<br/>ప్రకృతిని హాండిల్ చేస్తున్నాం కానీ ప్రతిపక్షాన్ని హాండిల్ చేయలేకపోతున్నాం అని వగరుస్తున్నార్ట చంద్రబాబుగారు. అవును మరి మొన్నటి హుద్ హుద్, నిన్నటి తిత్లా ప్రకృతి ప్రమాదం ఏదైనా తెలుగుదేశం నాయకుడు, ముఖ్యమంత్రిగారు వాటిని మహా గొప్పగా హాండిల్ చేసేస్తున్నారు. పైగా టెక్నాలజీ ఉపయోగించి తుఫానులో సహాయక చర్యలు చేస్తున్నార్ట. పాదాలు తడిసే నీటిలో కూడా బోట్లో ప్రయాణించే చంద్రబాబు గారు, తుఫాను రక్షణ చర్యలు శరవేగంగా తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. నాలుగేళ్ల కిందటి తుఫాను బాధితులకు నేటికీ సాయం ఇవ్వని ముఖ్యమంత్రిగారు తిత్లీను హాండిల్ చేసాసాని చెబుతున్నారు. ఈయన ఉద్దేశ్యంలో హాండిల్ చేయడమంటే ఏమిటో ? కోట్లాది రూపాయిల నష్టం కలిగించిన హుద్ హుద్ తుఫాను విశాఖలో 5వేలమందికి నిలువనీడ దూరం చేసింది. ఇళ్లు కట్టిస్తామని, బాధితులకు అండగా ఉంటామని నాడు చంద్రబాబు చేసిన హామీ నేటికీ నెరవేరలేదు. ఇప్పుడిక తిత్లీ బాధితుల వంతు వచ్చింది. విశాఖాలో లబ్దిదారుల ఎంపికకే నెలలకు నెలలు తాత్సారం చేసి, రాజ్యాంగేతర శక్తులైన జన్మభూమి కమిటీలకు లబ్దిదారుల ఎంపిక బాధ్యతను కట్టబెట్టారు. వారు చెప్పిన వాళ్లకు తప్ప నిజమైన అర్హులకు ఇళ్లు మంజూరు కాలేదని అప్పట్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. రెండేళ్ల కిందటే పూర్తవ్వాల్సిన ఆ ఇళ్లు నేటికీ పూర్తి కాలేదు. ఇదేం ఖర్మమో గానీ నాలుగేళ్ల కింద అక్టోబర్ లో వచ్చి అతలాకుతలం చేసిన తుఫాను నాలుగేళ్ల తర్వాత మరోసారి అదే నెలలో విరుచుకుపడింది. ఉత్తరాంధ్రవాసులకు గతంలో ఇచ్చిన హామీలే నెరవేర్చని ముఖ్యమంత్రి మళ్లీ ఈ కొత్త ఉపద్రవానికి సంబంధించి ఎన్ని హామీలు ఇస్తాడు. అవెప్పటికి నెరవేరుస్తాడో మాకు తెలియదా అనుకుంటున్నారు ప్రజలు. ప్రకృతిని హాండిల్ చేయడం కాదు, ప్రజలను మేనేజ్ చేయడం బాబుగారు చేస్తున్నపని. విపత్తుల పేరుతో వసూలు చేసిన కోట్లు ఎక్కడికి చేరుతున్నాయో, ఎవరి జేబులు నింపుతున్నాయో ఎవ్వరికీ తెలియదు. ప్రజలను మేనేజ్ చేసినట్టు ప్రతిపక్షాన్నీ మేనేజ్ చేయాలనుకుని విఫలమౌతున్నారు చంద్రబాబు. ఆ ఫస్ట్రేషన్ లోనే నిజాలను బైటపెడుతున్నారు. ప్రభుత్వం చేసే అవినీతి, ప్రభుత్వ అలసత్వం, చంద్రబాబు నిష్ప్రయోజకత్వాన్ని ప్రజల ముందు బైటపెట్టిన ప్రతిపక్ష నాయకుడిని చూస్తేనే ఆయన వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే విపత్తును హాండిల్ చేస్తున్నాం ప్రతిపక్షాన్ని చేయలేకపోతున్నాం అని తన అసమర్థతను బైటికే చెబుతున్నారు చంద్రబాబు. విపత్తులతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు స్వచ్ఛంద సంస్థలు, యువత, సోషల్ మీడియా కార్యకర్తలు చేసినంత సాయాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయలేదన్నది వాస్తవం. ఇలాంటి విపత్తులోనూ తన హెరిటేజ్ కంపెనీ నుండే పాలు సరఫరా చేసి సొంత కంపెనీకి ప్రయోజనాలు కల్పించిన స్వార్థపూరిత వ్యాపరవేత్త చంద్రబాబు. ఇలాంటి నాయకుడికి రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపించే తీరతామంటున్నారు ఉత్తరాంధ్రప్రజానీకం.