దమ్ముంటే ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం పెట్టాలి

'ప్రజాస్వామ్యాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న టిడిపి'

హైదరాబాద్, 12 అక్టోబర్‌ 2012: ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. ఈ నెల 18 నుంచి షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' చేస్తారని ప్రకటించినప్పటి నుంచి టిడిపి నాయకులలో వణుకుపుడుతోందని, అందుకే వారంతా కనీస స్పృహ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. షర్మిల పాదయాత్ర చేయడమంటే జగన్మోహన్‌రెడ్డిని జైలు నుంచి బయటకు తీసుకు తెచ్చుకునేందుకు బ్లాక్‌మెయిల్‌ చేయడమే అంటూ టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యానించడాన్ని ఆమె తూర్పారపట్టారు. ఎమ్మార్‌, ఐఎంజి కుంభకోణాల నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీయే బ్లాక్‌మెయిల్‌ పాల్పడుతున్నట్లు పద్మ ఆరోపించారు. అవిశ్వాసానికి, వై‌యస్ జగ‌న్మోహన్‌రెడ్డి బెయిల్‌కి లింక్‌పెట్టి మాట్లాడటం దారుణమన్నారు. తమ పార్టీ ముందు నుంచీ వ్యక్తం చేస్తున్న అనుమానాలే నిజమని టిడిపి ఇప్పుడు రుజువు చేసిందన్నారు. జగన్‌ను బయటికి రాకుండా చేయడానికి కాంగ్రెస్‌ - టిపిడిలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

అసెంబ్లీలో సరిపడినంత సంఖ్య బలం ఉన్న ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఈ ప్రజా వ్యతిరేక, అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టడంలేదో వెల్లడించాలని పద్మ డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే శాసనసభలో అవిశ్వాసం పెట్టాలని వాసిరెడ్డి పద్మ ‌సవాల్ చేశారు.‌ 'అవిశ్వాసం అంటే టిడిపి నేతలకు ఎందుకంత ఉలుకు' అని అన్నారు. అవిశ్వాసం పెట్టకుండా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ నాడు చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళారని పద్మ నిలదీశారు. అవిశ్వాసం పెట్టాల్సిన వేదిక అసెంబ్లీలో ఆ పని చేయకుండా పాదయాత్ర పేరుతో ప్రజల మధ్యకు వెళ్ళి అదే ప్రభుత్వాన్ని చంద్రబాబు తిడతారని ఎద్దేవా చేశారు. ఇది చంద్రబాబు ద్వంద్వ విధానం కాక మరేమిటని ప్రశ్నించారు. అవిశ్వాసం పెట్టకుండా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంతకు బేరం కుదుర్చుకున్నారో చెప్పాలన్నారు. టీడీపీ వీధి నాటకాలను త్వరలోనే బయటపెడతామని పద్మ హెచ్చరించారు.

ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టబోనని చంద్రబాబు నిస్సిగ్గుగా ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాన్ని పద్మ గుర్తుచేశారు. అవిశ్వాసం గురించి టిడిపి నోరెత్తడంలేదని ఆమె ఎద్దేవా చేశారు. అవిశ్వాసం పెట్టమని తాము డిమాండ్‌ చేస్తుంటే దాన్ని బ్లాక్‌మెయిల్‌ అని టిడిపి నాయకులు అనడాన్ని పద్మ తీవ్రంగా ఖండించారు. అవిశ్వాస ఆయుధాన్ని గుడ్డ కప్పి పడుకోబెట్టిన టిడిపి జగన్‌ ఎక్కడ బయటికి వస్తారో అని రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. చీకట్లో చిదంబరాన్ని కలిసిందెవరు? ప్రధానితో మంతనాలు చేసిందెవరు? చంద్రబాబు, ఆయన ఎంపీలు కాదా? అని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలను కలిసి మీరేం బేరసారాలు కుదుర్చుకున్నారని నిలదీశారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జైలులో ఉన్నప్పటికీ నాయకత్వ బాధ్యతలను షర్మిల చేపట్టి ప్రజల్లోకి వెళుతున్నారని పద్మ తెలిపారు. గుండె నిండా భారం ఉన్నా, జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ రాకపోయినా అంతా గుండెలోనే దిగమింగుకుని ప్రజల సమస్యలపై పోరాడేందుకు షర్మిల మరో ప్రజాప్రస్తానం పాదయాత్రకు ముందుకు వచ్చారని తెలిపారు. షర్మిల ప్రజల్లోకి వెళితే ఇప్పటికే మసకబారిన చంద్రబాబు, టిడిపి ఉనికి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

అసలు ప్రజల మధ్యకు చంద్రబాబు ఎందుకు వెళుతున్నట్లు అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఒకవైపున ప్రభుత్వం పడిపోకుండా మీరే కాపాడుతున్నామని చెప్పకుంటూ, మరో పక్కన ప్రజల్లోకి వెళ్ళి శాపనార్ధాలు పెడతారాని ఎద్దేవా చేశారు. ఎమ్మార్‌, ఐఎంజి వ్యవహారాల్లో మీమీదకు విచారణ రాకుండా ఉండేందుకే ప్రభుత్వాన్ని పడగొట్టబోమంటూ బేరం కుదుర్చుకున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, ప్రజలకు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రజల మధ్యకు ప్రతినిత్యం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వెళుతున్నదన్నారు. తమకు ఎదురవుతున్న కష్టాల కారణంగా రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారన్న విషయం తమకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉందన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలంతా బాధలు పడుతుంటే దాన్ని టిడిపి కాపాడుతోందని దుమ్మెత్తిపోశారు.

జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ కూడా పొందే అవకాశం లేకుండా చేసి ఆయనను ప్రజల మధ్యకు రానివ్వకుండా కాంగ్రెస్‌, టిడిపి నాయకులు చేస్తున్నారని వాసిరెడ్ది ఆరోపించారు. మళ్ళీ అధికారంలోకి వస్తే తన పాత పరిపాలనను అందిస్తానని పాదయాత్రలో ప్రజలకు చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలు, సుపరిపాలనను అందిస్తామని తాము ధైర్యంగా ప్రజలకు చెబుతామన్నారు. ఉచిత విద్యుత్‌ మీద కూడా చంద్రబాబు మాట తప్పి మాట్లాడుతున్నారని అన్నారు. అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా, అధికారం కోసం ఇంకొకలా చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. అయితే, ఆయన అసలు స్వరూపం మరొకలా ఉంటుందన్నారు. చంద్రబాబు పాలన అంటేనే ప్రజలు వంద గజాల దూరం పారిపోతారని ఎద్దేవా చేశారు.

పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఉండి, మరి కొందరు ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వైయస్‌ఆర్‌ సిపియే అవిశ్వాసం పెట్టొచ్చుకదా అన్న ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు పద్మ బదులిస్తూ, అందువల్ల ఫలితం ఉండబోదన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని టిడిపి నాయకులను ప్రశ్నించాలని సూచించారు. ఈ ప్రభుత్వాన్ని మేం కాపాడతాం అని నిజాయితీగా చెప్పాలని పద్మ సవాల్‌ చేశారు.

రాబర్టు వాద్రా విషయంలో తమ పార్టీ ఇంతకు ముందే మాట్లాడిందని, ఆయన తమకేమీ బంధువు కాదని, ప్రత్యేక అభిమానం కూడా లేదని మరో ప్రశ్నకు పద్మ సమాధానం చెప్పారు. పాదయాత్ర విషయమై ప్రత్యేకంగా నిర్వహించిన  సమావేశంలో వేరే విషయాల గురించి తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడలేదని మీడియా ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.

24 వరకూ కడప జిల్లాలో షర్మిల పాదయాత్ర:

షర్మిల పాదయాత్ర ఈ నెల 18న ఇడుపులపాయలోని దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సర్వమత ప్రార్థనలు జరిగిన తరువాత ప్రారంభమవుతుందని వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. ఈ నెల 24వ తేదీ వరకూ కడప జిల్లాలో ఆమె మరో ప్రజా ప్రస్థానం కొనసాగుతుందన్నారు. ఏయే జిల్లాల్లో పాదయాత్ర ఏ విధంగా కొనసాగుతుందో షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
Back to Top