అనంతపురం: ఎన్నికల ముందు లేనిపోని హామీలు ఇస్తే ఆశపడి చంద్రబాబుకు ఓటేశాం. ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నాక అందరీని మోసం చేశాడు. తెలీక ఒకసారి మోసపోయాం. మళ్లీమళ్లీ ఎలా మోసపోతాం. ఆయన్ను ఇలాగే నమ్మితే వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంట్లోనూ మహిళకు బంగారు గాజులు కొనిస్తానని చెబుతాడని నగరంలో తొమ్మిదో డివిజన్ పరిధిలోని భవానీ నగర్‌కు చెందిన పలువురు మహిళలు పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
అర్హతలున్నా పింఛన్ ఇవ్వలేదు
నా భర్త సత్య చనిపోయి ఏడాదయ్యింది. పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేశా. టీకొట్టు వ్యాపారం అంతంత మాత్రమే. బాబు, పాప ఆలనాపాలనా భారమైందని పామిడి పట్టణంలోని బ్రహ్మణవీధికి చెందిన లక్ష్మిదేవి వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి ఎదుట వాపోయింది. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆయన పట్టణంలోని 11, 12, 17 వార్డుల్లో పర్యటించారు. నిత్యావసరాల ధర పెంపుపై వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. సవాలక్ష ఆంక్షలతో ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కొర్రీ పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
