'పంచాయతీ'లో వైయస్ఆర్‌కాంగ్రెస్సే నం.1

హైదరాబాద్, 24 జూలై 2013:

పంచాయతీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌, ఏకగ్రీవాలతో కలిపి ఫలితాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే ప్రథమ స్థానంలో ఉందని పార్టీ కేంద్ర పాలక మండలి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి స్పష్టంచేశారు. పార్టీ రహితంగా జరిగినప్పటికీ స్థానిక పరిస్థితులు, అభ్యర్థులపైన ఆధారపడి జరిగిన ఎన్నికలు ఇవి అన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకుల కృషి, పార్టీ మీద ప్రజలకు ఉన్న అభిమానం కారణంగా ఇంత మంచి ఫలితాలను సాధించినట్లు ఆయన వివరించారు. కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కైనా, డబ్బు, మద్యాన్ని అవి విచ్చలవిడిగా పంచిపెట్టినా, ఎన్ని రకాల జిత్తు వేసినా, కుట్రలు పన్నినా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులే అత్యధిక సంఖ్యలో గెలుపొందారని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడారు. పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌లు గెలిచిన వారిని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే వెల్లడించామన్నారు.

వందేళ్ళ చరిత్ర ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ అని, టిడిపికి ముప్పయ్యేళ్ళ చరిత్ర ఉందని ఆయన తెలిపారు. కానీ రెండేళ్ళ క్రితమే ఏర్పాటైన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దీటుగా రాణించడం అంటే చాలా గొప్ప విశేషం అన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు కింది స్థాయిలో కేడర్‌ లేదని, నామరూపాల్లేకుండా పోతుందని శాపనార్థాలు పెట్టిన వారికి ప్రజల అభిమానమే అండగా తాము ఈ ఎన్నికల ఫలితాలతో సరైన సమాధానం చెప్పామన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల జాబితాను ప్రకటించాలని కొందరు అంటున్నారని, అయితే పరీక్ష అందరికీ పరీక్షే అని, మిగతా పార్టీలు సమయం, తేదీ నిర్ణయించి వాటి జాబితాలను ప్రకటిస్తే.. అందుకు తాము కూడా రెడీ అన్నారు. తమ పార్టీ తరఫున గెలిచిన వారి జాబితా తమ వద్ద సిద్ధంగా ఉందని మైసూరారెడ్డి చూపించారు. అయినా, పార్టీ రహితంగా జరిగిన ఎన్నికల ఫలితాలపై సవాళ్ళ మీద సవాళ్ళు విసురుకోవడం అదొక విషయం అన్నారు. పార్టీల పరంగా, పార్టీ గుర్తులతో ముందుగా నిర్వహించాల్సిన ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను పెట్టి తేల్చుకుని ఉండాల్సింది అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టిడిపిలు దొంగచాటుగా మాట్లాడుకుని పార్టీ రహిత ఎన్నికలను ముందుగా పెట్టుకున్నాయని మైసూరారెడ్డి విమర్శించారు.

ఆయా పార్టీల విప్‌లు ధిక్కరించిన ఎమ్మెల్యేలపై అప్పుడే అనర్హత వేటు వేసి ఉంటే ఉప ఎన్నికలు కూడా జరిగి ఉండేవన్నారు. ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి సత్తా ఏమిటో తెలిసి ఉండేదన్నారు. పార్టీ రహిత ఎన్నికలు నిర్వహిస్తారు... అవి అయ్యాక సవాళ్ళు విసురుతుంటారని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలను తాను బలోపేతం చేస్తే మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ నిర్వీర్యం చేశారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మైసూరారెడ్డి మండిపడ్డారు.

రాజ్యాంగం 9వ షెడ్యూల్లో ఉన్న అంశాల్లో పదింటిని జిఓలిచ్చి 2002, 07, 08 సంవత్సరాల్లో అని మైసూరారెడ్డి తెలిపారు. అవన్నీ స్థానిక సంస్థలకు దఖలు పరుస్తూ విడుదల చేసినవే అన్నారు. అన్నీ అమలు జరుగుతున్నాయా లేదా అని ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించాల్సింది పోయి మరణించిన వైయస్ఆర్‌పై ఆరోపణలు చేయడం తగదని తిప్పికొట్టారు. స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయించకుండా, అధికారుల ద్వారా పరిపాలన సాగిస్తున్నది ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించినది అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన, విమర్శించాల్సిన హక్కు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబుకు ఉందన్నారు. కానీ, అధికారంలో ఉన్నవారిని కాకుండా ఇతరులను విమర్శించడం హేతుబద్ధం కాదని, అర్థరహితం కూడా అన్నారు. జన్మభూమి అని నోడల్‌ వ్యవస్థను పెట్టి మండలాధ్యక్షులు, పంచాయతీ సర్పంచ్‌లను నిర్వీర్యం చేసింది, ఉత్సవ విగ్రహాలను చేసింది చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాదా ఆత్మపరిశీలన చేసుకోవాలని మైసూరా అన్నారు.

అంతకన్నా ఘోరమైన విషయం ఏమిటంటే విద్యా కమిటీలు, వన సంరక్షణ సమితులు, నీటి సంఘాలు అంటూ చంద్రబాబు వివిధ రకాల కమిటీలు వేసి నిధులు బదలాయించిన వైనాన్ని మైసూరారెడ్డి గుర్తుచేశారు. ఆ నిధులను రాజ్యాంగేతర శక్తులకు బదలాయించినట్లే అవుతుందని ఆయన ఆరోపించారు. 73, 73 రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నికైన సర్పంచ్‌లు, మండలాధ్యక్షులు ఉండగా .. వారిని కాదని దొడ్డిదారిలో నియమించి అలాంటి రాజ్యాంగేతర శక్తులకు హక్కులు బదలాయించడం చంద్రబాబు కాదా అన్నారు. పంచాయతీరాజ్‌కు సంబంధించి ఫైనాన్సు కమిషన్‌ సిఫార్సు చేసిన నిధులను చంద్రబాబు ఎప్పుడూ విడుదల చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలను ఇలా నిర్వీర్యం చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటిని బలోపేతం చేస్తామనడం అర్థరహితం అని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు చెబుతున్న కబుర్లే అవి అన్నారు. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి మొట్టమొదట నీరుగార్చేది స్థానిక సంస్థలనే అన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డే నెంబర్‌ 1 అని సిఎన్ఎన్ - ఐబిఎన్‌ సర్వే చెప్పిందని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు మైసూరారెడ్డి సమాధానం చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top