రైతన్నపై ప్రభుత్వం నిర్లక్ష్యం: వైయస్‌ఆర్‌సిపి

హైదరాబాద్‌, 30 అక్టోబర్‌ 2012: ఎప్పుడు, ఎక్కడ తుపాను వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా తీవ్ర ప్రభావం పడేది వ్యవసాయం పైనే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్‌ ఎంవిఎస్‌ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తుపానులు వచ్చినప్పుడు వ్యవసాయ కార్మికులు, చేనేత కార్మికులు, కులవృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి వైపరీత్యాల కారణంగా రైతన్నలు నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం హైదరాబాద్‌లో కూర్చొని ప్రకటనలు ఇచ్చే బదులు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి వెనువెంటనే చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని వణికిస్తున్న 'నీలం' తుపాను కారణంగా అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
జాతీయ స్థాయిలో ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు తగిన చర్యలు తీసుకునేందుకు మర్రి శశిధర్‌రెడ్డికి కేబినెట్‌ హోదా ఇచ్చి నియమించినప్పటికీ ఆయన కేంద్రం నుంచి ఇంతవరకూ రాష్ట్రం కోసం ఎలాంటి గ్రాంట్‌ తేలేదని, చర్యలు గాని చేపట్టిన దాఖాలా లేదని నాగిరెడ్డి ఆరోపించారు.
దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి సకాలంలో వర్షాలు కురిశాయని, సాగునీరు చక్కగా విడుదలైందన్నారు. ప్రకృతి కూడా రైతులకు అన్నివిధాలా అనుకూలంగా ఉందన్నారు. సెప్టెంబర్‌లో వైయస్‌ అకాల మరణం చెందగా మరుసటి నెల అక్టోబర్‌లోనే కృష్ణా నదికి విపరీతమైన వరద వచ్చిందని, భారతదేశ చరిత్రలో ఏ డ్యామూ మునగని విధంగా శ్రీశైలం డ్యాం మీద నీరు పొంగి పొరలిందని, కర్నూలు జిల్లా, నగరం కూడా వరదనీట మునిగిపోయాయన్నారు. ఆ తరువాతి సంవత్సరం రోశయ్య హయాంలో డిసెంబర్‌లో అధిక వర్షాలు, అకాల వర్షాలతో కోస్తా మునిగిపోయిందన్నారు.
గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో లేని విధంగా నలభై రోజుల పాటు ఒక్క రోజు కూడా చుక్క వర్షం కురవలేదని, దానితో రైతాంగం బాగా దెబ్బతిన్నదని నాగిరెడ్డి అన్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచే సకాలంలో వర్షాలు లేవని, సకాలంలో ప్రాజెక్టుల నుంచి నీళ్ళు సరఫరా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అధిక శ్రమకు ఓర్చి సాగుచేస్తే ఇప్పుడు మళ్ళీ తుపాను వచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నదన్నారు.
రాష్ట్రంలో వరి తరువాత అత్యధికంగా సాగయ్యేది ప్రత్తి పంట అని, గత నాలుగైదు సంవత్సరాల నుంచి బిటీ విత్తనం విజయవంతం అయిన కారణంగా, వర్షాభావ పరిస్థితుల్లో కూడా కనీస దిగుబడి వస్తున్నందున అయితేనేం రైతులు ఎక్కువగా పత్తి సాగుకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం వరితో సహా ప్రధాన పంటల సాగు గణనీయంగా తగ్గిపోయినా పత్తి సాగు మాత్రం 145 శాతం పెరిగిందన్నారు. అసలు మద్దతు ధరల నిర్ణయంలోనే రైతుకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.
ఈ సంవత్సరం తొలి నుంచీ బిటి విత్తనం నల్లబజారులో కొని, ప్రభుత్వం పెంచేసిన ఎరువులు, డీజిల్‌ ధరల కారణంగా పత్తి రైతు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయని నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో వర్షపాతం బాగున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో సరాసరి వర్షం కూడా లేనందున దిగుబడులు తగ్గిపోయే పరిస్థితి ఎదురవుతోందన్నారు. ప్రత్తికి కనీస మద్దతు ధర క్వింటాలుకు ప్రభుత్వం రూ. 3,900లుగా నిర్ణయించగా దాని ఉత్పత్తికి అయ్యే ఖర్చు 5 వేల రూపాయలు అవుతోందని వివరించారు. ప్రతి క్వింటాలు పత్తి మీద రైతుకు 11 వందల రూపాయల నికర నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్‌ సంక్షోభం కారణంగా రైతులనే కాకుండా జిన్నింగ్‌, స్పిన్నింగ్ మిల్లు‌లకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాగిరెడ్డి తెలిపారు. 2010- 11 సంవత్సరం నుంచీ ప్రత్తి సాగుకు పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని, అమ్మకం ధరలు బాగా తగ్గిపోతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అన్ని పంటలకు మద్దతు ధరలు ఉత్పత్తి ఖర్చు కంటే చాలా తక్కువగా ఉంటున్నాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే చట్టపరంగా నేరమైనా వ్యాపారులు బాహాటంగానే రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తక్కువ ధరకే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనే ఈ వివరాలున్నాయని చెప్పారు. గిట్టుబాటు ధర లేక, కొనే నాథుడు లేక పత్తిపంటను ఇంటిలో దాచి, రైతన్న కుటుంబాలు ఇంటి బయట పడుకున్న పరిస్థితులున్నాయని, ఈ సారైనా అలాంటి దుస్థితి లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పత్తిపంట ఎగుమతిపై నిషేధం విధించకుండా, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పెరిగిన ఖర్చులకు అనుగుణంగా డీజిల్‌ ధరలు పెంచకపోతే ఎలా? డబ్బులు చెట్లకు కాస్తాయా? అంటూ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ సమర్థించుకోవడాన్ని నాగిరెడ్డి తప్పుపట్టారు. ఈ విషయం రైతులకు వర్తించదా? అని ఆయన నిలదీశారు. రైతులు, చిత్తశుద్ధితో రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రైతు సంఘాలు పత్తి రైతుల సంక్షోభం నివారణకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చి అన్నదాతకు న్యాయం జరిగేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
Back to Top