హైదరాబాద్, 20 నవంబర్ 2012: హంద్రీ నీవా ప్రాజెక్టును దాదాపుగా పూర్తిచేసింది దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అయితే, దాన్ని తూతూ మంత్రంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఘనతగా చెప్పుకోవడాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. వైయస్ మరణించిన తరువాత ఈ మూడున్నరేళ్ళలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయినా, హంద్రీ నీవా తొలి దశ నుంచి ఒకటి రెండు పైపుల్లో నీటిని విడుదల చేసి అది తమ ఘనతే అని కిరణ్ కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పుకోవడం ఏమిటని వైయస్‌ఆర్ సిపి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సుమారు 3,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హంద్రీ నీవా ప్రాజెక్టును 95 పూర్తి చేశారన్నారు. అలాంటి వైయస్ రాజశేఖరరెడ్డి పేరు కూడా ప్రారంభోత్సవం సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తావించకపోవడానికి ఇంగిత జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. హంద్రీ నీవా ప్రాజెక్టును ప్రారంభించడంతో తన జన్మ ధన్యమైందని కిరణ్ కుమార్‌రెడ్డి చెప్పుకోవడాన్ని శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రాజెక్టును నిర్మించిన వ్యక్తి పేరు ప్రస్తావించకుండా ఆయన జన్మ ఎలా ధన్యమైందని ప్రశ్నించారు.

మన రాష్ట్రం అన్నపూర్ణగా వెలుగొందాలని, ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని, పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పించి, అహరహం ఆ దిశగా కృషి చేసిన మహా మనీషి వైయస్‌ను విస్మరించడం మంచిదే అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేని ఈ పాలకులు వైయస్ పేరు ప్రస్తావించకపోవడం పట్ల తాము సంతోషిస్తున్నామన్నారు. మహనీయుడు వైయస్ పేరును ప్రస్తావించే అర్హత వారికి లేదన్నారు. రైతుల కోసం తపించిన వ్యక్తి పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టి, ఆయన కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్న వారికి వైయస్ పేరును ప్రస్తావించడానికి అర్హులు కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్రంలోని ప్రాజెక్టులకు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన అనుమతులు, వాటిపై చేసిన ఖర్చుపైన, తాము తీసుకువచ్చిన అనుమతులు, ఖర్చుపైన శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన సవాల్ చేశారు. వ్యవసాయం దండగ అని, విద్యుత్ బకాయిలు కట్టకపోతే కొన్ని దేశాల్లో ఉరి తీస్తారంటూ అన్నదాతలను అవమానించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే రైతు పేరు చెప్పి రాష్ట్రంలో తిరగడానికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు.

హంద్రీ నీవా ప్రాజెక్టుకు ఎన్టీ రామారావు పేరైతే పెట్టారు గాని, నిధులు కేటాయించలేదని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రులెవ్వరూ ఒక్క వైయస్ తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆయన అన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టు పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలని వైయస్ తపించారన్నారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నీటి సదుపాయం లేక నిత్యం కరవుతో అల్లాడే ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రాజెక్టును వైయస్ దాదాపుగా పూర్తిచేశారని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. తన నియోజకవర్గంలో హంద్రీ నీవా ప్రాజెక్టు కాలువలను చూపించే తాను ఎన్నికల్లో విజయం సాధించినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలా తాను చెప్పలేదని ఆయన అనగలరా అని ప్రశ్నించారు. అంతే కాకుండా మన రాష్ట్రంలోని ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మూడు ప్రాంతాల్లోని మెట్ట భూములకు నీటి సౌకర్యం కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలను వైయస్ చేపట్టారని శ్రీకాంత్‌రెడ్డి సగర్వంగా చెప్పారు.

వైయస్ సంకల్పించిన పులిచింతల, చేవెళ్ళ - ప్రాణహిత, పోలవరం లాంటి 86 ప్రాజెక్టులకు అనుమతులను వైయస్ తెచ్చాన్నారు. వాటిని పూర్తిచేయడానికి ముందుకు రాని కిరణ్ ప్రభుత్వాన్ని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. వైయస్ మరణించిన తరువాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పథకానికైనా అనుమతి తెచ్చిందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేంద్రం అంతా తన చేతిలోనే ఉందని గప్పాలు కొట్టుకుకే చంద్రబాబునాయుడు అయినా ఒక్క ప్రాజెక్టుకైనా అనుమతి ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా చేయాలని వైయస్ సంకల్పించి, కృషిచేసిన విషయాన్ని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. అందుకే వైయస్ అపర భగీరథుడని వేనోళ్ళ కీర్తి, ప్రశంసలు పొందుతున్నారన్నారు. ఆయనను అపర భగీరథుడే అని ప్రజలు కొలుస్తున్నారన్నారు. భూమి తగ్గిపోతే, రైతన్నలు కుంగిపోతారని వారికి ప్రోత్సాహం ఇవ్వాలని జలయజ్ఞాన్ని ఒక దూరదృష్టితో ప్రారంభించిన వ్యక్తి వైయస్ అన్నారు.
ఏమి చేశారని కాంగ్రెస్ పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. వైయస్ మరణించిన తరువాత కొద్ది మొత్తాల్లో డబ్బు ఖర్చు చేస్తే పూర్తయ్యే ప్రాజెక్టులను కూడా ఈ ప్రభుత్వం పూర్తిచేయడానికి ముందుకు రావడంలేదని దుయ్యబట్టారు. ప్రచార ఆర్భాటం తప్ప తూతూ మంత్రంగా ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభించినట్లుగా తమ పేరున శిలాఫలకాలు వేయించుకుంటున్నారన్నారు. హంద్రీ నీవా పథకాన్ని పూర్తిచేసిన వైయస్ పేరు ప్రస్తావించకుండా తమ గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నైతికంగా మైనార్టీలో పడిపోయిందన్నారు. చంద్రబాబు, టిడిపి మద్దతుతో ఈ ప్రభుత్వం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. పరిపాలన పూర్తిగా కుంటుపడిపోయిందన్నారు. వేరే పార్టీతో కలిసి అవిశ్వాసం పెట్టాలంటే ఆయా పార్టీల విధానాలు వేరుగా ఉంటాయి కాబట్టి తమకు వీలు కాదన్నారు.

ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని తపించిన వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి అని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్ ఆశయాల సాధన కోసం ఏర్పాటైన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ఆశయాలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరా నీటితో తడవాలన్న ఆశయంతో, ఆలోచనతో నదులను అనుసంధానం చేస్తామని, చిత్తశుద్ధితో ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కృషి చేస్తామన్నారు.
ఎమ్మెల్యేలను పశువులతో పోలుస్తూ చంద్రబాబు నాయుడు బరితెగించి మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఒక విలేకరి ప్రశ్నకు సమాధానం స్పందించారు. మామపైనే పోటీ చేస్తానని చెప్పి, ఆయనకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబుకు ఒక విధానం అంటూ ఉండదన్నారు. అందుకే ఆయనన సొంత పార్టీ ఎమ్మెల్యేలే నమ్మకం లేక బయటికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. వైస్రాయ్ హొటల్లో పెట్టిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఎంత ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనడం, బంధించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని మరో విలేకరి ప్రశ్నకు బదులిచ్చారు.

జగన్మోహన్‌రెడ్డి కోసం తామంతా ఏమైనా చేస్తామన్నారు. ఆయన కోసం ఐక్యంగా కృషిచేస్తామని, ఆయనకు మద్దతుగా ఉంటామని మరో ప్రశ్నకు శ్రీకాంత్‌రెడ్డి కచ్చితంగా చెప్పారు. కులమతాలకు అతీతంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తమ పార్టీకి అండా దండా ప్రజలే అని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఇతర పార్టీల నాయకులతో ప్యాకేజ్‌లు మాట్లాడుకోవాల్సిన అగత్యం తమకు లేదన్నారు. బిసిలకు సీట్లు ఇచ్చే విషయంలో మిగతా పార్టీల కన్నా తమ పార్టీ ఒక అడుగు ముందే ఉంటుందని ఒక విలేకరి ప్రశ్నకు బదులిచ్చారు.