ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నసిబిఐ: జూపూడి

హైదరాబాద్, 27 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు,‌ కడప లోక్‌సభ సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి విషయంలో సిబిఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని వైయస్‌ఆర్‌సిపి నిప్పులు చెరిగింది. జగన్‌ ఆస్తుల విషయంలో దర్యాప్తు చేస్తున్నామని చెబుతూ ఆయనను అరెస్టు చేసి ఇప్పటికి ఆరు నెలలు పూర్తయిందన్నారు. అయితే, వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్న తీరులో సిబిఐ నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టింది. సిబిఐ ఇంత వరకూ చార్జిషీట్‌ వేయకపోవడాన్ని పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారంనాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిబిఐ మాన్యువల్ను‌, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా సిబిఐ అధికారులు పట్టించుకోవడం లేదని జూపూడి ఆరోపించారు. జగన్‌ను అరెస్టు చేసి ఆరు నెలలైనా ఎందుకు బెయిల్ ఇవ్వకుండా అడ్డు పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. జగ‌న్మోహన్‌రెడ్డి విషయంలో సిబిఐ వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తున్నట్లు ఉందన్నారు.

జగన్‌పై కేసుల్లో మూడు నెలల్లో దర్యాప్తు పూర్తిచేస్తామని అక్టోబర్‌లో సిబిఐ తెలిపిందని, అయితే, కొద్ది రోజుల్లో ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్‌ అవుతున్న సిబిఐ డైరెక్టర్‌ ఎ.పి. సింగ్‌ ఈవేళ మీడియాతో మాట్లాడుతూ, మరో మూడు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి, చార్జిషీట్‌ వేస్తామని చెప్పడాన్ని జూపూడి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడి విషయంలో సిబ్బంది లేరని తప్పించుకుని తిరిగిన సిబిఐ జగన్‌ విషయం వచ్చేసరికి ఆగమేఘాల మీద దాడులు చేసింది, ఆస్తులు జప్తు చేసింది, అరెస్టులు కూడా చేసిందని ఆయన విమర్శించారు. సిబిఐ అంటే అధికార కాంగ్రెస్‌ పార్టీ ఏజెంటులా వ్యవహరిస్తోందని జూపూడి దుయ్యబట్టారు. కాంగ్రెస్‌, టిడిపిలే సిబిఐ వెనుక ఉండి ఈ నాటకం ఆడిస్తున్నాయని ఆయన ఆరోపించారు.‌ ఎలాంటి ఆధారాలూ లేకుండా జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి ఆరు నెలలుగా ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛను సిబిఐ హరిస్తున్నదని జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి ఆరు నెలలైనా చార్జిషీట్‌ వేయలేకపోయిన సిబిఐ తీరు చూస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ ఆ దర్యాప్తు సంస్థ వద్ద లేవన్న విషయం ప్రజలకు స్పష్టమయిందన్నారు.

క్విడ్‌ ప్రో కో లేనప్పుడు జగన్‌ను ఎందుకు అరెస్టు చేశా?:
రాష్ట్ర కేబినెట్‌ విడుదల చేసి జీఓలు అన్నీ సరైనవే అని, ఎక్కడా క్విడ్‌ ప్రొ కో లేనేలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పడు అంటున్నారన్నారు. అలాంటప్పుడు ఎలాంటి ప్రభుత్వంలో, అధికారంలో లేని జగన్‌ క్విడ్‌ ప్రో కో కు ఎలా పాల్పడినట్లు అని జూపూడి సూటిగా ప్రశ్నించారు.‌ అసలు క్విడ్ ప్రో కో లేనప్పడు జగన్‌ను జైలులో ఎందుకు పెట్టారని నిలదీశారు. జీఓలు సరైనవని అప్పుడే కోర్టుకు ఎందుకు తెలియజేయలేదని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌ నుండి బయటికి వెళ్ళిపోతే సహించలేకపోతున్నారా అని ప్రశ్నించారు. జగన్‌ ఒక వీరుడిగా, ధీరుడిగా కాంగ్రెస్‌ను వదిలేసి, మహానేత వైయస్‌ ప్రజల హృదయాల్లో ఇంకా నిలిచే ఉన్నారని రుజువు చేసేందుకే సొంతంగా పార్టీ పెట్టారని తెలిపారు. జగన్మోహన్‌రెడ్డిని బేషరతుగా వదిలిపెట్టి, ఆయన ఇంటిలో సగౌరవంగా దించి, క్షమాపణలు చెప్పమని సుప్రీంకోర్టు ఆదేశించే రోజు త్వరలోనే వస్తుందని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని జూపూడి హెచ్చరించారు. 'Bring Beauty to the Chair' (కూర్చున్న కుర్చీకి అందం తీసుకురావాలి) అని కాంగ్రెస్‌ పాలకులకు ఆయన హితవు పలికారు.

బెయిల్‌ రానివ్వకుండా అడ్డుపడుతున్న టిడిపి:
జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ వచ్చే అవకాశం వచ్చిన ప్రతిసారీ టిడిపి కుట్రలు పన్ని, కుయుక్తులు చేసి అడ్డుపడుతోందని జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ఇంకా కొన్ని కేసులు ఉన్నాయని, ఆయన ఇప్పుడే బయటికి రారని టిడిపి నాయకులు సిగ్గులేని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సిబిఐ కూడా అదే వంత పాడుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ఈ అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు చంద్రబాబు భయపడుతున్నారని జూపూడి ఆరోపించారు. 2014 వరకూ ఏదో విధంగా కాలం గడిపేస్తే చాలని చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. అయితే, కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కయిన తీరును ఈ రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకూ బుద్ధి చెబుతారన్నారు. జన విశ్వాసం కోల్పోయి ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓల విషయంలో మంత్రులను, ఐఎఎస్‌లను కాకుండా జగన్‌ను ఎలా ప్రశ్నిస్తారని సుధాకర్‌రెడ్డి అనే నెల్లూరు న్యాయవాది కోర్టులో లేవనెత్తిన విషయాన్ని జూపూడి గుర్తు చేశారు. వైయస్‌ అభిమానులు, జగన్‌ను దగ్గరగా చూసిన వృద్ధులు కూడా ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతున్నారని అన్నారు.

మంత్రులూ... మానవత్వం మరిచారా?:
స్వయంగా రాజకీయ భిక్ష పెట్టి, మిమ్మల్ని మంత్రులుగా చేసిన దివంగత మహానేత వైయస్‌ పేరును సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో పెట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారని జూపూడి నిలదీశారు. కనీస మానవత్వం కూడా లేకుండా వ్యవహరిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు తింటున్నది అన్నమే అన్న విషయం మరచిపోవద్దని సూచించారు. మీకు పదవులు ఇచ్చిన నాయకుడు దుర్మార్గుడెలా అయ్యారనుకుంటున్నారన్నారు. మీకు అవకాశాలు కల్పించిన మహానేత అవినీతిపరుడెలా అయ్యారని నిలదీశారు. రాజకీయం అంటే 'సేవ' అన్నారు. అది దివంగత వైయస్‌ను చూసి నేర్చుకోవాలని సూచించారు. అన్నం పెట్టిన వైయస్‌కు అన్యాయం చేయడం తగదన్నారు.
Back to Top