టైమ్స్ నౌ సర్వేకు శాస్త్రీయత లేదు

హైదరాబాద్, 17 ఏప్రిల్‌ 2013: టైమ్స్ నౌ చానల్‌ సర్వేకు శాస్త్రీయత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. ఆ చానల్‌ సర్వే చూసి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన చెంబు బృందం చంకలు గుద్దుకుంటే చివరికి నిరాశే మిగులుతుందని పేర్కొంది. 2009 ఎన్నికలు అయ్యాక ఈ చానల్‌ ప్రకటించిన  ఎగ్జిట్‌ పోల్‌ సర్వేకు.. వాస్తవ ఫలితాలకు అస్సలు పొంతనే లేదని తెలిపింది. ఎన్నికలు 2014లో వచ్చినా అంతకు ఆరు నెలలు ముందు వచ్చినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 30కి పైగా లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని, అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్రంలో కీలకమైన నిర్ణయాలకు కేంద్రంగా మారతారన్నారు. రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధీమాగా చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి సర్వేలు నమ్మితే చంద్రబాబు కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అని ఎద్దేవా చేశారు.

టైమ్స్ నౌ ఫలితం బూటకమని, గతంలో తప్పుడు సర్వేలే చేసిందని అంబటి రాంబాబు అన్నారు. టైమ్స్ నౌ ఫలితాలను పట్టుకుని ఎల్లో మీడియా ఊకదంపుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. 2009 ఎన్నికలకు ముందు టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో మన రాష్ట్రంలో మహాకూటమికి 22 లోక్‌సభా స్థానాలు వస్తాయని చెబితే కేవలం 8 సీట్లే వచ్చాయన్నారు. ఇప్పుడు టిడిపి 9 స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ సర్వే చెబుతోందన్నారు. అప్పటి సర్వేకు, వాస్తవ ఫలితాలను బట్టి చూస్తే ఇప్పుడు దానికి టిడిపికి సీటు కూడా దక్కే అవకాశం లేదన్నారు. అప్పటి ఇదే సర్వే కాంగ్రెస్‌కు 15 స్థానాలు వస్తాయని చెప్పిందని అయితే ప్రజలు 33 సీట్లలో గెలిపించారన్నారు. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు 4 సీట్లు వస్తాయని చెప్పింది ఒకే ఒక్క టైమ్స్ నౌ సర్వే అని గొప్పగా చెప్పుకుందన్నారు. కానీ ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవని విషయాన్ని అంబటి గుర్తు చేశారు. ఇప్పుడు టిడిపికి 9 సీట్లు వస్తాయంటే బహుశా అసెంబ్లీ స్థానాలు కావచ్చని అంబటి చమత్కరించారు. ఎంఐఎంకు ఒక్క స్థానం వస్తుందన్న టైమ్స్ నౌ మాట ఒక్కటి మాత్రమే నిజమైందన్నారు.

ఇలాంటి అశాస్త్రీయ సర్వేను చూసి చంద్రబాబు బృందం చంకలు గుద్దుకోవలసిందే కాని ప్రజలు ఇచ్చే తీర్పుతో పండుగ చేసుకునే పరిస్థితి రాబోదని రాంబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్‌ సమయంలో 45% ఉన్న ఓటింగ్‌ సరళి క్రమేపీ తగ్గిపోతూ వస్తున్న విషయాన్ని అంబటి వివరించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అర్థంతరంగా అధికారం లాక్కున్న తరువాత 2009 ఎన్నికల్లో కేవలం 28% కి పరిమితమయిందన్నారు. 2010లో నిర్వహించిన 'మూడ్‌ ఆఫ్‌ నేషన్‌, స్టేట్‌ ఆఫ్‌ నేషన్‌' సర్వేలో హిందూ, ఇతర జాతీయ పత్రికలు చేసిన సర్వేలో చంద్రబాబుకు వచ్చే ఓటింగ్‌ 20% క్షీణించిన విషయాన్ని ప్రస్తావించారు. టైమ్స్ నౌ సర్వే చంద్రబాబును ఊరడించడానికో, చంకలు గుద్దుకోవడానికో చేసినట్లు ఉందన్నారు.

నర్సింహారావు అనే ఎన్నికల ఫలితాల విశ్లేషకుడు 2004లో నిర్వహించిన సర్వేలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేస్తున్నారు.. 150 సీట్లు గెలవబోతున్నారంటూ తెలిపారని, దానిని ఈనాడు మొదటి పేజీలో ప్రచురించిందన్నారు. తీరా ఫలితాలు చూస్తే టిడిపికి 45 మాత్రమే వచ్చిన వైనాన్ని గుర్తుచేశారు. ఇలాంటి అశాస్త్రీయమైన సర్వేలు ప్రజలను భ్రమల్లో ముంచడానికి మాత్రమే పనిచేస్తుంటాయని అంబటి రాంబాబు అన్నారు. గతంలో చంద్రబాబు కేంద్రంలో ఏదో చక్రం తిప్పారట. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే ప్రకారం టిడిపికి 9 ఎంపీ సీట్లు వస్తాయని, వాటితోనే మళ్ళీ చక్రం తిప్పేస్తానంటూ సంబరపడుతున్నారన్నారు. కేంద్రంలో అందరితో 'టచ్‌'లో ఉన్నానంటూ చంద్రబాబు చెబుతున్నారన్నారు. దీన్ని చంద్రబాబుకు అనుకూల పత్రిక మొదటి పేజీలో ప్రచురించి ప్రచారం చేయడానికి ప్రయత్నించిందన్నారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించాక 42 అసెంబ్లీ నియోజవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగితే 26 చోట్ల చంద్రబాబు పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయిందన్నారు. అలాగే రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా ధరావతులు పోగొట్టుకున్నారని చెప్పారు.

2009 ఎన్నికల సందర్భంగా టైమ్స్ నౌ సర్వేకు, వాస్తవంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు చాలా తేడా ఉన్నప్పటికీ ఆ చానల్‌ కనీసం విచారం వ్యక్తం చేయకపోవడాన్ని అంబటి ఒక ప్రశ్నకు బదులుగా ఖండించారు. టైమ్స్ నౌ ఫలితాలు నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఏనాడూ సర్వే ఫలితాలను మొదటి పేజీలో వేయని ఈనాడు ఇప్పుడు కేవలం చంద్రబాబును ప్రమోట్‌ చేయడం కోసమే ప్రచురించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి, టిడిపికి బలం బాగా పెరిగితే స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని మరో ప్రశ్నకు సమాధానంగా నిలదీశారు. చట్ట ప్రకారం, జైలు మాన్యువల్‌ ప్రకారమే శ్రీ జగన్‌ ములాఖత్‌లు చేస్తున్నారన్నారు. జైలులో‌ శ్రీ జగన్ ములాఖత్‌లపై విచారణ చేయాలంటూ టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు సిఎంకు లేఖ రాసిన విషయాన్ని ఒక విలేకరి ప్రస్తావించినప్పుడు అంబటి తీవ్రంగా స్పందించారు.

శ్రీ జగన్‌ను ఇబ్బందుల పాలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం, అదుపు ఆజ్ఞలలో ఉన్న జైలులో ఆయనకు అన్ని సౌకర్యాలు కలుగుతున్నాయంటే ఎవరూ నమ్మబోరన్నారు. నిజంగా ఆయనకు అలాంటి సౌకర్యాలే కలుగుతుంటే అందుకు బాధ్యతగా జైళ్ళ శాఖ నిర్వహిస్తున్నవారు, సిఎం ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి విచారణ చేయించాలని అంబటి డిమాండ్‌ చేశారు. ఇన్ని నెలలుగా జైలులో ఉన్నా శ్రీ జగన్‌ ధైర్యంగా ఉన్నారని, ఆయన ధైర్యాన్ని చూసి కాంగ్రెస్‌, టిడిపి నాయకులకు పిచ్చెక్కిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Back to Top