రాజ్యసభ పోటీలో వైయస్ఆర్‌సీపీ పాల్గొనదు

హైదరాబాద్, 23 జనవరి 2014:

రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. అలాగే వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలెవరూ రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనకూడదని కూడా నిర్ణయించింది. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎంవీ మైసూరారెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం స్పష్టం చేశారు.

రాజ్యసభ ఎన్నికలలో సొంతంగా అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునేంత సంఖ్యబలం వైయస్ఆర్‌సీపీకి లేనందున పోటీ చేయడంలేదని పేర్కొన్నారు. మరెవరి బలం మీదో ఆధారపడి అభ్యర్థిని నిలబెట్టడం అంటే కుమ్మక్కు రాజకీయాల్లో భాగం అవుతుందని వైయస్ఆర్‌సీపీ అభిప్రాయం అన్నారు.

అలాంటి రాజకీయాలను విభజనకు అనుకూలంగా ఉన్న మూడు పార్టీలు చేస్తున్నాయని మైసూరారెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకునే బలం టీడీపీకి లేకపోయినా కాంగ్రెస్‌ సభ్యుల మద్దతు మీద ఆధారపడి, ముందుగానే కాంగ్రెస్‌తో మాట్లాడుకున్న ప్రకారం రెండవ అభ్యర్థిని నిలబెడుతోందని ఆరోపించారు. ఈ చర్య ముమ్మాటికీ కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనం అని తెలిపారు. రాష్ట్ర విభజన అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ రాజ్యసభ ఎన్నికలను ఒక పథకం ప్రకారం వాడుకుంటోందని ఆరోపించారు.

టీఆర్ఎస్‌కు కూడా రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకునే సంఖ్యాబలం లేదని మైసూరా తెలిపారు. అయినా కాంగ్రెస్, టిఆర్ఎస్‌లు కలిసికట్టుగా అభ్యర్థిని నిలబెడుతున్నాయని స్పష్టం అవుతోందన్నారు. టిఆర్ఎస్‌ అభ్యర్థి గెలిచేందుకు కూడా కాంగ్రెస్‌ సహకరించడం అంతే విభజనకు నేరుగా మద్దతు ఇవ్వటమే అవుతుందని ఆయన తెలిపారు. విభజన లేఖలు ఇచ్చిన ఈ మూడు పార్టీలు రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను పంచుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు సహించబోరని వైయస్ఆర్‌సీపీ భావిస్తోందని తన ప్రకటనలో మైసూరా పేర్కొన్నారు.

Back to Top