శ్రీకాకుళం: ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో విజయం పొందాలి.. బాధ్యతను ఎప్పుడూ గుర్తు చేస్తుండాలనే ఉద్దేశంతో ఇచ్ఛాపురంలో విజయ సంకల్ప స్థూపం నిర్మిస్తున్నామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. పాదయాత్ర స్ఫూర్తిని, ప్రజలకు ఇచ్చిన భరోసాలను గుర్తుకు తెస్తూ స్థూపం నిర్మిస్తున్నామన్నారు. ఇచ్ఛాపురంలో విజయ సంకల్ప స్థూపం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఏర్పాట్ల పరిశీలనలో మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 9వ తేదీన ముగుస్తుందన్నారు. కడప, రాజమండ్రి సభలను మించేలా ఇచ్ఛాపురంలో బహిరంగ సభ ఉంటుందన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ సభ పెట్టినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారని, సభకు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, అభిమానులు తరలివస్తారన్నారు. భారీగా జనం వచ్చే అవకాశం ఉన్నందుకు జననేతకు భారీ భద్రత కల్పించాలని ఇప్పటికే పోలీసులను కోరడం జరిగిందన్నారు. 9వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు విజయ సంకల్ప స్థూపాన్ని వైయస్ జగన్ ప్రారంభిస్తారని తలశిల రఘురాం చెప్పారు. స్థూపం ఆవిష్కరణ అనంతరం 1:30 గంటలకు ఇచ్ఛాపురం బస్టాండ్ సెంటర్‌కు చేరుకొని సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఆ తరువాత విజయనగరం చేరుకొని అక్కడి నుంచి రైలు మార్గంలో తిరుమల చేరుకుంటారన్నారు.