బాధలు వింటూ.. భరోసానిస్తూ


‘తాగడానికి నీళ్లు లేవు... రెండు, మూడు గంటలకు మించి కరెంటు ఉండదు... చేన్లకు నీళ్లు లేవు.. పింఛన్లు ఎత్తేశారు... ఫీజులు కట్టలేక పిల్లలు చదువు మానేశారు... నవంబర్ వచ్చినా స్కూల్లో యూనిఫారాలు లేవు... వలంటీర్ టీచర్లకు జీతాలు లేవు...’

- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు చెపుతున్న సమస్యల్లో ఇవి కొన్ని.


ఎమ్మిగనూరు:

షర్మిల పాదయాత్ర చేస్తూ వస్తున్నారని తెలియగానే వ్యవసాయ పనులు పక్కన బెట్టి రైతులు... కూలీ పనులు మానుకొని మహిళలు... బస్సులు, ఆటోల్లోని ప్రయాణీకులు... గుంపులు గుంపులుగా తరలివస్తూ జగన్ సోదరికి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వ పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకొని జగనన్నకు చెప్పేందుకే తాను వచ్చానన్నారు. జిల్లాలో పదోరోజు పాదయాత్రలో భాగంగా శనివారం షర్మిల ఎమ్మిగనూరు మండలంలోని గణేశ్ రైస్‌మిల్ నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. కలుగొట్ల, కె. తిమ్మాపురం, దైవం దిన్నెల గుండా కోడుమూరు నియోజకవర్గంలోని కంపాడ్‌లోకి ప్రవేశించించారు. 15 కిలోమీటర్ల పాదయాత్రలో షర్మిలకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు.

రాత్రి వరకు ప్రజల బాధలు వింటూనే...

     ఉదయం పాదయాత్ర ప్రారంభమైన తరువాత కలుగొట్ల వద్ద మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి కూర్చొని షర్మిలకు తమ బాధలు చెప్పుకున్నారు. మహానేత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పటి పరిస్థితి... ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించారు. పెరిగిన ఎరువుల ధరలు, కరెంటు లేక బోర్లు పనిచేయక ఎండుతున్న పంటలు, పండిన పంటలకు మద్ధతు ధర లేకపోవడం, ఉపాధి హామీ పథకంలో కూలీలకు రూ. 30 కూడా ఇవ్వని పరిస్థితి... ఇలా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. షర్మిల ఓపిగ్గా విని ధైర్యం చెప్పారు. భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు.

Back to Top