బాబు స్వలాభం కోసమే ఎంపీల గైర్హాజరు

హైదరాబాద్, 10 డిసెంబర్ 2012:

తన హెరిటేజ్ ప్రెష్ కంపెనీలోకి ఎఫ్‌డీఐలను ఆహ్వానించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు ఆరోపించారు. చిల్లర వర్తకుల నుంచి వ్యతిరేకత రాకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఎస్పీ, బీఎస్పీలపై ఒత్తిడి తెచ్చారన్నారు. నష్టాల్లో ఉన్న తన కంపెనీలోకి ఎఫ్‌డీఐలు రావడం వల్ల ఆయనకే ఎక్కువ లబ్ది చేకూరుతుందన్నారు. ఎఫ్‌డీఐలకు పరోక్షంగా మద్దతు తెలుపుతూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారని సోమయాజులు ధ్వజమెత్తారు.

      కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తాను అనుకున్నట్టుగానే బిల్లును నెగ్గించుకున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి.ఎ.సోమయాజులు విమర్శించారు. ఎఫ్‌డీఐ బిల్లుపై ఓటింగ్ జరిగిన రోజే హెరిటేజ్ కంపెనీ సీఇఓ చేసిన ప్రకటన అందుకు నిదర్శనమన్నారు. నష్టాల్లో ఉన్నహెరిటేజ్ ప్రెష్‌లోకి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు సీఇఓ ప్రకటించారన్నారు. తన అంతరంగం ఎవరికీ అర్థం కాకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారన్నారు. తన కంపెనీలోకి ఎఫ్‌డీఐలు వస్తున్నాయో? లేదో? స్పష్టం చేయాలని సోమయాజులు డిమాండ్ చేశారు.

ఎలా మాఫీ చేస్తారు బాబూ?


     రైతుల రుణాలు మాఫీ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని, చంద్రబాబు ఆ రుణాలు ఎలా మాఫీ చేస్తారో చెప్పాలని డి.ఎ.సోమయాజులు డిమాండ్ చేశారు.  రుణాలు మాఫీ చేస్తామంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోందని అనడం సమంజసంకాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాఫీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 2001-04 మధ్య రైతులు తీసుకున్న రుణాలకు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వడ్డీ మాఫీ చేయించిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని గుర్తు చేశారు. రైతులు తీసుకున్న రుణాలు రీషెడ్యూలు చేశారన్నారని అన్నారు.

     రుణాలు మాఫీ చేసే అధికారం చంద్రబాబుకు లేకపోయినా, వాటిని రద్దు చేస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారని సోమయాజులు అన్నారు. ఆయన ప్రకటనలు చూస్తుంటే ముఖ్యమంత్రి కావాలనా? లేక ప్రధాన మంత్రి కావాలని ప్రయత్నిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు.

Back to Top