ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం

 • వైయస్ మరణించాక సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం యూట‌ర్న్
 • జగ‌న్‌ను ఎదుర్కొనేందుకు కుట్రలు పన్నుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది
 • వైయస్ఆర్ మృతిపై ఇప్పటికీ‌ అనుమానాలున్నాయి
 • రాష్ట్రంలో పరిస్థితి జగన్‌కు అనుకూలమని పలు సర్వేల్లో తేలింది: సోమయాజులు
 • మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని, ప్రజా సంక్షేమ పథకాల అమలులో ‘యూటర్న్’ తీసుకుందని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో‌ ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వై‌యస్‌కు నివాళులర్పించిన అనంతరం కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

  ‘రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడంలేదు. తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో వీటిపై కోటా విధానం అమలులో ఉండేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది’ అని కొణతాల విమర్శించారు. ‘వై‌యస్ హయాంలో ప్రజలకు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, వృద్ధాప్య భద్రత కల్పించారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులుగా పొందుపర్చని వాటిని కూడా సంక్షేమ పథకాల రూపంలో అందుబాటులోకి తెచ్చారు.‌ నిరుపేదలకు లక్షలాది రూపాయలు విలువ చేసే కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత వై‌యస్‌దే. అర్హులైన అందరికీ సంతృప్తస్థాయిలో లబ్ధి చేకూరాలని వైయస్‌ఆర్ భావించారు. ఇప్పుడున్న కాంగ్రె‌స్ ప్రభుత్వం మాత్రం టీడీపీ పాలనలో ఉన్నప్పటి విధానాని‌కే వెళుతోంది. పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా ఎమ్మెల్యే సిఫార్సు చేయాల్సి వస్తోంది. వ్యవసాయ సబ్సిడీ ఇచ్చే దిక్కు లేదు. ధాన్యంపై రూ.200 బోన‌స్‌ను ప్రకటించి గాలికొదిలేశారు. ప్రతిష్టాత్మకమైన జలయజ్ఞాన్ని నీరుగార్చారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇప్పటివరకు పోలవరం టెండర్ల ఖరారే జరగలేదు.

  ఐదారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 20 నుంచి 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరందే అవకాశం ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉంది. విద్యు‌త్ విషయంలో కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఓ సీఎం ఇలా మాట్లాడతారా అని సిగ్గేస్తోంది’ అన్నారు.

  వైయస్‌ఆర్‌ మరణానంతరం ఆయన కుమారుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందే తప్ప సంక్షేమ పథకాల అమలుపై శ్రద్ధ చూపడంలేదని కొణతాల విమర్శించారు.

  ఈ దుస్థితిని చూసే రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, 48 శాతం ప్రజలు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. తాజాగా ఎన్డీటీవీ జరిపిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు. రూ.30 కోట్లు ఇచ్చి ఈ సర్వే చేయించుకున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. వాస్తవాలను అంగీకరించే గుణం బాబుకు లేదన్నారు. జగన్‌ పార్టీ పెట్టిన తరువాత 2011 నుంచీ నిర్వహించిన అనేక సర్వేలు రాష్ట్రంలో పరిస్థితి జగన్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించాయని సోమయాజులు అన్నారు. వైయస్‌ఆర్‌ మృతిపై ఇప్పటికీ ప్రజల్లో అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయడానికి సిట్టింగ్‌ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని కొణతాల, సోమయాజులు కోరారు. హెలికాప్టర్‌ ప్రమాదం వెనుక కుట్ర ఉందా? అనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా ఉందన్నారు.

Back to Top