వాళ్ళు కేంద్ర మంత్రులా? విదేశీయులా?

హైదరాబాద్, 10 నవంబర్ 2013:

రాష్ట్రం విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ‌ తూర్పారపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... విభజన విషయంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు తెలుగువారా లేక ఇటాలియన్ బిడ్డలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంప్రదాయాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేస్తారని కేంద్రాన్ని నిలదీయకుండా కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, జేడీ శీలం, చిరంజీవి కొన్ని ప్యాకేజ్‌లు అడగడమేమిటని కడిగిపారేశారు. రాష్ట్రం విడిపోవడానికి ప్రాతిపదిక ఏమిటని అడిగే బాధ్యతను కూడా మర్చిపోయారని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని గతంలో కేంద్ర మంత్రులు చేసిన ప్రతిజ్ఞలు ఏ గాలికి కొట్టుకుపోయాయని ఆమె ఎద్దేవా చేశారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కేంద్ర మంత్రులు నడుకుంటున్నారా లేక కేంద్ర మంత్రులు చెప్పినట్లు బాబు నడుచుకుంటున్నారో అర్థం కావటం లేదని వాసిరెడ్డి వ్యాఖ్యానించారు. మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఇంత మంది ఉన్నా కూడా విభజనను ఆపలేకపోవడం దురదృష్టకరమన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్ర మంత్రులు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.

తడి గుడ్డతో గొంతులు కోసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి అని పద్మ అభివర్ణించారు. ప్రజల ఓట్లతో కాకుండా పైరవీ ద్వారా వచ్చిన సీఎం కాబట్టే కిరణ్ అధిష్టానం వద్ద విభజన అని, రాష్ట్రంలో సమైక్యం అం‌టూ పాట పాడుతున్నారని ఆరోపించారు. విభజనలో కిరణ్ ఓ పావు అన్నారు. కిర‌ణ్ కుమా‌ర్ రెడ్డి బినామీల పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన కాంగ్రెస్‌ నాయకులను ఏమనాలని ఆమె ప్రశ్నించారు. అలాంటి నాయకులను వారి వారి కుటుంబ సభ్యులే చీదరించుకుంటున్నారని పద్మ గుర్తు చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ వెయ్యి కాళ్ళ సర్పంలా పట్టి పీడిస్తోందని దుయ్యబట్టారు.

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వంద తలలు, వంద నాలుకలతో మాట్లాడిస్తున్నదని వాసిరెడ్డి పద్మ నిప్పలు చెరిగారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో ఒక మాట చెబుతూ.. ఢిల్లీలో భేటీలకు వెళ్ళి లోపల ఒక మాట, బయటికి వచ్చి మరో మాట చెబుతున్నారని విమర్శించారు. సమావేశాల్లో విభజనకు అనుకూలంగా మాట్లాడడమే కాకుండా, రాష్ట్రం నుంచి విభజనకు అవసరమైన సమాచారన్నంతటినీ పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన చాలా వేగంగా జరిగిపోవడానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలూ అందిస్తున్నారన్నారు. కేంద్రం ఏది చెబితే దానికి తల ఊపి వచ్చే కిరణ్‌ తాను సమైక్యవాదినే అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులతో ఒక రకంగా.. తెలంగాణ నాయకులతో మరోలా, రాయలసీమకు చెందిన కొందరితో మరొక రకంగా కాంగ్రెస్‌ అధిష్టానం మాట్లాడిస్తున్నదని విమర్శించారు. కేంద్ర మంత్రులతో ఒకలా, రాష్ట్ర మంత్రులతో మరోలా మాట్లాడిస్తున్నదన్నారు.

రాష్ట్ర ప్రజలకు పెను ముప్పుగా పరిణమించిన విభజన గురించి కాకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్యాకేజీలు, సమన్యాయం అంటూ మాట్లాడుతున్నారని పద్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల్లో  ఓట్లు, సీట్లు ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంటే గాని సమస్యలు పరిష్కారం కావని ఒక్క లేఖ ఇవ్వడానికి కూడా చంద్రబాబుకు సమయం సరిపోవడంలేదని ఎద్దేవా చేశారు. తన కొడుకు లోకేశ్‌కు కుట్రలు నేర్పడానికి టీడీపీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలు పెడుతున్నారని ఆరోపించారు. మన రాష్ట్ర ప్రజల జీవితాలతో సోనియా గాంధీ చెలగాటం ఆడుతుంటే.. విభజన పాపంలో చంద్రబాబు పాలు పంచుకుంటున్నారని అన్నారు. సమైక్యానికి మద్దతుగా ఎందుకు లేఖ ఇవ్వలేకపోతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. యాత్రకు వెళుతున్న చంద్రబాబును విద్యార్థులు, రైతులు నిలదీస్తే ఏమని సమాధానం చెబుతారన్నారు.

ఒక ప్రాంతంలో అయినా సరే ఓట్లు, సీట్లు సంపాదించుకుని తన కొడుకును ప్రధానిని చేయాలని యూపీఏ అధ్యక్షురాలు సోనియా ఆలోచిస్తున్నారని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమైక్యత కోసం వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు. విభజనపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని, వారికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఈ గతి పట్టించిన కేంద్ర మంత్రులను దోషులుగా నిలబెట్టాల్సి అవసరం ఉందన్నారు.

Back to Top