బాబు సెంటిమెంట్ రాజకీయాలు



చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం. 2014 నుండీ ఈ రోజు వరకూ బాబు చేసినవన్నీ గ్రాఫికల్ మాయాజాలాలే. తేలికగా చెప్పాలంటే అరచేతిలో వైకుంఠం చూపి ఆంధ్రప్రదేశ్ ను  అప్పుల్లో ముంచేసాడు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కహామీ నెరవేరకపోగా రాష్ట్రం దొంగల పాలైంది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా తెలుగు తమ్ముళ్లు రాష్ట్రాన్ని పంచుకు తిన్నారు. భూములు, కాంట్రాక్టులు, సహజ వనరులు, పథకాలు, ప్రాజెక్టులు ఒక్కటేమిటీ అన్నిటిలోనూ అవినీతి అనే చీడపురుగు చేరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. స్వయంగా బాబే ఈ అవినీతి మహా సామ్రాజ్యానికి ఏక ఛత్రాధిపతి. 

ఎన్నికల కోసం బాబు కొత్త వేషం

రాష్ట్రం అభివృద్ధిలో భారత దేశం కంటే వేగంగా దూసుకుపోతోందంటూ చెప్పే బాబు నిజానికి ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకెళ్లి చెప్పుకునేందుకు ఒక్క విషయం కూడా లేదు. ఇచ్చిన హామీల పై ప్రజలు తిరగబడి అడుగుతున్నారు. పోలవరం ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే ఉంది. విభజన తర్వాత రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి విస్తరణ లాంటి మాటలన్నీ నీటి మూటలయ్యాయి. చివరికి రాజధానే లేని రాష్ట్రంగా ఆంధ్రప్రేదేశ్ అవమానంతో తల దించుకుని ఉంది. ఉమ్మడి రాజధానిని వాడుకునే వీలు లేకుండా తెలంగాణాలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి తగువులతో తెగతెంపులు చేసుకుని వచ్చాడు బాబు. ప్రభుత్వ పనితీరు గురుంచి చెప్పుకోవడానికి ఏం లేకపోవడంతో చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రత్యేక హోదా వ్యవహారాన్ని ఒంటికి పులుముకుని రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఇన్నేళ్లుగా చంద్రబాబు రాష్ట్ర విభజన హామీల గురించి, హోదా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో హోదా సెంట్ మెంట్ ను అడ్డం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రభుత్వం చేసింది ఏం లేదుకనుక ప్రజల సెంటుమెంటు కోసం పోరాటం చేసామనైనా చెప్పుకుని ఎన్నికల బరిలోకి దిగాలన్నదే చంద్రబాబు ఆలోచన. 

తెలుగు ప్రజలను దగా చేసిన చంద్రబాబు

రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు పోకడ అందరూ చూసారు. గోడ మీద పిల్లిలాగా అటు తెలంగాణా, ఇటు ఆంధ్రాలో రాజకీయం నడిపాడు బాబు. అక్కడేమో తెలంగాణా సెంటిమెంట్ ను గౌరవిస్తున్నట్టు విభజన లేఖను కేంద్రానికి పంపానని, అందువల్లే తెలంగాణా వచ్చిందని ప్రచారం చేసుకున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు బాబును నమ్మలేదు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం గురించి అంతకు ముందు తెలిసి ఉండటంతో తెలంగాణాలో టిడిపి ని భూస్థాపితం చేసారు. ఇక ఆంధ్రాలో విభజనకు వ్యతిరేకం పాట పాడాడు. రాష్ట్రం ముక్కలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను నేనైతేనే అభివృద్ధి చేస్తానని నమ్మబలికాడు. దేశవ్యాప్తంగా బిజెపికి గాలి వీస్తుండటంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. రాష్ట్రంలో హీరోని అడ్డుపెట్టుకుని కులరాజీకీయాలకు తెరతీసాడు. ఇలా అన్ని వైపులా అరాచక రాజకీయం చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ కంటే కొద్ది మెజారిటీతో గెలిచి చావు తప్పి కన్ను లొట్టబోయిందనిపించాడు. 2014 లోనే కాదు చంద్రబాబు తన సొంత బలంతో ఎప్పుడూ గెలవలేదు. పరిస్థితులను తన అవకాశ వాద రాజకీయాలకు పావులుగా వాడుకోవడం బాబు చేసే పని. 

హోదాని కూడా అస్త్రంగా వాడుకుంటూ

ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలన్న నోటితోనే హోదా ఏమైనా సంజీవనా అన్నాడు బాబు. నాలుగేళ్ల అవినీతి పాపం పండి, ఎన్నికల సమయం దగ్గరవ్వగానే బాబు ధోరణి మారింది. ప్రత్యేక హోదా తెలుగు ప్రజల సెంటిమెంట్ అని, దాన్ని పట్టించుకోరా అంటూ కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నానని చెబుతున్నాడు. ప్రతిపక్ష పార్టీ అధినేత గత నాలుగేళ్లుగా ప్రజల్లో హోదా స్ఫూర్తిని రగిలిస్తూ, ఆ సెంటిమెంట్ సజీవంగా ఉండేలా కృషి చేసారు. వరుస కార్యక్రమాలతో ప్రత్యేక హోదా ఆశను ప్రజల్లో సజీవంగా నిలపగలిగారు. ఇన్నేళ్లూ ప్రతిపక్షనేత హోదా గురించి మాట్లాడిన ప్రతిసారీ విమర్శించి, వెటకారం చేసిన టిడిపి అధినేత నేడు సిగ్గు వదిలి హోదా 5 ఐళ్లైనా ఇవ్వండని కేంద్రాన్ని బతిమాలుతున్నాడంటే...అది కేవలం వైఎస్ జగన్ ఘనతే. అటు ప్రజల్లోనే కాదు ప్రభుత్వం, ఇతర పార్టీల నేతల గుండెల్లోనూ గుబులు పుట్టించి, హోదా గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు ఆయన కల్పించారు. హోదా కంటే ప్యాకేజీ బెస్టు అన్న బాబును హోదా పోరాటంలోకి దింపగలిగారు. అయితే ఈ పరిస్థితిని కూడా బాబు తనకు అనుకూలంగా మలుచుకుంటాడనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పేదేం లేదు కనుక ప్రత్యేక హోదా సెంటిమెంట్ నే ఎన్నికల్లో వాడుకోవడానికి బాబు పథక రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బిజెపి మోసం చేసిందని నెపాన్ని మోదీపై నెట్టి, హోదా హామీ ఇచ్చే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పే అవకాశాలు లేకపోలేదని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇంతకీ అలాంటి హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ నుంచి రాహులు గాంధీ సంకేతాలు ఇస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని మునుముందు కాంగ్రెస్ తో ఉన్న రహస్య మైత్రిని బహిరంగం చేసి, పొత్తుకు బాబు సిద్ధపడవచ్చన్నది విశ్లేషకుల మాట. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్సే రేపు హోదా విషయంలో న్యాయం చేస్తుందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో టిడిపి అధినేత ఉన్నట్టు సమాచారం. 






 
Back to Top