బాబు ద్వంద నీతి


నాలిక్కి నరం లేదంటారు...అదే తీరుగా చంద్రబాబు మాటలకు విలువ లేదు. హోదా కోసం తీవ్రమైన ఉద్యమం నడుస్తోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్.పిలు ప్రాణాలకు తెగించి హోదా కోసం నిరాహారదీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ హోదా మాటకు కట్టుబడి ఉంటామంటున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం తన నాలుక తిరుగుడు బుద్ధికి పులిస్టాప్ పెట్టడం లేదు. హోదా ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతుంటే సైకిల్ ర్యాలీలు, ప్రధాని ఇంటి ముందు మెరుపు ధర్నాలు అంటూ సిల్లీ సిల్లీ చిల్లర వేషాలు వేస్తున్నాడు. పార్లమెంట్లో  ప్రధాని సీట్లో లేనప్పుడు టిడిపి ఎమ్.పిలు నిరసన ప్రదర్శించారు. స్పీకర్ ఛాంబర్లో లేనప్పుడు ఛాంబర్ బైట ధర్నా చేసారు. ప్రధాని నివాసంలో లేనప్పుడు చూసుకుని వచ్చి మెరుపుధర్నా అంటూ డ్రామా ఆడారు. అది కూడా షార్ట్ ఫిలిం లాగా కొద్ది గంటల్లో ఎండ్ అయిపోయింది. 
ఢిల్లీలో ఎమ్.పిలతో చిత్ర చిత్ర వేషాలు, విచిత్రమైన విన్యాసాలు చేయిస్తున్న బాబు, ఇటు రాష్ట్రంలో అధికారులను తన తలతిక్క వాఖ్యలతో ఫుట్ బాల్ ఆడేస్తున్నాడు. ఢిల్లీలో ఎమ్.పిలు చేసిన విధంగానే అధికారులు కూడా హోదా కోసం పోరాటాలు చేయాలంటూ చంద్రబాబు చెప్పడం అధికారులను విస్మయపరిచింది. అసలే పద్ధతిలో తమను పోరాడమని సిఎమ్. చెబుతున్నారో అర్థం కాక అధికారులు మిన్నకుండిపోయారు. ప్రతిపక్ష పార్టీ వేగవంతమైన చర్యలకు, హోదా ఉద్యమానికి వారికి లభిస్తున్న మద్దతును చూసి బాబుకు మతిగానీ పోయిందేమో అని అనుకున్నారు కొందరు సీనియర్ అధికారులు. 

2016 నుంచీ ప్రత్యేక ప్యాకేజీని వ్యతిరేకించి ప్రత్యేక హోదా కావలని డిమాండ్ చేసిన విపక్షాన్ని, ఇతరులను రాజకీయ ద్రోహులుగా, అభివృద్ధి నిరోధకులుగా ముద్రించే ప్రయత్నం చేసాడు బాబు. ఇప్పుడు అదే బాబు తను చేసే డ్రామెటిక్ ఉద్యమానికి మద్దతు ఇవ్వని వారు ద్రోహులు అంటున్నాడు. అఖిలపక్షానికి రానివాళ్లు, తన మాటను నమ్మని వాళ్లూ ఇప్పడు దోషులు, ద్రోహులు అని బాబు ఉద్దేశ్యం. నాలుగేళ్లుగా సాగించిన తన నిర్లక్ష్యాన్ని, చేతగానితనాన్ని కప్పి పుచ్చుకోడానికి Nఈఅ తో తెగతెంపులు చేసుకున్నాను, అందరూ సాయం రండి, కేంద్రంతో భీభత్సంగా పోరాడి హోదా తెస్తాను, నాకు సాయం చేయని వాళ్లు ద్రోహులు అని గొంతు చించుకుంటున్నాడు. 
హోదా కోసం శాంతియుత ధర్నా చేసేందుకు వైఎస్ జగన్  విశాఖపట్నానికి వెళ్తే ఎయిర్ పోర్టులోనే ఆపి, బలవంతంగా వెనక్కు పంపిన ప్రభుత్వం చిత్త శుద్ధితో హోదా కోసం పోరాడుతోందట.

కమ్యూనిస్టుల హోదా పోరాటాల గురించి చాలా అవహేళనగా మాట్లాడిన బాబుకు ఇప్పుడు ఆ వామపక్షాల మద్దతే కావాల్సి వచ్చిందట. 
బాబు గత పాలనా కాలంలో అయినా, ఈ నాలుగేళ్లలో అయినా ఒక్క ప్రజా ఉద్యమాన్ని గానీ, ప్రతిపక్షల పోరాటాన్ని గానీ సవ్యంగా జరగనిచ్చాడా? అధికారం, పోలీస్ జులుంతో అన్యాయంగా అణిచేసాడు. 
అలాంటి బాబు అండ్ కో ఇప్పుడు ఢిల్లీలో తమ ఎమ్.పిలను ఈడ్చేసారని, వ్యాన్ లో ఎక్కించేసారని తెగ మదన పడిపోతోంది. ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తే ఇలా అరెస్టులు చేస్తారా అంటూ చేతులు నొక్కుకుంటోంది. 
మరి గతంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా విపక్ష ఎమ్.ఎల్.ఎల ఆమరణ నిరాహారదీక్షల సమయంలో  బషీర్ బాగ్ లో కాల్పులు జరిపించినప్పుడు బాబుకు ఈ న్యాయాన్యాయాలు గుర్తుకు రాలేదు.

వేతనాలు పెంచమన్న అంగన్ వాడీ టీచర్లు, ఆయాల మీదకు గుర్రాలను తోలిచ్చిన సంఘటనలు బాబు నిరంకుశత్వానికి ఉదాహరణలు. 
తుందుర్రు ఆక్వాపార్క్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న గ్రామస్తులను పోలీసు బలగాలతో ఆపి, ప్రజెక్టు శంకుస్థాపన చేసి, ఆ ఊరి ప్రజలను నెలల తరబడి జైల్లో పెట్టినది కూడా సదరు ఈ బాబుగారే. ఇప్పుడేమో ఆయనకు తమ ఉద్యమాన్ని కేంద్రం అణగదొక్కేస్తోందని వాపోతున్నారు. 
ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం అందర్నీ మద్దతు అడుగుతున్న బాబు ముందు హోదా కోసం ఉద్యమాలు చేసిన వారిపై పెట్టిన తప్పుడు కేసులన్నిటినీ ఎత్తేసి అప్పుడు అడగాలి. 

బాబు తత్వమే అంత. తాను చేస్తే సంసారం పక్కోడు చేస్తే...ఇంకేదో అంటాడు. తాను రహస్యంగా కాంగ్రెస్ నేతలను కలిస్తే తప్పు లేదంటాడు. ప్రతిపక్షం కేంద్రంలో ప్రధానిని, మత్రులను కలిస్తే మంతనాలంటాడు. తనకు జరిగితే అన్యాయం అంటాడు. ఎదుటివారికి పట్టేది అధోగతి అంటాడు. విరుద్ధమైన మాటలు, విబేధించే చేతలు ఇదే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం. 

 
Back to Top