అప్రతిహతంగా సాగుతున్న 'మరో ప్రజాప్రస్థానం'

మహబూ‌బ్‌నగర్,

25 నవంబ‌ర్ 2012: వైయ‌స్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు వై‌యస్ జగన్మోహ‌న్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో అప్రతిహతంగా కొనసాగుతోంది. షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఊళ్లకు ఊళ్లే ఆమె వెంట ‌పదం కలుపుతున్నాయి. కదం తొక్కుతున్నాయి. రాజన్న రాజ్యం రావాలని.. తమ కష్టాలు తీర్చాలని జనం నినదిస్తున్నారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు వేల సంఖ్యలో షర్మిల వెంట నడుస్తున్నారు. కిలో రూపాయి బియ్యం ఇవ్వడం లేదని, పింఛన్లు ఆపేశారంటూ షర్మిల వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పి రైతన్నలు తమ కష్టాలు విలపిస్తున్నారు.

     దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైద్య సేవలు అందించే 108, 104 వాహనాలు కుయ్.. కుయ్..మంటూ క్షణాల్లో వచ్చేవని షర్మిల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలు గుర్తు చేసుకున్నారు. అనారోగ్యానికి గురైతే ఆరోగ్యశ్రీ కింద పెద్ద పెద్ద కార్పోరేట్ ఆస్పత్తుల్లో చికిత్స ‌చేయించుకునే అవకాశం తమకు ఉండేదని అంటున్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ సదుపాయాలు తమకు అందకుండా పోతున్నాయని నిరుపేదలు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

     షర్మిల చేస్తున్న పాదయాత్రకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. షర్మిలకు దారి పొడవునా జనం నిలబడి సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. మరోవైపున వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లు ప్రత్యక్షంగా చూస్తున్న, వింటున్న షర్మిల వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని అన్ని సమస్యలూ తీరుతాయని భరోసా ఇస్తున్నారు. అప్పటి వరకు ఓపిక పట్టాలని షర్మిల ఇస్తున్న హామీతో ప్రజలు ఊరట చెందుతున్నారు.

కుట్రలు, కుతంత్రాలు

     ప్రజల కష్టాలపై జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాలు చూసి ఓర్వలేకనే పాలక, ప్రతిపక్ష పార్టీలు కుట్ర పన్నాయని షర్మిల పలు చోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదనే భయంతోనే జగనన్నను ఆ పార్టీ అన్యాయంగా జైలులో పెట్టించాయని దుయ్యబడుతున్నారు. కాంగ్రెస్, టీడీపీల కుట్రలు, కుతంత్రాలు ఎంతోకాలం సాగవని, ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని షర్మిల వజ్ఞప్తి చేస్తున్నారు. జగనన్న సీఎం అయితే ప్రజల కష్టాలు తీరిపోతాయని, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇస్తున్నారు.

     ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ, దానికి వంత‌ పాడుతున్న టీడీపీల వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం యాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో నాలు‌గో రోజు కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం నాటికి షర్మిల ‌పాదయాత్ర 55.6 కిలో మీటర్లు పూర్తి కానుంది. వైయస్ఆ‌ర్ కడప జిల్లాలోని ఇడు‌పులపాయ నుంచి అక్టోబర్‌ 18 ప్రారంభమైన షర్మిల పాదయాత్ర అనంతపురం, కర్నూలు జిల్లాల మీదుగా కొనసాగి మహబూబ్‌నగర్ జిల్లాలో ‌కొనసాగుతోంది.

తాజా వీడియోలు

Back to Top