వ్యవ‘సాయం’ భేష్‌

అన్నదాతకు ప్రతి అడుగులో అండగా ఏపీ ప్రభుత్వం 

ఆర్బీకేలతో గ్రామాల్లోనే రైతులకు సేవలు ప్రశంసనీయం

సాగు వ్యయం, ధరల కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌పాల్‌ శర్మ 

ఇలాంటి అద్భుత వ్యవస్థను ఇంకెక్కడా చూడలేదు

దేశవ్యాప్తంగా అనుసరించాలని కేంద్రానికి సూచిస్తాం

ఐసీసీ కాల్‌సెంటర్, ఆర్బీకే ఛానల్‌ వినూత్నం

జాతీయ స్థాయిలో కిసాన్‌ కాల్‌ సెంటర్లున్నా ఈ స్థాయిలో సేవలు అందడం లేదు

నాణ్యమైన ఉత్పాదకాల కోసం అగ్రి ల్యాబ్స్‌ భేష్‌

కియోస్క్‌ల ద్వారా వాతావరణ సమాచారం బాగుంది

గండిగుంట ఆర్బీకే కేంద్రం, కంకిపాడు అగ్రీ ల్యాబ్‌ సందర్శన

రైతులను కలుసుకుని సేవలపై స్వయంగా ఆరా తీసిన సీఏసీపీ చైర్మన్‌

అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తూ వ్యవసాయ విధానాల్లో ఆంధ్ర­ప్రదేశ్‌ ప్రభుత్వం వినూత్న మార్పులకు నాంది పలికిందని సాగు వ్యయం, ధరల కమిషన్‌ (సీఏసీపీ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ విజయ్‌పాల్‌ శర్మ ప్రశంసించారు. ఆర్బీకేలతో గ్రామ స్థాయిలో రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు అందరికీ ఆదర్శం, అనుసరణీయమని పేర్కొన్నారు. దేశ­వ్యాప్తంగా చర్చనీయంగా మారిన ఆర్బీకేలు తాను విన్నదాని కంటే మరింత గొప్పగా ఉన్నాయని కితాబిచ్చారు.

జాతీయ స్థాయిలో కిసాన్‌ కాల్‌ సెంటర్లు ఉన్నా ఏపీ స్థాయిలో సేవలందించడం లేదన్నారు. ‘వైయ‌స్ఆర్ రైతు భరోసా కేంద్రాలు నిజంగా ఓ అద్భుతం.. నాకు తెలిసి ఇలాంటి వ్యవస్థ దేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఎక్కడా లేదు’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా పంటల కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం (ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌), ఆర్బీకే ఛానల్‌ను సందర్శించారు.

రైతుల సందేహాలను కాల్‌ సెంటర్‌ సిబ్బంది శాస్త్రవేత్తల సహాయంతో ఎలా నివృత్తి చేస్తున్నారో స్వయంగా పరిశీలించారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ 155251కు వస్తున్న కాల్స్‌ను నిశితంగా గమనించారు. కాల్‌ చేసిన పలువురు రైతులను కాల్‌ సెంటర్‌ సేవల గురించి వాకబు చేశారు. పంటల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూపుల్లో రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న తీరును çపరిశీలించి అభినందించారు. శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. అనంతరం ఆర్బీకే ఛానల్‌ ద్వారా ప్రసారమవుతున్న రైతు ప్రాయోజిత కార్యక్రమాలను స్వయంగా తిలకించారు. చాలా బాగున్నాయంటూ కితాబిచ్చారు.

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల అధికారుల సలహాలు, సూచనలతో రూపొందిస్తున్న వీడియోలను పరిశీలించారు. తమ అనుభవాలను చానల్‌ ద్వారా తోటి రైతులకు వివరించేందుకు వచ్చిన ఆదర్శ రైతులతో ముచ్చటించారు. రైతు భరోసా మ్యాగ్‌జైన్‌ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. జాతీయ స్థాయిలో కిసాన్‌ కాల్‌ సెంటర్స్‌ పనిచేస్తున్నా ఈ స్థాయిలో సేవలందించడం లేదన్నారు. ఇదే రీతిలో అన్ని రాష్ట్రాల్లో కాల్‌ సెంటర్లు నెలకొల్పితే మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొంటూ ఐసీసీ సెంటర్‌ సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని పొందుపరిచారు.

గండిగుంట ఆర్బీకే సందర్శన..
 ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామానికి చేరుకొని ఆర్బీకే –2ను సందర్శించారు. ఆర్బీకే కేంద్రం డిజైన్, సౌకర్యాలను పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై ఆర్బీకేల ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అందిస్తున్న సేవలను ఆరా తీసారు. ఆర్బీకేలో సిద్ధంగా ఉన్న సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను స్వయంగా పరిశీలించారు. కియోస్క్‌ పనితీరును అడిగి తెలుసుకున్నారు.

కియోస్క్‌ను స్వయంగా ఆపరేట్‌ చేసి వాతావరణ సమాచారంతో పాటు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో రియల్‌ టైం మార్కెట్‌ ధరలను పరిశీలించారు. పంట కొనుగోలు కోసం ఉపయోగించే మాయిశ్చర్‌ యంత్రం (తేమ పరికరం) ఎలా పనిచేస్తుందో పరిశీలించారు. పొలంబడి ప్లాట్లను పరిశీలించి పెట్టుబడి ఖర్చులు తగ్గించేందుకు పాటిస్తున్న ఉత్తమ యాజమాన్య పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకే ద్వారా పాడి రైతులకు అందిస్తున్న మిశ్రమ దాణా, పశుగ్రాసం విత్తనాలను పరిశీలించారు.

ఆర్బీకేకు అనుబంధంగా ఏర్పాటు చేసిన వైయ‌స్ఆర్‌ యంత్రసేవా కేంద్రాన్ని సందర్శించి రైతులకు అందుబాటులో ఉంచిన ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలను పరిశీలించారు. అనంతరం రైతులను కలుసుకుని ఆర్బీకే ద్వారా అందిస్తున్న సేవలను ఆరా తీశారు. ఇప్పుడు గ్రామ స్థాయిలోనే తమకు అన్ని రకాల సేవలు అందుతున్నాయని రైతులు సీఏసీపీ చైర్మన్‌కు తెలిపారు. గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఏది కావాలన్నా మండల కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు.

సీజన్‌కు ముందే కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేలోనే అందుబాటులో సిద్ధంగా ఉంచుతున్నారని రైతులు వెల్లడించారు. ఆర్బీకేల వల్ల అన్నీ గ్రామంలోనే అందుబాటులో ఉండడంతో రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్‌ ఖర్చులు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. గతంతో పోలిస్తే తమ ప్రాంతంలో ఎక్కువగా సాగయ్యే వరి పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయని, ఏటా గోధుమలకు పెంచుతున్న స్థాయిలో వరికి మద్దతు ధరలు పెరగడం లేదని రైతులు సీఏసీపీ చైర్మన్‌ దృష్టికి తేవడంతో సానుకూలంగా స్పందిస్తూ పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ఆయన అక్కడ నుంచి నేరుగా కంకిపాడులోని వైయ‌స్ఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ను సందర్శించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సర్టిఫై చేస్తున్న తీరును పరిశీలించారు. నమూనాలు తీసుకొచ్చే రైతుల నుంచి ఏమైనా చార్జి వసూలు చేస్తున్నారా? అని ఆరా తీశారు. అలాంటిదేమి లేదని, రైతులపై పైసా భారం పడకుండా ఉచితంగానే సర్టిఫై చేసి ఫలితాలను తెలియజేస్తున్నామని సిబ్బంది చెప్పారు.

విన్న దానికంటే గొప్పగా ఉన్నాయి: విజయ్‌పాల్‌ శర్మ, సీఏసీపీ చైర్మన్‌ 
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆర్బీకేల సేవల గురించి చాలా విన్నా. వాటిని స్వయంగా చూడాలన్న ఆసక్తితో ఇక్కడకు వచ్చా. నేను విన్న దానికంటే ఆర్బీకేలు చాలా గొప్పగా ఉన్నాయి. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను నేనెక్కడా చూడలేదు. ఇలాంటి వ్యవస్థ దేశవ్యాప్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో సేవలందించేందుకు ఆర్బీకేలు ఎంతగానో దోహదపడుతున్నాయి. కియోస్క్‌ల ద్వారా వాతావరణ సమాచారం అందిస్తున్నారు. ఆర్బీకే తరహాలో జాతీయ స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలని వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ తరపున  కేంద్రానికి నివేదిక సమర్పిస్తాం.

Back to Top