కాంగ్రెస్‌పై అన్ని వర్గాల్లోనూ ఆగ్రహావేశాలు

హైదరాబాద్‌, 20 సెప్టెంబర్‌ 2012: కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగించినందుకు అన్ని వర్గాల వారూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం డీజిల్‌ ధరలు పెంచడంపైన, వంట గ్యాస్‌ సిలిండర్ల సబ్జిడీపై పరిమితి విధించడం, రిటెయిల్‌ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడంపై నిప్పులు చెరిగింది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు గురువారంనాడు పార్టీ కేంద్ర కార్యాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీపైన, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుదు, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డిపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, ఇబ్బందులను కిరణ్‌ కుమార్‌రెడ్డి పట్టించుకోవడం లేదని, ప్రభుత్వానికి పరోక్షంగా వత్తాసు పలుకుతూ డ్రామాలాడుతున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడిని ఆయన విమర్శలతో కడిగిపారేశారు.

డీజిల్‌ ధర, సిలిండర్లపై నియంత్రణ, ఎఫ్‌డిఐల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు మెజారిటీ రాజకీయ నాయకులు, రైతులు, వ్యాపారులు, వాణిజ్య వర్గాల వారు, ఉద్యోగులు, మహిళలు, పారిశ్రామికవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఎందుకు అప్పగించామా అనే ఆవేదన వారందరిలోనూ నెలకొందని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మూలిగే నక్క మీద తాటికాయ కాదు ఆటంబాంబు పడిన చందంగా ఉన్నాయని ఆయన అభివర్ణించారు. ఒక పక్కన డీజిల్‌ ధరను ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం, మరో పక్కన సిలిండర్లపై పరిమితి విధించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాన్య ప్రజలు బ్రతికే అవకాశమే లేకుండా చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నదని బాబూరావు తెలిపారు. సంవత్సరానికి ముందు 6 సిలిండర్లనే సబ్సిడీపై పంపిణీ చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో మాత్రమే ఆ పరిమితిని 9 సిలిండర్లకు పెంచాలని నిర్ణయించడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి నిర్ణయాలు హాస్యాస్పదం అని ఆయన ఎద్దేవా చేశారు. సిలిండర్ల సబ్సిడీపై పరిమితిని కాంగ్రెస్‌ తన ఇష్టానుసారం చేయడమేమిటని నిలదీశారు. గతంలో గ్యాస్‌ సిలిండర్‌ ధరలను కేంద్రం పెంచినప్పుడు పెంచిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఆ విధంగా ఆయన ఆడపడుచులపై గ్యాస్‌ ధర భారం పడకుండా చేశారని తెలిపారు. అయితే, అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగల ముఖ్యమంత్రి లేకపోవడం నిజంగా మనకు దుర్దినం అని బాబూరావు అభివర్ణించారు.

గురువారం జరిగిన దేశ వ్యాప్త బంద్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిస్థాయిలో పాల్గొన్నదని బాబూరావు పేర్కొన్నారు. తమ పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అన్ని జిల్లా, మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాలు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బంద్‌ను సంపూర్ణంగా పాటించారని చెప్పారు.

చంద్రబాబు డ్రామాలు:
ఒక పక్కన డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, మరో పక్కన గ్యాస్‌ సిలిండర్లపై ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తుదని, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో అల్లాడుతుంటే ఇక్కడ ఆందోళనలో పాల్గొనకుండా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేయడమేమిటని బాబూరావు నిలదీశారు. ఇది చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామా అని ఆయన అన్నారు. ‌రిటెయిల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దేశంలోని మరే ఇతర రాష్ట్రమూ ఆహ్వానించలేదని, కేవలం కిరణ్‌ కుమార్‌రెడ్డి ఒక్కరే వెనకా ముందూ ఆలోచించకుండా ఆ నిర్ణయానికి ఆమోదం తెలిపారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయం తీసుకున్న కిరణ్‌ కుమార్‌రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని నిలదీసి, అవిశ్వాసం పెట్టాల్సిన చంద్రబాబునాయుడు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఎఫ్‌డిఐలపై అసెంబ్లీలో చర్చించకుండానే కిరణ్‌కుమార్‌ సర్కార్‌ నిర్థయం ఎలా తీసుకుంటుందని నిలదీశారు. కేంద్రం మెప్పు కోసమే ఎఫ్‌డిఐలను కిరణ్‌ అనుమతించారా? అని బాబూరావు సూటిగా ప్రశ్నించారు.

ఒక పక్కన రాష్ట్రంలో మంచినీరు లేదు. మరో పక్కన డీజిల్‌ ధరను కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచేసింది. రాష్ట్ర ప్రజలను ఎన్నో కష్టాలు చుట్టిముట్టినా అటు అధికార పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో చర్చించకుండా కాలక్షేపం చేస్తున్నాయని బాబూరావు దుయ్యబట్టారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేదల పక్షాన ఏర్పాటైందన్నారు. ప్రజల పక్షాన తమ పార్టీ పోరాటాలు చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచి ధరలను ఏ విధంగా తగ్గించేందుకే పార్టీ అధినాయకుడు, నాయకులు, కార్యకర్తలు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఎన్నెన్నో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నామని చెప్పారు.

విద్యుత్‌ సమస్య, విద్యార్తుల ఫీజు రీయింబర్సుమెంట్‌ విషయాల్లో వైయస్‌ఆర్‌ సిపి స్పష్టంగా ఉందని బాబూరావు తెలిపారు. ఈ అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు తమ పార్టీ సభ్యులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. ఇదే విషయాన్ని స్పీకర్‌కు కూడా చెప్పామన్నారు. అయితే, టిడిపి, టిఆర్‌ఎస్‌ పార్టీలు సభను సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నాయని ఒక విలేకరి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కారణంగా శాసనసభ వాయిదా పడలేదని మరో ప్రశ్నకు జవాబిచ్చారు. డీజిల్‌ ధర పెంపు, గ్యాస్‌ సిలిండర్ల సబ్సిడీపై పరిమితి, ఎఫ్‌డిఐలను అనుమతించిన అంశాలపై గురువారంనాడు తమ వైయస్‌ఆర్‌ సిపి సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్ళిన మాట నిజమే అయినా, తమ నిరసన తెలిపిన వెంటనే తిరిగి తమ తమ స్థానాలకు వచ్చేశామని బాబూరావు వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు చాలా తేడా ఉందని, ప్రజల కోసం అవసరమైతే  అరెస్టు కావడానికి కూడా సంసిద్ధమని బాబూరావు స్పష్టం చేశారు.

Back to Top