హైదరాబాద్, 26 నవంబర్ 2012: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపైన, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపైన, వైయస్ కుటుంబంపైన చిల్లర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తెలంగాణకు చెందిన వైయస్‌ఆర్‌సిపి నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు, జిట్టా బాలకృష్ణారెడ్డి, రవీందర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ కుటుంబాన్ని ఆభాసు పాలు చేసేలా ఎవరు మాట్లడినా చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు. 'సూర్యాపేట సమరభేరి'లో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆయనకు వంతపాడే కొందరు నాయకులు, రచయితలు వైయస్ పైన చేసిన అసందర్భ వ్యాఖ్యలపై వారు తీవ్రంగా ప్రతిస్పందించారు. వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసిఆర్, ఆయన కొడుకు కేటీఆర్ పైన, వారి వందిమాగధుల తీరుపైన సంకినేని, జిట్టా, రవీంద్ర నాయక్ విరుచుకుపడ్డారు. వీరితో పాటు పార్టీ నాయకుడు ఆది శ్రీనివాస్ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో సగం మంది వైయస్ అభిమానులు ఉన్నారని, వైయస్ కుటుంబం జోలికి వస్తే శాస్తి తప్పదని వారు హెచ్చరించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలీయమైన శక్తిగా ఎదుగుతుండడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని వారు అన్నారు. వైయస్‌ఆర్ సిపికి తెలంగాణలో వస్తున్న జనాదరణ చూస్తున్న కేసీఆర్‌కు గుండెల్లో దడ మొదలైందన్నారు. ఫాంహౌస్‌లో పడుకుని, రాజకీయంగా వెనకబడిపోతున్నప్పుడు సూర్యాపేట మాదిరిగా ఒక సభ పెట్టి ఇతర పార్టీలు, నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
ముందుగా వైయస్‌ఆర్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైయస్‌ఆర్‌సిపిని చూసి కేసీఆర్ ఎంతగా ఆగమాగం అవుతున్నారో సూర్యాపేట సభలో ఆయన మాట్లాడిన తీరే స్పష్టం చేస్తోందన్నారు. నల్గొండ, ఖమ్మం వైయస్‌ఆర్‌సిపి సభల్లోను, పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్రకు లభించిన ఎనలేని ఆదరాభిమానాలతో కేసీఆర్ ఉలిక్కి పడుతున్నారన్నారు. గతంలో దివంగత వైయస్ అమలు చేసిన పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంటు లాంటి పథకాలనే కాస్త ఎక్కువ చేసి కేసీఆర్ సూర్యాపేట సమరభేరిలో ప్రకటించడాన్ని ఎద్దేవా చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ వైయస్‌ఆర్‌సిపియే అధికారంలో ఉంటుందన్న ధీమాను జిట్టా వ్యక్తం చేశారు.
పులిచింతల ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని జిట్టా అన్నారు. కేసీఆర్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే తెలంగాణ ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. పులిచింతల ప్రాజెక్టు కడితే వృథాగా సముద్రంలోకి పోయే నీటిని ఉదయసముద్రం లిఫ్టు ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో సాగునీటికి వినియోగించుకోవచ్చని ఆయన వివరణ ఇచ్చారు. నల్గొండలో నిమ్సు ఆస్పత్రిని వైయస్ నిర్లక్ష్యం చేశారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణపై జిట్టా ప్రతిస్పందించారు. మహానేత వైయస్ ఆకస్మికంగా మరణించి ఉండకపోతే దాన్ని పూర్తిచేసి ఉండేవారన్నారు. వక్ఫు భూములను లగడపాటి రాజగోపాల్‌కు వైయస్ కట్టబెట్టారని కేసీఆర్ చేసిన ఆరోపణపై స్పందిస్తూ, అప్పుడు లగడపాటితో మీరేం రహస్య ఒప్పందం చేసుకున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు వైయస్ అడ్దుపడ్డారన్న కేసీఆర్ ఆరోపణలు సత్యదూరమని జిట్టా అన్నారు. వైయస్ గాని, వైయస్‌ఆర్‌సిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి గాని తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. వైయస్ మరణించి మూడున్నరేళ్ళు అయిందని ఆయనపై ఇప్పుడు వ్యాఖ్యలు చేయడంలోనే కేసీఆర్ చిత్తశుద్ధి వెల్లడవుతోందని అన్నారు. కేసీఆర్‌కు వంతపాడే వ్యక్తి చిల్లర మల్లర మాటలు మాట్లాడడం మంచిది కాదని జిట్టా బాలకృష్ణారెడ్డి దేశపతి శ్రీనివాస్‌ను ఉద్దేశించి హెచ్చరించారు.
కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌ను జిట్టా 'పిల్ల కేసీఆర్' అని అభివర్ణించారు. వైయస్‌ఆర్ సిపి పట్ల కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను జిట్టా తిప్పికొట్టారు. కేటిఆర్ అంటే జిట్టా వ్యంగ్య నిర్వచనం ఇచ్చారు. కే అంటే 'కుళ్ళుబోతు', టి అంటే 'తిక్క', ఆర్ అంటే 'రాబందు' అని ఆయన అభివర్ణించారు. శవాల మీద పేలాలు ఏరుకునే రకం కేటిఆర్ అని దుయ్యబట్టారు. వందలాది తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాలను అడ్డుపెట్టుకుని వందలాది కోట్ల రూపాయలు దండుకుంటున్నారని అందువల్లే కేటిఆర్‌ను రాబందుతో పోల్చడం సరైనదన్నారు. కేసీఆర్ కొడుకైతే ఎమ్మెల్యే కావచ్చు గాని అందరిమీదా అనవసర ప్రేలాపనలు పేలితే సహించబోమని జిట్టా హెచ్చరించారు.
పొంతన లేని కేసీఆర్ ప్రకటనలు:ప్రత్యేక తెలంగాణ విషయంలో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చేసే ప్రకటనలన్నీ పొంతన లేనివని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, నల్లగొండ జిల్లా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. తెలంగాణ ఇస్తాం చర్చలకు రమ్మని కేసీఆర్‌ను ఎవరు పిలిచారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సకలజనుల సమ్మెను తాకట్టుపెట్టి, తనకు కావాల్సిన రాజంకు పోలవరం కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఈ విషయం అన్ని పత్రికల్లో వచ్చిందన్నారు.
దివంగత స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగిందని, తెలంగాణ కోసం జీవితాంతమూ కృషిచేసిన బాపూజీ మరణించినప్పుడు ఆయనకు కేసీఆర్ కనీసం నివాళులు కూడా అర్పించలేదని విమర్శించారు. తెలంగాణ అమరుల పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారన్నారు. తెలంగాణ రాకుండా 56 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని కేసీఆర్ చెబుతున్నారని, అయితే, తెలంగాణలో కేసీఆర్ మరో చెన్నారెడ్డి కాబోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మధ్య 25 రోజులు ఢిల్లీలో ఉండి ఆయన చేసిందేమిటో వెల్లడించాలని సంకినేని డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లాలో ప్రధానమైన ప్రాజెక్టు ఎస్‌ఆర్‌ఎస్‌పి అని సంకినేని అన్నారు. వైయస్ హయాంలోనే దాని తొలివిడత పనులు పూర్తయ్యాయని తెలిపారు. తెలంగాణలోనే అత్యంత గ్రావిటీ ఉన్న పోచంపాడు ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ఆరు తెలంగాణ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ ప్రాజెక్టుల గురించి అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. గోదావరి మీద ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించింది వైయస్ కాదా అని సంకినేని నిలదీశారు. కిరణ్ హయాంలో ఆ పనులు నిలిచిపోయిన విషయం కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులపై కిరణ్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోని కేంద్రాన్ని, కిరణ్‌ను ప్రశ్నించకుండా వైయస్‌పై అనుచితంగా వ్యాఖ్యలు చేయడాన్ని సంకినేని తీవ్రంగా ఖండించారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తూ వారిపై వైయస్‌సిపి అభ్యర్థులను జగన్మోహన్‌రెడ్డి పోటీ పెట్టని విషయం కేసీఆర్ గుర్తుచేసుకోవాలన్నారు. జిట్టా, సంకినేని, జలగం వెంకట్రావు, రేపు వడ్డేపల్లి నర్సింగరావు ఇలా తెలంగాణ ప్రాంత నాయకులు వైయస్‌ఆర్‌సిపిలో చేరుతుండడంతో కేసీఆర్‌కు పిచ్చిపట్టినట్లవుతోందన్నారు. జేఏసీ నాయకులను వేదికపై చూపించి మళ్ళీ వసూళ్ళు చేసుకునేందుకే కేసీఆర్ సూర్యాపేట సమరభేరి పెట్టారన్నారు. తెలంగాణకు వైయస్‌ఆర్‌సిపి వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణలో తమ పార్టీ రోజురోజుకూ బలపడుతోందన్నారు. టిఆర్‌ఎస్ ఉనికి కోల్పోతున్నదనే వైయస్‌ఆర్‌సిపిపై కేసీఆర్ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని సంకికేని ఎద్దేవా చేశారు.
తెలంగాణ బిడ్డలను విమర్శిస్తే ఖబర్దార్ :ఇంతకాలమూ పిట్టకతలు, తెలంగాణ యాస, భాషను అడ్డు పెట్టుకుని కేసీఆర్ చెవిలో పువ్వులు పెట్టారని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలకమండలి సభ్యుడు డి. రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డలను విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదని ఆయన నిప్పులు చెరిగారు. పదవులు త్యాగం చేసి, ఆస్తులు పోగొట్టుకున్న ఎందరో తెలంగాణ బిడ్డలు వైయస్‌ఆర్‌సిపిలో ఉన్నారన్నారు. కేసీఆర్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
కేసీఆర్ మోసాల కారణంగా తెలంగాణ బిడ్డలు ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఎలాంటి జిమ్మిక్కులు చేసినా కేసీఆర్‌కు టిడిపికి పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించారు. గతంలో 610 జీఓ విషయంలో సమైక్యాంధ్రకు కొమ్ము కాసింది కేసీఆర్ అని ఆయన గుర్తుచేశారు. కొడుకు, అల్లుడ్ని ఎమ్మెల్యేలను ఎలా చేసిందీ, బిడ్డను నాయకురాలిగా చేస్తున్నదీ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.