నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం

విజయవాడ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం

బాబు ఐదేళ్ల పాలనలో టీడీపీ నేతలు చేసిన రౌడీయిజం అంతా ఇంతా కాదు

కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నిందితులను బాబు తప్పించారు

అక్రమ ట్రావెల్స్‌ను అడ్డుకున్న అధికారిపై టీడీపీ నేతలు దాడి చేశారు

బోండా ఉమా అక్రమాలకు అంతేలేకుండా పోయింది

ఐదేళ్లలో దుర్గగుడి దగ్గర ఫ్లై ఓవర్‌ కట్టించలేకపోయారు

విజయవాడలో తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయారు

ప్రత్యేక హోదా ఇస్తామన్నవారికే కేంద్రంలో వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

ఐదేళ్ల చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే టీడీపీకి డిపాజిట్లు కూడా రావు

చంద్రబాబు మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దు

నవరత్నాలతో జీవితాలు బాగుపడుతాయని సంపూర్ణంగా నమ్ముతున్నాను

 

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది జనవరి 1న ఉద్యోగాల కేలండర్‌ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సెక్రటేరియట్‌ తీసుకొస్తామని మాట ఇచ్చారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో టీడీపీ నేతల రౌడీయిజం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. విజయవాడలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు. 

 • ఈ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఆయన ఎమ్మెల్యేలు చేసిన గుండాయిజం, రౌడీయిజం, అరాచకాలు ఈ నగరంలో అన్నీ ఇన్నీ కావు. ఎన్నికలకు ముందు టీవీల్లో ఒక అడ్వర్‌టైజ్‌మెంట్‌ గుర్తుందా? ఆయనొస్తే చాలా బాగుంటుందని ప్రకటనలు ఇచ్చారు. ఎన్నికలకు ముందు టీవీల్లో ఇవే కనిపించాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చేసిందేమిటి? ఇదే సిటీలో కాల్‌మనీ–సెక్స్‌రాకెట్‌ నిర్వహించారు. ఆడవాళ్లకు డబ్బులు ఇచ్చి కట్టలేని పరిస్థితిలో వారి మానప్రాణాలతో ఆడుకున్నారు. ఈ వ్యవహారంలో దోషులను చంద్రబాబు ఎలా తప్పించారో మీరంతా చూశారు. కేసును ఎలా పక్కదారి పట్టించారో చూశారు.
 • విజయవాడ ఎంపీ కేశినేని నాని అక్రమంగా బస్సులు నడుపుతున్నారని కేసులు పెడితే..ఏకంగా ఐపీఎస్‌ అధికారిపై ఇదే ఎంపీ, ఎమ్మెల్యే దాడి చేసి చొక్కా పట్టుకున్నారు. ఇదే నియోజకవర్గంలో ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‌ను ఎమ్మెల్యే బోండా ఉమా ఏవిధంగా బెదిరించారో చూశారు. స్వాతంత్య్రసమరయోధులకు కేటాయించిన భూములను ఎమ్మెల్యే ఎలా ఆక్రమించుకున్నారో మీకు తెలుసు. బొండా ఉమాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
 •  విజయవాడ నడిబొడ్డున టూరిజమ్‌ పేరిట లైసెన్స్‌లేని బోట్లు నడిపి 23 మంది ప్రాణాలు బలికొన్నారు. ఒక్కరిని ఇంతవరకు అరెస్టు చేయలేదు.
 •  విజయవాడలోని పవిత్ర దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించారు. దేశ చరిత్రలో ఇలాంటి పూజలు ఎప్పుడు జరపలేదు. దుర్గగుడి పేరు చెప్పిన విజయవాడలోని ప్రజలకు చంద్రబాబు మాయబజారు సినిమా చూపిస్తున్నారు. రాజధాని నగరంలో పర్మినెంట్‌ పేరుతో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. అన్ని టెంపరరీనే. 
 •  దుర్గగుడి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ఐదేళ్లలో చంద్రబాబు కట్టలేదు. ఇలాంటి వ్యక్తి రాజధాని చూపించి సింగపూర్, జపాన్‌ అంటూ ఏ దేశానికి వెళ్తే ఆ దేశం పేరు చెబుతారు. బహుబలి సినిమా గ్రాఫిక్స్‌ చూపిస్తున్నారు. బందర్‌ రోడ్డుకు, ఏలూరు రోడ్డుకు పెయింటింగ్‌ల మీద పెయింటింగ్‌లు వేయిస్తున్నారు. ఇవి తప్ప చంద్రబాబు చేసింది ఏమిటో ఆలోచన చేయండి.
 •  మహానేత పరిపాలనలో ఇదే విజయవాడలో దాదాపు 25 వేలల ఇళ్లు కట్టించిన ఘనత వైయస్‌ఆర్‌ది కాదా? విజయవాడలోని అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్, శివారు ప్రాంతాల అభివృద్ధి, ప్లై ఒవర్‌ అన్నీ కూడా వైయస్‌ఆర్‌ కట్టించినవే. ప్రజలకు తాగునీటి సమస్య ఉంది. పక్కనే కృష్ణానది ఉన్నా నీటి కొరత తప్పడం లేదు.
 •  విజయవాడలో 40 వేల మంది ప్రజలు ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకుంటే ఐదేళ్లలో చంద్రబాబు ఏమి గాడిదలు కాస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు గుణదల ఏరియా, శాంతినగర్‌ వరద ముప్పు ఉంది.
 •  విజయవాడలోని అగ్రిగోల్డు బాధితులు అత్యధికంగా ఉన్నారు. ఐదేళ్ల కాలంలో ఏమైనా బాధితులకు న్యాయం జరిగిందా?వీధికోక బ్రాందీ షాపు కనిపిస్తోంది. ఫోన్‌ కొడితే నేరుగా మందు బాటిల్‌  ఇంటికి తీసుకొస్తున్నారు. ఒక్క విజయవాడలోనే 300 బెల్టుషాపులున్నాయి. నగరంలో 59 డివిజన్‌లు ఉంటే ప్రతి డివిజన్‌కు ఐదు లిక్కర్‌ షాపులు ఉన్నాయంటే ఈయన మంచి చేస్తున్నారా? మన పిల్లలను చెడగొడుతున్నారా ఆలోచన చేయండి.
 •  భవాని స్కూల్‌ పక్కనే లిక్కర్‌ షాపు పెడితే ఆ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఆ తల్లిదండ్రులను అరెస్టు చేయించారు. ఇదే విజయవాడలో  ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం 70 వేల మంది నివాసం ఉంటున్నారు. ఈ స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. ఇంతవరకు చేయలేదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు పాలన చూడండి.
 •  భవానీ పురం స్టేడియం నిర్మాణాన్ని పట్టించుకోకుండా మనకు సినిమాలు చూపించారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో మనం చూసింది మోసం..మోసం..మోసం అన్న పదాలు తప్ప వేరేవి చూడలేదు. 
 •  చంద్రబాబు పాలన గురించి మాట్లాడాల్సి వస్తే..దేశంలోనే అందరి కన్న ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబే అని రిపోర్టులు చెబుతున్నాయి. దేశంలో రైతన్నల పరిస్థితి చెబుతూ మన ఏపీ రైతులు అప్పుల్లో ఉన్నారని చెబుతున్నారు. 
 •  పొదుపు రుణాలు ఇవాళ వడ్డీలతో కలిసి రెట్టింపు అయ్యాయని బ్యాంకర్స్‌ కమిటీ రిపోర్టులు చెబుతున్నాయి. రైతులు, పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి ఆలోచన చేయండి. ఐదేళ్ల కాలంలో నిరుద్యోగులు రెట్టింపు అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం గత ఐదేళ్లలో జాబు కోసం మీ చుట్టు ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములను చూశారు. జాబులు ఇక్కడ దొరకుతున్నాయా? లేక డిగ్రీలు అయిపోయిన తరువాత వేరే ప్రాంతాలకు వెళ్తున్నారా? 
 •  ఎన్నికలకు ముందు చంద్రబాబు అన్న మాటలు..జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇవాళ జాబు రావాలంటే బాబు పోవాలనే స్వరం వినబడుతుంది. ఎన్నికలకు ముందు జాబు ఇవ్వకపోతే ఇంటింటికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత జాబు లేదు..నిరుద్యోగ భృతిలేదు. చంద్రబాబు ఇంటికి మాత్రమే జాబు వచ్చింది. ఆయన కొడుకుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి..ఆతరువాత మంత్రిని చేశారు. 
 •  చంద్రబాబు హయాంలో జాబులు రాకపోక ఉన్న జాబులు ఊడిపోయాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 30 వేల మంది ఆదర్శరైతుల ఉద్యోగాలు గోవిందా? హౌసింగ్‌లోని 30 వేల ఉద్యోగాలు గోవిందా, ఆయుష్సు, సాక్షరాభారత్‌ ఉద్యోగాలు గోవిందా? మధ్యాహ్న భోజనం అక్కచెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా? 57 నెలలు అన్ని రకాలుగా అన్యాయాలు చేసి , చివరి మూడు నెలలు ఎన్నికలు వచ్చేసరికి కోటి కుటుంబాలకు కేవలం 3 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చి అన్నీ ఇచ్చేశానని చెబుతున్నారు. రాష్ట్రంలో విభజన నాటికి 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఐదేళ్లలో మొత్తంగా 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నోటిఫికేషన్‌ కోసం పిల్లలు వేలకు వేలు తగలేస్తూ కోచింగ్‌లు తీసుకుంటున్నారు. 
 • 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ, ఇంట్లోనూ చూశాం. ఉద్యోగాల పరిస్థితి ఏంటన్నా అని అడిగిన పరిస్థితి చూశాను. పిల్లలకు ఉద్యోగాలు వస్తే కుటుంబాలు బాగుపడుతాయని అనుకుంటున్న తల్లిదండ్రులకు ఇవాళ నేను మాట ఇస్తున్నాను. మీ కష్టాలు చూశాను..మీ బాధలు విన్నాను. మీ అందరికి నేనున్నానని భరోసా ఇస్తున్నాను.
 • జగన్‌ అనే నేను..
 •  మనందరి ప్రభుత్వం వచ్చాక వెంటనే జగన్‌ అనే నేను మొట్ట మొదటగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట ఇస్తున్నాను. ప్రతిఏటా జనవరి1న ప్రభుత్వ క్యాలెండర్‌ విడుదల చేస్తాను. ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. ప్రతి గ్రామంలోనూ మీ ఊర్లోనే చదువుకున్న పది మందికి గ్రామ సెక్రటెరియట్‌ ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తాను.
 •  ఈ ప్రభుత్వంలో ఏ సమస్య అయినా కూడా ..రేషన్‌కార్డు కావాలన్నా, పింఛన్‌ కావాలన్నా..చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం అడుగుతున్నారు. జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యమేలుతోంది. మన ప్రభుత్వం వచ్చాక సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి మీకు ఏది కావాలన్నా కూడా దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లోనే మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నాను. ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. కులం చూడం, మతం చూడం. రాజMî యాలు చూడం.
 •  జాబులు కల్పించేందుకు ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను ఏర్పాటు చేస్తాం. వారికి రూ.5 వేల గౌరవవేతనం అందజేస్తాం. వారికి వేరే చోట మంచి ఉద్యోగం వచ్చేదాకా ఇక్కడే విధులు నిర్వహించేలా చూస్తాం. 50 ఇళ్లకు ఏం కావాలన్నా..నవరత్నాల్లోని ప్రతి కార్యక్రమాలు అన్నీ కూడా ఆ వార్డు వాలంటీర్‌ తీసుకుంటాడు. రేషన్‌ బియ్యంతో కలిపి డోర్‌ డెలివరీ చేస్తారని చెబుతున్నాను. 
 •  ఇవాళ గవర్నమెంట్‌ కాంట్రాక్టులు చూస్తున్నారు. ప్రభుత్వం బస్సులు, కార్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కేశినేని ట్రావెల్స్, జేసీ ట్రావెల్స్‌ను తీసుకోంటుంది. మన ప్రభుత్వం వచ్చాక ఈ కాంట్రాక్టులు నిరుద్యోగ యువతకు ఇస్తామని మాట ఇస్తున్నారు. కార్లు, బస్సులు కొనేందుకు సబ్సిడీ కూడా ఇస్తాం. 50 శాతం రిజర్వేషన్లు బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీలకే కేటాయిస్తాం.
 •  ఈ ఎన్నికల్లో 25కు 25 ఎంపీ స్థానాలు మనకే వస్తే..పక్కన ఉన్న 17 ఎంపీ స్థానాలు మనకు మద్దతు ఇస్తూ ఒకే తాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేస్తే..కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. ఒక్కసారి ప్రత్యేక హోదా వస్తే ఏ కంపెనీలు అయినా, హోటల్స్‌ అయినా ఇన్‌కంట్యాక్స్‌లు, జీఎస్టీలు కట్టాల్సిన పని ఉండదు కాబట్టి పారిశ్రామిక వేత్తలు వస్తారు. అప్పుడు ఉద్యోగాల విప్లవం వస్తుంది.
 •  జాబుల కోసం ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తున్నాం. పరిశ్రమలు రావాలని కోరుకుంటాం. వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు మన పిల్లలకు ఇవ్వడం లేదు. వేరే రాష్ట్రాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తానని మాట ఇస్తున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి చట్టసభలోనే ఒక చట్టాన్ని తెస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేస్తాం. ప్రతి జిల్లాను ఒక కేంద్రంగా తీసుకొని ఆ జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో ఎలాంటి ఉద్యోగాలు కావాలి. ఎలాంటి పరిశ్రమలు కావాలని ప్రతి జిల్లాలో స్కీల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇలా చేస్తే ఉద్యోగాలు వస్తాయని సంపూర్ణంగా నమ్ముతున్నాను.
 •  ఇవన్నీ కాక నవరత్నాల్లో మనం ఏం చేయబోతున్నామన్నది మీ అందరికి తెలిసే ఉంటుంది. చంద్రబాబు చేస్తున్న కుట్రలు, అన్యాయాలు చూస్తున్నారు. ఇవాళ యుద్ధం చేస్తున్నది చంద్రబాబు ఒక్కరితో కాదు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో యుద్ధం చేస్తున్నాం. ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుందని ఎవరు కూడా మరిచిపోవద్దు.
 • రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయత రావాలి. రాజకీయ నాయకులు చెప్పిన పని చేయకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి రావాలి. అప్పుడే ఈ కూళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. చంద్రబాబు ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు  పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి.  గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండ’ని అన్నారు. 
 • అధికారంలోకి వచ్చాక విజయవాడ నుంచి మొట్ట మొదటి ఎమ్మెల్సీ సీటు మైనారిటీలకు ఇస్తానని మాటిచ్చారు. విజయవాడ నగర అసెంబ్లీ అభ్యర్థులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, భవకుమార్, ఎంపీ అభ్యర్థి పీవీపీలను ఆశీర్వదించాలని..ఫ్యాన్ గుర్తుకు  ఓటు వేయాలని అభ్యర్థించారు.
Back to Top