వైయస్‌ పథకాల కోసం బాబు పోరాటం

హైదరాబాద్‌, 4 సెప్టెంబర్‌ 2012 : విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్‌పై ఆందోళన చేసే అర్హత టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విజయవంతంగా అమలు చేసిన పథకాల కోసమే తాము ఇప్పుడు ఆందోళన చేస్తున్నట్లు ముందుగా ఒప్పుకుని తరువాతే టిడిపి ఆందోళనలు నిర్వహించాలని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూచించారు. కిలో‌ రెండు రూపాయల బియ్యం పథకాన్ని ప్రారంభించినప్పుడు అది అంతకు ముందు ఎన్టీ రామారావు అమలు చేసినదే అని వైయస్‌ ధైర్యంగా ప్రకటించారన్నారు.‌ ఏదేమైనా వైయస్‌ఆర్‌ పథకాల కోసం బాబు ఆందోళన చేయడం మంచి పరిణామమే అని అన్నారు. చంద్రబాబు నాయుడు మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఫీజు ఆందోళనపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు చర్యలు 'పోరాటానికి పనికి రానివి' అని అభివర్ణించారు. వైయస్‌ పథకాలు తప్ప తమకు మరో గత్యంతరం లేదని చంద్రబాబు ఒప్పుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాన్ని సంతృప్త స్థాయిలో అమలు చేయాలని చంద్రబాబు రోడ్డు మీదికి వచ్చి అందోళన చేస్తే తమ పార్టీ సంతోషించేదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ఫీజు రీయంబర్సుమెంట్‌ను సామాజిక అభివృద్ధికి దోహదం చేసేదిగా భావించాలి కానీ, ఆర్థిక భారంగా చూడకూడదని అన్నారు. బడుగు, బలహీన వర్గాల విద్యపై చంద్రబాబు ఇంతకు ముందు ఏనాడూ ఆందోళన చేయలేదన్న విషయాన్న పద్మ గుర్తు చేశారు. తనకు ఎంతో 'విజన్‌' ఉందని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు పేదల విద్య విషయంలో అది ఏమైందని నిలదీశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యార్థులను స్కాలర్‌షిప్‌ల కోసం ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టారో గుర్తు చేసుకోవాలన్నారు. ఫీజుపై ఆందోళన చేసే అర్హత తనకు ఉందా అన్న విషయంలో బాబు ఆత్మ విమర్శ చేసుకోవాలని పద్మ సూచించారు. ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే వైయస్‌ మాదిరిగా సంతృప్త స్థాయిలో రీయింబర్సుమెంట్‌ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన తరువాతే చంద్రబాబు ఫీజు ఆందోళన చేస్తే బాగుండేదన్నారు. ఏవో కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం కార్యక్రమాలు చేస్తే ప్రజలు నమ్మబోరని ఎద్దేవా చేశారు.ఒక్క ఫీజు రీయింబర్సుమెంటే కాకుండా పావలా వడ్డీ, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, రైతు రుణాల మాఫీ, జలయజ్ఞం లాంటి ఎన్నెన్నో పథకాలను వైయస్‌ రాజశేఖరరెడ్డి పకడ్బందీగా అమలు చేసిన విషయాన్ని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. ఎన్గీఆర్‌, వైయస్‌ఆర్‌ చేసిన సేవలను తెలుగువారు ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారన్నారు. అలాంటి పథకాలను తమ హయాంలో అమలు చేయలేకపోయిన విషయాన్ని చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

'వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభించినప్పుడు టిడిపి నాయకులు అవహేళన చేశారు. బాబు హయాంలో రైతులను ఇబ్బందులు పెట్టారు. విద్యుత్‌ కోసం ఉద్యమించిన వారిపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపించారు. ఇలాంటి తప్పులన్నింటిపైనా చంద్రబాబు సమాధానం చెప్పాల'ని పద్మ డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ రంగానికి సంబంధించి మీరు ఏంచేయదలచుకున్నారు? గతంలో ఏం చేశారని నిలదీయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలపైన, ముఖ్యంగా తమపైన ఉందని అన్నారు. గతంలో చేసిన తప్పులకు క్షమాపణ చెప్పకుండా ఇప్పుడు ఆందోళనలు చేసే అర్హత టిడిపికి ఎక్కడిదని పద్మ నిలదీశారు. టిడిపివి 'హైడ్రామా పోరాటాల'ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి :

మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంగళవారంనాడు హైకోర్టు ఆదేశించడా‌న్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నిర్ణీత గడువు లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థలకే కాదు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చిన తమ పార్టీ సిద్ధమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా పరిపాలనను అధికారుల చేతికి అప్పగించిన ప్రభుత్వ తీరును ఆమె తప్పుపట్టారు. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా ఈ సర్కార్‌ కొనసాగుతోందని ఎద్దేవా చేశారు.

Back to Top