బాబుకు సండ్ర సురక


నారా చంద్రబాబు నాయుడుకు మళ్లీ గుబులు మొదలైంది. తగుదునమ్మా అంటూ తెలంగాణా ఎన్నికల్లో వేలుపెట్టి చెయ్యి కాల్చుకున్నది చంద్రబాబు అండ్ కూటమి. 14 సీట్లలో పోటీ చేస్తే రెండు స్థానల్లో మాత్రం గెలుపొంది చావు తప్పి కన్ను లొట్టపోయింది తెలుగుదేశం అధినేతకు. ఈ దెబ్బ నుంచి ఇంకా తేరుకోకుండానే ఎపి ఎన్నికల్లో మేమూ కలుగ చేసుకుంటాం అని తెలంగాణా అధినేత కేసీఆర్ స్వయంగా చెప్పాడు. చంద్రబాబుకు రిటన్ గిఫ్ట్ కూడా ఇస్తానని కన్నుకొట్టాడు. మరోపక్క అసదుద్దీన్ ఓవైసీ కూడా జగన్ కోసం నేను ప్రచారానికి వస్తున్నా అని పత్రికాముఖంగా ప్రకటన ఇచ్చాడు. ఈ వ్యవహారంతోనే తలబొప్పి కట్టి ఉన్న చంద్రబాబుకు గెలిచిన ఇద్దరు అభ్యర్థులూ టిఆర్ఎస్ లోకి జంప్ చేయబోతున్నారనే వార్త సురకలా అంటుతోంది. ఇదే జరిగితే తెలంగాణాలో టిడిపి ఇక సమాప్తం అయ్యిందని అర్థం.  
అయితే దీనికి మించిన గుండె దడ ఒకటి చంద్రబాబును వణికిస్తోందట. తెలంగాణాలో గెలిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య తెరాసాలో చేరడం ఖరారైతే బాబుకు పెద్ద షాకే తగిలే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితో పాటు సండ్ర వెంకటవీరయ్య కూడా నిందితుడే. రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కేసీఆర్ పై అంతెత్తు ఎరిగి ఎగిరి చివరకు ఓడిపోయి మూలకూర్చున్నాడు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసమే అని బీరాలు పలికిన రేవంత్ మాట మీద నిలబడతాడో లేక గురువు చంద్రబాబులా మాట మార్చి అంతా తూచ్ అంటాడో చూడాలి. ఒక వేళ రేవంత్ రాజకీయాల్లో కొనసాగినా తెరాసా ధాటికి ఎన్నాళ్లు ఎదురు నిలవగలడో అన్నది అనుమానస్పదమే. ఇలాంటి సమయంలో సండ్ర తెరాసా తీర్థం పుచ్చుకుంటే బాబు గుబులు పెరగడం ఖాయం. ఓటుకు నోటు కేసును తిరగదోడటం కనుక జరిగితే ఎపిలో చంద్రబాబు, తెలంగాణాలో రేవంత్ రెడ్డికి సండ్ర వెంకటవీరయ్య ఎదురు తిరిగే అవకాశం ఉంది. బాబు మార్కు రాజకీయం చేసి కేసీఆర్ కూడా సండ్రకు మంత్రి పదవో, మరో పదవో కట్టపెడితే ఇక బాబుకు బాకు దిగినట్టే అంటున్నారు టిడీపీ నేతలు. మొత్తానికి సండ్ర పెట్టే చురకతో చంద్రబాబుకు ఓటుకు నోటు మంట మళ్లీ రగలడం ఖాయం అయ్యేలా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
 

తాజా వీడియోలు

Back to Top