రెండు నాల్కల టీడీపీది సమైక్య వాదమా?

హైదరాబాద్ :

రెండు రకాల వాదనలు వినిపిస్తున్న టీడీపీ సమైక్యవాది ఎలా అవుతుందని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తూర్పారపట్టారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఓడించే శక్తి శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి ఉందన్న భయంతోనే సీఎం కిరణ్, చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా విషప్రచారం చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల మధ్య పరస్పరం విభేదాలున్నప్పటికీ శ్రీ జగన్ విషయంలో మాత్రం ఒక్కటై దాడి చేస్తున్నారని విమర్శించారు. తమ విధానా‌లు, సిద్ధాంతాలను ప్రజలకు చెప్పలేని అనిశ్చితిలో ఉన్న ఆ రెండు పార్టీలూ ఏం చేయాలో తోచక ప్రజలను గందరగోళంలో పడేయడానికి శ్రీ జగన్‌పై రకరకాల అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రెండు వాదనలు వినిపిస్తున్న టీడీపీ వాళ్లు సమైక్యం కోసం పోరాడుతున్న శ్రీ జగన్‌ను విభజనవాది అని విమర్శించడం తగదని అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తానంటే నేను వద్దంటానా?’ అని చంద్రబాబు గతంలో చేసిన ప్రకటనలకు సంబంధించి పత్రికా ప్రతులను అంబటి మీడియాకు చూపిస్తూ ‘ఆయన విభజన వాది కాదా?’ అని నిలదీశారు.  రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబును సమైక్యవాది అని టీడీపీ నేతలు సీమాంధ్రలో ప్రచారం చేసుకుంటున్నారు. అదే పార్టీ తెలంగాణ నేతలు తమ నాయకుడు ఇచ్చిన లేఖ వల్లే తెలంగాణ వస్తోందని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు తలో వాదం వినిపిస్తుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు.

అలాగే, రాష్ట్రాన్ని విభజించాలని తలపెట్టిన కాంగ్రెస్సే సమైక్య పార్టీ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  చెబుతుండగా.. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాత్రం తమది ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే పార్టీ అనే చెప్పుకుంటారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఒక పార్టీలో టికెట్లు రానపుడు కొందరు అసంతృప్తి చెందుతారన్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొన్ని పత్రికలు, బినామీ చానళ్లు అలాంటి వారిని రెచ్చగొట్టి అదే పనిగా శ్రీ జగన్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

దేశంలోని ఏ రాజకీయ నాయకుని కుటుంబంపైనా జరగని విధంగా దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపైనే ఇలాంటి దాడి జర‌గడం అమానుషం అని రాంబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ప్రతిష్ట రాష్ట్రంలో తగ్గిపోతోందని ఒక పత్రిక ప్రచారం చేస్తోందంటే... ఒకప్పుడు ఆయనకు ప్రజాదరణ బాగున్నట్లు అంగీకరించినట్లే కదా! అన్నారు. శ్రీ జగన్‌కు జనంలో రేటింగ్ బాగుందని ఆ పత్రిక ఎప్పు‌డైనా రాసి చచ్చిందా? ప్రశ్నించారు. దివంగత వైయస్ఆర్ ‌సీఎంగా ఉన్నపుడు 2009లో కూడా ఇవే పత్రికలు, మీడియా ఇలాగే దుష్ర్పచారం చేశాయి. కానీ, ప్రజలు వీరి రాతలను వమ్ము చేస్తూ గెలిపించారు. వాళ్లేమి రాసుకున్నా ఎంత దుష్ర్పచారం చేసినా అంతిమ విజయం శ్రీ జగన్‌దే అని రాంబాబు ధీమాగా చెప్పారు.

ట్యాంక్‌బండ్‌పై ఉన్నవి మట్టిబొమ్మలని, చెప్పులు వేశారని ఒకాయన విమర్శిస్తే... అపుడు మీ నాన్న ఎక్కడున్నారని మరొకరు విమర్శిస్తున్నారు. ఇలాంటి చెత్త మాట్లాడుకోవడానికా విభజన బిల్లుపై అసెంబ్లీ చర్చలో పాల్గొనమని వైయస్ఆర్‌సీపీపై ఒత్తిడి తెస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు.

Back to Top