రాజధాని రైతులపై మరో పిడుగు

ఒప్పందం ఉన్నా లేకున్నా భూస్వాధీనం
త్వరలో నోటిఫికేషన్
చంద్రబాబు సర్కారు నిర్బంధరాజకీయం
బాబుగారి క్యాపిటల్ కుట్రలు (లోగో)
 
రాజధాని భూ సమీకరణ విషయంలో అనేక దాగుడుమూతలాడుతున్న నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది. భూమిని స్వాధీనం చేసుకునేందుకు గాను మరోమారు ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. భూమిని ఇస్తామంటూ అంగీకార పత్రం ఇచ్చిన రైతులు పునరాలోచనలో పడడం, అభ్యంతర పత్రాలు ఇస్తుండడం, కోర్టులను ఆశ్రయించాలని నిర్ణయించుకోవడం వంటి వార్తల నేపథ్యంలో చంద్రబాబు సర్కారు బెంబేలెత్తిపోతున్నది. అందులోనూ చాలామంది రైతులు పరిహారం తీసుకోవడానికి విముఖత చూపుతుండడంతో పరిస్థితి విషమించి పోయేలా ఉందని భయపడిపోతున్నది. అందుకే పరిహారం తీసుకున్నా తీసుకోకపోయినా భూ స్వాధీనానికి నోటిఫికేషన్ ఇచ్చేయాలని నిర్ణయించింది. అగ్రిమెంట్లు చేసుకునేందుకు పలువురు రైతులు జంకుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ హడావిడి నిర్ణయం తీసుకుంది. రాజధాని గ్రామాల్లో ఇది పెద్ద చర్చనీయాంశమయ్యింది. 91.4 అగ్రిమెంటులో రైతులకు సంబంధించి ఎలాంటి ఊరటా లేకుండా నిబంధనలు రూపొందించారని, అన్నీ కమిషనర్‌కు అనుకూలంగానే ఉన్నాయని, అందువల్లే తాము అగ్రిమెంట్లు చేసుకోబోవడం లేదని రాజధాని ప్రాంతంలోని పలువురు రైతులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ రైతులు కూడా చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. తమ అభిప్రాయాలను మంత్రి నారాయణ దృష్టికి కూడా రైతులు తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రైతులు ఒక కమిటీగా ఏర్పాటయ్యారు. దాంతో రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో అగ్రిమెంట్లు చేసుకున్నా, చేసుకోకపోయినా భూ స్వాధీనానికి నోటిఫికేషన్ ఇచ్చేయాలని నిర్ణయించింది. క్రిడా చట్టంలో ఉన్న విధంగా ప్రభుత్వం పరంగా తాము చేయదలచుకున్న పనిని చేసుకుంటూ పోతామని కమిషనర్ శ్రీకాంత్ అంటున్నారు. నయానో భయానో రైతుల నుంచి అంగీకార పత్రాలను తీసుకున్న ప్రభుత్వం ఇపుడు అగ్రిమెంట్లు కుదర్చుకునేలా రైతులను ఒప్పించడంలో మాత్రం విఫలమౌతున్నది. వేరే ప్రాంతాలలో ఉండేవారు, ఇటీవలే భూములు కొనుగోలు చేసిన వారు మాత్రమే రాష్ర్ట ప్రభుత్వంతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. స్థానిక రైతులు మాత్రం అగ్రిమెంట్లకు విముఖంగా ఉన్నారు. మే 15 నాటికి సింగపూర్ మాస్టర్ ప్లాన్ వస్తుందని, ఆ వెంటనే దానికి రాష్ర్ట ప్రభుత్వం ఆమోదం తెలిపి ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుందని, మరో 30 రోజులకు అంటే జూన్ 15 నాటికల్లా ఫైనల్ నోటిఫికేషన్ విడుదలవుతుందని కమిషనర్ శ్రీకాంత్ చెబుతున్నారు. ఫైనల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూలింగ్ ప్రాంతంలో ఇక ప్రభుత్వ నిర్ణయాలే చెల్లుబాటవుతాయని ఆయన అంటున్నారు. రైతులు అంగీకారం ప్రకారమే పూలింగ్ చేస్తామని చెబుతున్న చంద్రబాబు సర్కారు ఆచరణలో మాత్రం నిర్బంధపూరితంగా వ్యవహరిస్తోంది. రైతులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీనిపై రైతుల కమిటీ ఆందోళనలకు సమాయత్తమవుతోంది. మరోవైపు పూలింగ్ ప్రాంతంలో ఆస్తివివాదాల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రతి యూనిట్‌లోనూ కనీసం 30 నుంచి 40 వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. వాటిలో సమస్యాత్మకంగా ఉన్న కేసులను క్రిడా లీగల్ సెల్‌కు పంపిస్తున్నారు.
Back to Top