బాబు హెచ్చరికలు ఎవరికి..?



– ఢిల్లీలో హడావుడి ప్రెస్‌మీట్‌తో ఏం చెప్పారు
– హోదా కోసం భవిష్యత్‌ ప్రణాళిక ప్రకటించలేదే 
– చక్రం తిప్పుతానని అవిశ్వాసంతో ఏం సాధించారు

పాడిందే పాడరా పాసిపళ్ల సాంబడా అని.. ఎప్పుడు మైకు దొరికినా తాను చెప్పాలనుకున్నది చెబుతాడే తప్ప.. ఏది అవసరమో మాట్లాడే అలవాటు చంద్రబాబుకు లేనే లేదు. కార్యక్రమం ఏదైనా.. ప్రాంతం ఎక్కడైనా తన గురించి ఒక రీల్‌ ఉండాల్సిందే అక్కడ. పార్లమెంట్‌ టీడీపీ అవిశ్వాసం పెట్టింది.. మోడీ దానిని తుత్తునియలు చేస్తూ మాట్లాడాడు. చంద్రబాబే ప్యాకేజీకి అంగీకరించాడని టీడీపీ ఎంపీల నోర్లు మూయించాడు. అవిశ్వాసంతో ఏమొస్తుందని ఆనాడు గర్జించిన చంద్రబాబే.. సభలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు లేకపోవడమే అదనుగా భావించి.. కాంగ్రెస్‌ అండగా అవిశ్వాసం ప్రవేశపెట్టాడు. అయితే ఏం సాధించాడు అంటే ఏం లేదు. ఆ పార్టీ ఎంపీలు కేంద్రాన్ని కానీ.., మోడీని కానీ ఏమైనా నిలదీశారా అంటే అదీ లేదు. కొత్త విషయాలు ఏవైనా చర్చకు తీసుకొచ్చారా. ఎందుకు లేదు. అన్నీ కొత్తవే. అవన్నీ నాలుగేళ్లుగా జగన్‌ చెప్పేవే కదా అంటారా. ఏపీ జనాలకు, వైయస్‌ఆర్‌సీపీ నాయకులకు పాతవి కావొచ్చుకానీ.. ఆ పార్టీకి మాత్రం కొత్తవే. కాకపోతే కాపీ కొట్టారనుకోండి అది వేరే విషయం. ఎవరేం మాట్లాడినా ఏపీకి ప్రత్యేక హోదా రావడమే కావాలి. అందరికీ మంచి జరగాలి. 

పార్లమెంట్‌లో మోడీ ఇచ్చిన షాక్‌కు సీఎం చంద్రబాబుకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. రాహుల్‌ గాంధీని న‌మ్ముకుంటే ఆయన కనీసం అర నిమిషం కూడా ఏపీకి ప్రత్యేక హోదా మీద మాట్లాడలేదు. దేశమంతా అన్ని మీడియా ఛానెళ్లు మోడీని హైలెట్‌ చేశాయి. అవిశ్వాసంతో చంద్రబాబు చక్రం తిప్పుతాడని ఎల్లో వాయించేస్తే ఇలా జరిగిందేంటా అని వారికి అర్థం కాలేదు. ఇంకేం చేస్తారు. హడావుడిగా ప్రెస్‌ మీట్‌ పెట్టి పాత ప్రసంగం ఒకటి చదివేశాడు. లోకల్‌ మీడియాలో అలా కవరేజ్‌ చేసేశాడు. మరి జాతీయ మీడియా సంగతేంటి. అదే ప్రసంగపాఠాన్ని గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌లో తెలుగు నుంచి ఇంగ్లిష్‌ నుంచి అనువదించుకుని వచ్చేసి చదివేశాడు. వినేవాళ్లకి ఏం చెబుతున్నాడో అర్థమైనట్టూ కానట్టు జరుగుతుండగా ఇంతలో మైకు పనిచే యలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆడియో నాట్‌ విజిబుల్‌ అని నవ్వులు పూయించాడు. వన్‌ టూ త్రీ మైక్‌ ఓకే.. అలా హడావుడిగా కానిచ్చేశాడు. ఫైనల్‌గా తనకు ఎవరిపైనా శత్రుత్వం లేదని, రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించేది లేదని ఆయన మరోసారి విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. అసలు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయడంలో బీజేపీతో పాటు టీడీపీ పాత్ర ఉందని జగమంతా కోడై కూస్తుంటే, మరి ఈయన ఎవరిని సహించనని హెచ్చరిస్తున్నారో అర్థంకావడం లేదు.

Back to Top