టిడిపి నాయకుల చౌకబారు వ్యాఖ్యలు: అంబటి

 
హైదరాబాద్‌, 9 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా‌ను చూస్తేనే తెలుగుదేశం పార్టీ నేతల్లో వణుకు పుడుతోందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సోమవారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసినప్పటి నుంచీ వారు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉన్న జగన్‌ అధికార నివాసం గేటు మీద ఉన్న పార్టీ జెండా నిన్న రాష్ట్రపతిని విజయమ్మ కలిసినప్పటి నుంచీ కనిపించడంలేదని, అందుకే కాంగ్రెస్‌లో కలిసిపోతున్నారని టిడిపి నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. జగన్మోహన్‌రెడ్డి ఇంటిలో ఫ్యాన్‌ తీసేసి ఏసీ పెట్టించుకున్నారని, వైయస్‌ఆర్‌ సిపి ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్‌ ఆయన ఇంటిలో కనిపించడంలేదంటే కాంగ్రెస్‌లో కలిసిపోతున్నట్లే అని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసే నీచ స్థాయికి టిడిపి నాయకులు దిగజారిపోతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. మంగళవారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి టిడిపి తీరును తీవ్రంగా దుయ్యబట్టారు.

పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు కాళ్ళకు బొబ్బలు ఎక్కాయో లేదో పట్టించుకోరు కానీ, జగన్మోహన్‌రెడ్డి ఇంటికి మూడు రంగులు వేశారని, ఇంటిలో ఫ్యాన్‌ తీసేశారు కాబట్టి కాంగ్రెస్‌ పార్టీలో కలిసిపోతున్నారంటూ టిడిపి నాయకులు దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలను అంబటి తీవ్రంగా తిప్పికొట్టారు. విజయమ్మ వెళ్ళి రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిస్తే ఏం మాట్లడారో వారికి చెప్పాలని టిడిపి నాయకులు గగ్గోలు పెడుతున్నారు. అయితే, చంద్రబాబు నాయుడు ఒంటరిగా వెళ్ళి ప్రధానిని కలిసి ఏమి సంప్రతింపులు జరిపారో మాత్రం ఎప్పటికీ వారు వెల్లడించరు. వేరే పార్టీలో విలీనం కావాల్సిన ఆవశ్యకత తమ పార్టీకి లేదని అంబటి స్పష్టంచేశారు. ఉప ఎన్నికల్లో పలుచోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేక బిక్కమొహం వేసిన విషయాన్ని టిడిపి నాయకులు మరిచిపోవద్దని సూచించారు. ఆ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఎంతగా బ్రహ్మరథం పట్టారో గుర్తు చేసుకొని టిడిపి నాయకులు మాట్లాడాలని సలహా ఇచ్చారు. చౌకబారు విమర్శలకు దిగి టిడిపి వారు తమ స్థాయిని దిగజార్చుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు.

చంద్రబాబులా చీకటిలో వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలవాల్సిన అగత్యం తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు లేదని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అంబటి జవాబిచ్చారు. ఒకవేళ ఏ పార్టీలో అయినా కలవాలనుకునే వారు విజయమ్మలా బహిరంగంగా, ధైర్యంగా కలుస్తారా? అని ప్రశ్నించారు. రహస్యంగా కలుసుకోవడం, ఎంపీలతో లేఖలు ఇప్పించడం చంద్రబాబుకే చెల్లిందని దెప్పిపొడిచారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇంత నీచానికి దిగజారడం సరికాదని హితవు చెప్పారు.

బుధవారం జరిగే పార్టీ సిజిసి, సిఇసి విస్తృత సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయం అవుతుందన్నారు. ఆ నిర్ణయం ఏదైనా అధికారికంగా మీడియాకు వెల్లడిస్తామన్నారు. చంద్రబాబు 50 కిలోమీటర్లు నడవగానే టిడిపి నుంచి ఒకరు వచ్చి తమ పార్టీలో చేరారని, వంద కిలోమీటర్లు నడిచే సరికి ఇద్దరు చేరుతున్నారన్నారు. మరో యాభై కిలోమీటర్లు బాబు నడిచేటప్పటికి మరో నలుగురు టిడిపి నుంచి చేరవచ్చని అంబటి ఒక ప్రశ్నకు బదులుగా వ్యాఖ్యానించారు. తమ పార్టీ నుంచి జారిపోతున్న నాయకులను నిలబెట్టుకోవడం కోసమే బహుశా టిడిపి నాయకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపైన చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారేమో అని అన్నారు. రాజకీయ విమర్శలు పటిష్టంగా ఉండాలి కాని, గాలి మాటల మాదిరిగా ఉండరాదని టిడిపి నాయకులకు అంబటి సూచించారు.

Back to Top