైటకొస్తున్నాయి. నిందితులను, నాటి ప్రభుత్వం చెప్పినట్టల్లా చేసి అవినీతిలో భాగం పంచుకున్నారంటూ చేసిన ఆరోపణల్లో నిజం లేదని కోర్టు తేల్చి చెబుతోంది. వైయ‌స్ జగన్ పై చంద్రబాబు ఇంకా ఇతరులు చేస్తున్న ఆరోపణలు అబద్ధాలని రుజువయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆ కేసుల విషయాన్ని జఠిలం చేయాలని, ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ కేసుల పేరుతో మరింత ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశ్యంతోనే ఈ ఛార్జిషీట్ దాఖలైందని అంటున్నారు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. భారతి సిమెంట్స్ లో అన్నీ చట్ట ప్రకారమే జరిగాయని, అందుకే సిబిఐ సైతం ఎలాంటి అభియోగాలు చేయలేదని, కేవలం సాకులతో ఇడి ఇలాంటి ఛార్జి షీట్ ను దాఖలు చేసిందని అంటున్నారు. బిజెపి, టిడిపిలు కలిసి చేస్తున్న ఈ కుట్రను కూడా వైఎస్ జగన్ బద్దలుకొట్టుకుని ముందుకు వస్తారని ధీమాగా చెబుతున్నారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని, వారి కుటుంబ సభ్యులను కావాలనే రచ్చకీడుస్తున్నారని, కోర్టుల్లో నిజాలు నిరూపణ అవుతుంటే కొత్త కేసుల పేరుతో వారి మనో స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇలాంటివి ఎన్ని జరిగినా తమ పార్టీ అధినేత కుంగిపోరని, న్యాయస్థానం నుంచే అన్యాయం పై పోరాడతారని సగర్వంగా చెప్పుకుంటున్నారు ఆపార్టీ నేతలు, అభిమానులు. ఇది తమ నాయకుడిపై ఉన్న నమ్మకమే కాదు, న్యాయంపై ఉన్న నమ్మకం కూడా అని చెబుతున్న వారి మాటల్లో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తోంది. 


 

తాజా ఫోటోలు

Back to Top