ఈ ప్రశ్నలకు బదులేది సిఎంగారూ!

హైదరాబాద్, 10 సెప్టెంబర్ 2013:

రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ధైర్యం ఉంటే తాము సూటిగా వేసే ప్రశ్నలకు కిరణ్‌కుమార్‌రెడ్డి సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2011లో శ్రీకృష్ణ కమిటి నివేదిక వచ్చిన తరువాత మిమ్మల్ని పిలిచి తెలంగాణ సహా కొన్ని వెనుకబడిన జిల్లాలలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్యాకేజి గురించి కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చించిన విషయం వాస్తవమా? కాదా? పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు.

పదవిని వదిలిపెట్టడం ఇష్టంలేక మీరు మౌనంగా ఉన్నారా? లేదా? పదవిలో కొనసాగడం కోసం సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవమా? కాదా? వాస్తవం కాదు అని మీరంటే.. రాష్ట్ర విభజనకు మీరు ఒక కారణం కాదని భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పండన్నారు. సిఎం అధికార దాహంతోనే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఒక పక్కన నెల జీతం మీద ఆధారపడే ఉద్యోగుల కుటుంబాలు ఏమైపోతున్నాయో... సమ్మె చేస్తున్న ఉద్యోగులు, ఆర్టీసి కార్మికుల జీవితాల గురించి ఆలోచన చేస్తున్నారా? అని ముఖ్యమంత్రిపై ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈ డమ్మీ ముఖ్యమంత్రి గడచిన నాలుగేళ్ళుగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఒక్క కొత్త రేషన్‌ కార్డు రాక, కట్టుకుందామంటే.. ఒక్క పక్కా ఇల్లు రాక పేదలను దగా చేసిన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని మరింతగా నాశనం చేయాలని చూస్తున్నారా? అని నిలదీశారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానం కాళ్ళుపట్టుకుని వారితో ఒకటి చెప్పి, రాష్ట్రానికి వచ్చి మరొకటి చెబుతారని కిరణ్‌పై శ్రీకాంత్‌రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. సమస్యను ఎలా పరిష్కరిస్తారని ప్రజలంతా ఒక పక్కన ఆతృతగా ఎదురు చేస్తుంటే.. ఆ ప్రశ్నలను మళ్ళీ ప్రజలకే వేయడం సరికాదన్నారు. మరో పక్కన తాను సమైక్యవాదినని చెప్పుకోవడం ఏమిటని ఎద్దేవా చేశారు. మీ పదవీ కాంక్ష కోసం రాష్ట్రాన్ని ఇలా నాశనం చేయడం న్యాయమా అని ప్రశ్నించారు.

కొన్ని కోట్ల మంది ప్రజల మనో భావాలను గుర్తించకుండా, తప్పులు చేసిన వారు చరిత్రలో ఎవరైనా దోషులుగా నిలబడాల్సిందే అని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. మన రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఒక కారకుడే అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాల పేరుతో కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారు పదవుల్లో ఉండడానికి అర్హులు కారన్నారు.

ఆర్టికల్‌ 3 ప్రకారం చేసే తీర్మానాన్ని ఓడించిన తరువాత రాజీనామాలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరును శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. అప్పటిదాకా ఉండకుండా ముఖ్యమంత్రి మారిన మనిషైతే వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేసి ముందే పంపించాలని డిమాండ్‌ చేశారు. స్పష్టమైన వైఖరితో వ్యవహరించకుండా డ్రామాలాడడం ఎందుకని నిలదీశారు.

కేసుల నుంచి తప్పించుకోవడానికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ను నిర్మించింది తానే అని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. తాను చేసిన తప్పుల కారణంగానే రాష్ట్రం ఈ దుస్థితికి వచ్చిందన్న విషయాన్ని చంద్రబాబు మరిచిపోతున్నారని గుర్తుచేశారు. తెలుగుతల్లిని కాంగ్రెస్, టిడిపి నాయకులంతా నిట్ట నిలువునా కోసివారే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన విషయంలో తన వాదన స్పష్టం చేయకుండా చంద్రబాబు బస్సు యాత్ర చేయడం ఏమిటని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు సమైక్య వాదా లేక విభజనవాదా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

Back to Top