స్టాండింగ్‌ కమిటీలను వెంటనే వేయాలి

హైదరాబాద్, 13 ఏప్రిల్‌ 2013: అసెంబ్లీ స్టాండింగ్‌ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలి దశ పూర్తయి మూడు వారాలవుతున్నా ఇప్పటి వరకూ ఈ కమిటీలను ఏర్పటు చేయకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది. రెండవ విడత బడ్జెట్‌ సమావేశాలను వెంటనే నిర్వహించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఉప నేతలు ధర్మాన కృష్ణదాస్‌, మేకతోటి సుచరిత, భూమా శోభా నాగిరెడ్డి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటులో జరుగతున్న నిర్లక్ష్యాన్ని చూస్తుంటే ప్రజా సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తేటతెల్లం అవుతోందని వారు తమ ప్రకటనలో వేలెత్తి చూపారు. అధికార పార్టీలోని అంతర్గత తగాదాలే స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటులో ఆలస్యం కావడానికి కారణం అని, ఇలాంటి విధానం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టులాంటిదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా స్టాండింగ్‌ కమిటీలు వేస్తున్నామని ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసి, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి గవర్నర్‌, లోక్‌సభ మాజీ స్పీకర్‌ శివరాజ్‌ పాటిల్‌ సహా పలువురు ప్రముఖులను పిలిచి సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం... కమిటీల ఏర్పాటులో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నదో శాసన సభా వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ఉప నాయకులు డిమాండ్‌ చేశారు.

ఉగాది నాటికి స్టాండింగ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చెప్పినట్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చిన విషయాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎల్‌పి ఉప నాయకుడు కృష్ణదాస్‌, సుచరిత, శోభా నాగిరెడ్డి తమ ప్రకటనలో ప్రస్తావించారు. అయితే, ఉగాది వెళ్ళిపోయి రెండు రోజులైనా స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలూ చేస్తున్నట్లు కనిపించడంలేదని వారు తెలిపారు.

నిజానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటేనే కాంగ్రెస్‌ ప్రభుత్వం వణికిపోతోందని వారు ఎద్దేవా చేశారు.  ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక, వాటి గొంతు నొక్కేస్తూ.. వీలైనంతగా సభను సజావుగా జరగనివ్వకుండా పలు కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని వారు దుయ్యబట్టారు. అధికార పక్షం కుట్రలు, కుతంత్రాలకు ప్రధాన ప్రతిపక్షం తందానతాన అనడం శోచనీయం అన్నారు. రెండవ విడత బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తొలి విడత సమావేశాల సందర్భంగా అధికారపక్షం హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తుచేశారు.

స్టాండింగ్‌ కమిటీ చైర్మన్లుగా ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా అవకాశం ఇవ్వాలని తమ ప్రకటనలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎల్‌పి ఉపనాయకులు డిమాండ్‌ చేశారు.
Back to Top