హైదరాబాద్, 26 డిసెంబర్ 2012: తెలంగాణ సమస్యను తేల్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్ని అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినా అది కంటి తుడుపుగానే మిగులుతుంది తప్ప సమస్య మాత్రం పరిష్కారం అయ్యే అవకాశం లేదని తేల్చింది. ఈ నెల 28న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తామని పార్టీ పేర్కొంది. తమ పార్టీ ప్రతినిధులు ఒక్కరు వెళ్ళినా, ఇద్దరు వెళ్ళినా నిర్ణయం మాత్రమే ఒక్కటే చెప్పనున్నట్లు తెలిపింది. వైయస్‌ఆర్ సిపి అధికార ప్రతినిధులు, కేంద్ర పాలకమండలి సభ్యులు కొణతాల రామకృష్ణ, బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి లేకుండా ఎన్నిసార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినా ఫలితం ఉండబోదని అన్నారు.
తెలంగాణ సమస్యను తేల్చే ఉద్దేశమే ఉంటే గతంలో రెండు సార్లు నిర్వహించిన అఖిలపక్ష సమావేశాల్లో తెలుసుకున్న అభిప్రాయాలను బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఉండేదని కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. వందలాది మంది తెలంగాణ వాదులు తమ ప్రాణాలను బలిపెట్టినా కాంగ్రెస్ పార్టీకి కనీసం చీమకుట్టినట్టయినా లేదని తూర్పారపట్టింది. నిజానికి ఈ అఖిలపక్ష సమావేశంల నిర్వహిస్తున్నది యుపిఎ ప్రభుత్వం అన్నారు. యుపిఎ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని ఇంతవరకూ ఎందుకు వెల్లడించలేదని ఆయన నిలదీశారు. ఈ నెల 28న జరగనున్న అఖిలపక్ష సమావేశంలో అన్నిపార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాల్సి ఉంటుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ముందుగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేసి మిగతా పార్టీల అభిప్రాయం అడగాలని అన్నారు.
అయితే, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాటలు చూస్తుంటే ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించే అవకాశాలు కనిపించడంలేదని కొణతాల అన్నారు. తెలంగాణ సమస్యపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు తొలిసారిగా కొణిజేటి రోశయ్య అఖిలపక్షం నిర్వహించారని, ఆ తరువాత కేంద్ర హోంమంత్రిగా చిదంబరం ఉన్నప్పుడు రెండవసారి నిర్వహించారన్నారు. మళ్ళీ మూడవసారి అఖిలపక్ష సమావేశం పెట్టారని తెలిపారు. హోంమంత్రి మారినప్పుడల్లా అఖిలపక్షం అనడం సరికాదన్నారు. రెండుసార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించిన తరువాత కేంద్రప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వేసిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఏమిచేశారో తెలియడంలేదన్నారు.
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విషయంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, న్యూక్లియర్ ఒప్పందం విషయంలోనూ అలాగే వ్యవహరించిందన్నారు. తెలంగాణ విషయానికి వచ్చేసరికి అఖిలపక్షం అని, కమిటీలు అనే కాలయాపన చేస్తోందని కొణతాల దుయ్యబట్టారు. తెలంగాణ విషయంలో ఇడుపులపాయలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో చెప్పిన మాటకే తాము కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో కాంగ్రెస్ పార్టీ చెలగాటం ఆడుతోందని కొణతాల రామకృష్ణ నిప్పులు చెరిగారు. అఖిలపక్ష సమావేశానికి ఏ పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళినా ఒకే అభిప్రాయం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అఖిలపక్షంపై కొందరి తీరు ఆశ్చర్యకరం: బాజిరెడ్డి:తెలంగాణ సమస్యపై జరుగనున్న అఖిలపక్ష సమావేశంపై కొందరు నాయకులు మాట్లాడుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోందని బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు. అఖిలపక్ష సమావేశం ఒక ఫార్సు అని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్న విషయాన్ని గోవర్ధన్ గుర్తుచేశారు. అయితే, అదే అఖిలపక్ష సమావేశానికి రెండుసార్లు వెళ్ళి తమ పార్టీ అభిప్రాయం చెప్పిన వైనాన్ని ప్రస్తావించారు. ఒక పక్కన అఖిలపక్షంపై విశ్వాసం లేదని కేసిఆర్ అంటారని, మరో పక్కన వివిధ పార్టీల అధ్యక్షులను కలిసి తెలంగాణకు అనుకూలంగా ఒకే అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. రెండు నెలల్లో తెలంగాణ వస్తుందని, మూడు నెలల్లో వస్తుందని కేసిఆర్ ఒకసారి చెబుతారన్నారు. ఆయనే మళ్ళీ దీపావళికి వచ్చేంస్తోందని, సంక్రాంతికి వచ్చేస్తుందని వాయిదాలు వేస్తుంటారని ఎద్దేవా చేశారు.
మరో పక్కన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడే తీరు చూస్తుంటే కేంద్ర హోంమంత్రి పిలిచిన అఖిలపక్ష సమావేశం ఓ ఫార్సు అన్న అనుమానం కలుగుతోందని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ డిసిసి అధ్యక్షుల అభిప్రాయాలు తెలుసుకున్న పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తాను సమైక్యాంధ్రకు అనుకూలమని చెప్పినట్లు వార్తలు వచ్చాయన్నారు. ఆ వెంటనే మాట మార్చిన బొత్స అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. నిజానికి తెలంగాణ విషయంలో మొట్టమొదటి దోషి కాంగ్రెస్ పార్టేయే అని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీయే దెబ్బతీసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి 30 మంది ఎంపిలను ఇచ్చినా రాష్ట్రాన్ని నిప్పులకొలిమి చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కోవర్టులాగా కేసిఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. అందరం కలిసి తెలంగాణను త్వరగా తేల్చాలని కాంగ్రెస్ పార్టీని నిలదీద్దామని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కొణతాల సమాధానం ఇస్తూ 230 మంది ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగణ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. తమ పార్టీకి ఇద్దరు ఎంపీలే ఉన్నందున నిర్ణయం తీసుకునే శక్తి, ప్రభావితం చేయగల బలం లేదన్నారు. తెలంగాణపై పార్లమెంటులో నిర్ణయం జరగాలన్నారు. కాని అలా చేయకుండా కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్డు పార్టీయే గాని రికగ్నైజ్డు పార్టీ కాదన్నారు. అఖిలపక్ష సమావేశంలో తమ పార్టీ నిర్ణయాన్ని స్పష్టంచేస్తామని మరో ప్రశ్నకు బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు అడిగారని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి షిండే చెప్పారని, హోంమంత్రిగా షిండే కొత్తగా బాధ్యతలు తీసుకున్నందున తెలంగాణపై ఆయనకు అభిప్రాయాలు తెలుసుకునేందుకే అని గులాం నబీ ఆజాద్ చెప్పారని కొణతాల ఓ ప్రశ్నకు బదులిచ్చారు. వీరి ఇద్దరి మాటలను చూస్తే అఖిలపక్ష సమావేశం అసలు ఉద్దేశం ఏమిటన్నది గందరగోళంగా ఉందన్నారు.