ఆరోగ్యం ఎండమావే

 • అరకొర నిధులతో ఐసీయూలో ఆరోగ్యశ్రీ పథకం
 • పేరు మార్చి నీరు గార్చేందుకు బాబు కుట్ర
 • ప్రయివేటుకు దోచి పెట్టడంపైనే సర్కారు శ్రద్ద
 • ఇన్సూరెన్సు పేరిట కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాబు 
 • ‘ఆరోగ్య రక్ష’ ఇన్సూరెన్స్‌ కంపెనీలకే వరం  

 • ఒకప్పుడు ఎంతటి తీవ్ర అనారోగ్య తలెత్తినా మాకేంటి భయం ఆరోగ్యశ్రీ ఉండగా అనే దీమా ప్రజల్లో ఉండేది. సామాన్యుడు గుండెధైర్యంతో ఉన్న రోజుల్నుంచి ఇప్పుడు ఆరోగ్యం పాడైతై ఇళ్లూ, పొలాలు అమ్ముకునే దుర్గతి పట్టింది రాష్ట్రానికి. మహానేత మరణంతో రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ దారుణంగా పడిపోయింది. ఆరోగ్యశ్రీని ఐసీయూలో జీవచ్ఛవంలా ఉంచి చాలీచాలని నిధులతో చంద్రబాబు ‘ఆరోగ్య సేవ’ చేస్తున్నాడు. ఒకప్పుడు మహానేత హయాంలో పేదోడికి వైద్యం చేసే అవకాశం మా ఆస్పత్రికి కల్పించాలని ఎగబడిన కార్పొరేట్‌ ఆస్పత్రులు నేడు నిధులివ్వకుండా ఉచితంగా పేదోడికి వైద్యం చేయాలా..? అనే స్థితికి తీసుకొచ్చిన ఘనత ముమ్మాటికీ చంద్రబాబుదే అనడం అతిశయోక్తి కాదు. చాలీచాలని నిధులు కేటాయించి వైద్యం సామాన్యుడికి ఎండమావిలా మార్చేశాడు. ఏపీలో వైద్య సేవలు కాసులు చెల్లించేవాడికే సేవలందించే పరిస్థితులు కల్పించాడు. నిరుపేదలు కష్టమొస్తే ఆశగా చూసేది ప్రభుత్వాసుపత్రులవైపే. అయితే ప్రజల ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం పక్కకు తప్పుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రభుత్వాసు పత్రులను భారంగా భావిస్తున్నారు. ప్రతి ఆరోగ్య సేవను ఏదో రకంగా ఏదో ఒక కార్పొరేట్‌ సంస్థకు అప్పగిస్తూ చేతులు దులుపుకుంటున్నాడు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అపోలోకు ఇవ్వడంతో మొదలైన ప్రయివేటు పరంపర అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

  ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకే 
  ప్రభుత్వాసుపత్రులు పడకేశాయి.. ప్రైవేటు ఆసుపత్రులు కళకళలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్ని నిర్వీర్యం చేసి, ప్రైవేటు ఆసుపత్రుల్ని ఉద్ధరించడానికి ’ఆరోగ్యశ్రీ’ తెరపైకొచ్చింది. అయితేనేం, అప్పటికే పడకేసిన ప్రభుత్వాసుపత్రులతో సతమతమవుతున్న పేద ప్రజానీకానికి ఆరోగ్యశ్రీ కొండంత వరంగా మారింది. ఓ పక్క ఆరోగ్యశ్రీని సమర్థవంతంగా అమలు చేస్తూనే, ఇంకోపక్క ప్రభుత్వాసుపత్రులకు వైద్య చికిత్స చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని పేరు మార్చి ‘ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవ’గా మార్చి సర్కారు వైద్యానికి చివరి రోజుల్లో ఎన్టీఆర అనుభవించిన పరిస్థితి దాపురించేలా చేశారు. ఇక, అసలు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ’అందరికీ వైద్యం’ అంటూ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. పేరు ఆరోగ్య రక్ష. నిన్ననే నూతన సంవత్సర కానుకగా చంద్రబాబు ఈ పథకంపై తొలి సంతకం కూడా చేసేశారండోయ్‌. పేరు చూస్తే ఇదేదో ఉచిత పథకం అనుకునేరు. కాదు కాదు, నెలకి వంద రూపాయల చొప్పున ఏడాదికి 1200 రూపాయలు కడితేనే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వర్తిస్తుంది. అద్గదీ అసలు విషయం. ప్రైవేటు ఇన్సూర్సెన్స్‌ కంపెనీలు చేసేదే ఇది. దానికి ’ప్రభుత్వ’ కలర్‌ చంద్రబాబు అద్దారంతే. ప్రైవేటు ఇన్సూరెన్స్‌ పాలసీలతో పోల్చితే ప్రీమియం చాలా తక్కువన్నది చంద్రబాబు ఉవాచ. ఓ పక్క ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య సేవ) ఎటూ అందుబాటులో వుంది. ఇంకోపక్క చిన్న పిల్లల కోసం, మహిళల కోసం, వృద్ధుల కోసం రకరకాల పథకాలు అమల్లో వున్నాయి. మరి అలాంటప్పుడు, కొత్తగా ఈ ’ఇన్సూరెన్స్‌ పాలసీ’ అవసరం ఏంటట.? ఇక్కడే వుంది అసలు మతలబు. ప్రైవేటు కంపెనీల్ని ఉద్ధరించాలి కదా, ఆ ముసుగులో కోట్లు వెనకేసుకోవాలి కదా.!

  దయనీయంగా ధర్మాసుపత్రులు..
  ప్రజల్ని ఉద్ధరించాలంటే, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ప్రజలు ప్రభుత్వాసుపత్రులవైపు దృష్టి సారించేలా ప్రభుత్వాసుపత్రుల్లో వసతుల్ని పెంచాలి. ప్రభుత్వాసుపత్రుల దయనీయ స్థితి గురించి కొత్తగా చెప్పేదేముంది.. అన్ని పత్రికల్లోనూ కథనాలు వస్తూనే వున్నాయి. అయినా, వాటిని పట్టించుకోరంతే. మచ్చుకి ఓ ఉదాహరణ.. ఎలుకల ఆసుపత్రిలో (అదేనండీ, గుంటూరు ప్రభుత్వాసుపత్రి) మంత్రి కామినేని శ్రీనివాస్‌ శస్త్ర చికిత్స చేయించుకుంటే సరిపోతుందా.? ఆ స్థాయి వైద్యం అందరికీ అందాలి కదా.! గుంటూరు జీజీహెచ్‌లో చీమలు కుట్టి చిన్నారి చనిపోవడం.. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో స్టేచర్‌ ఇవ్వలేదని ఓ మహిళ తన భర్తను పైకి తీసుకెళ్లేందుకు మరో దారిలేక ఈడ్చుకెళ్లడం ఎందర్నో కన్నీరు పెట్టించింది చంద్రబాబును తప్ప. ఆస్పత్రుల్లో భద్రత కరువై పొత్తిళ్ల నుంచే చిన్నారులను అపహరిస్తున్న ఘటనలైతే కోకొళ్లలు ఇలాంటి విషయాలు మాత్రం ఆయనకు పట్టవు. ఎంతసేపటికీ ప్రయివేటు మీదే చంద్రబాబుకు మోజు. వారు బాగుంటే చాలు. ఓట్లేసిన ప్రజలు ఏమైపోయినా చంద్రబాబుకు పట్టదు. అదేమరి చంద్రబాబు దృష్టిలో ప్రజాస్వామ్య రాజకీయం.

  ఇక ప్రయివేటు చేతుల్లోకి వైద్యరంగం 
   రక్త పరీక్షల నిర్వహణ, డయాలసిస్‌ కేంద్రాలు, 104 సేవలు, వైద్య పరికరాల నిర్వహణ, ఎక్స్‌రే సేవలతోపాటు పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఇ–యూపీహెచ్‌సీ పేరుతో కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పారు. వైద్య సేవల విషయంలో ఇవన్నీ ఘోరంగా విఫలమైనా ప్రభుత్వం మాత్రం ప్రయివేటు సంస్థలకు దోచిపెట్టడానికే మొగ్గుచూపుతోంది. తాజాగా మరిన్ని సేవలు పీపీపీ (పబ్లిక్‌ ప్రయివేట్‌ పార్ట్‌నర్‌షిప్‌) విధానంలో అప్పగించమని వైద్యశాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఇందులో ప్రధానంగా గుండెకు సంబంధించిన క్యాత్‌ల్యాబ్‌లున్నాయి. పెద్దాసుపత్రుల్లో ఏర్పాటు చేసే ఈ క్యాత్‌ ల్యాబ్‌ల కోసం ప్రవేటు సంస్థలకు భారీగా చెల్లించనున్నారు. దీంతోపాటు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ మెషీన్లు, స్కిల్‌ ల్యాబ్‌లు, ల్యాండ్రీ సర్వీసులను కూడా ప్రైవేటుకు ఇవ్వాలని సూచించారు. కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తూతూ మంత్రంగా టెండర్లు పిలిచి తమకు నచ్చిన వారికి కట్టబెట్టే ఆలోచన జరుగుతోంది.

  డెస్క్‌ మేనేజ్‌మెంట్‌ అంతా ప్రయివేటుకే 
  ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు కాకుండా దానికి అనుబంధంగా ఉండే మల్టీ పర్పస్‌ సపోర్టు సర్వీసులన్నీ (అడ్మినిస్ట్రేషన్, నిర్వహణ బాధ్యతలు తదితర) పీపీపీ పద్ధతిలో ప్రయివేటకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవలన్నీ ప్రయివేటుకు ఇచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నవంబర్‌ 22న జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులు ఇచ్చిన సమాచారం. 

తాజా ఫోటోలు

Back to Top