గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ శ్రేణులు ప్రతీ గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. చంద్రబాబుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. మోసపూరిత హామీలతో వంచించిన బాబుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ జెండా లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
మౌలిక సదుపాయలు లేక నానా ఇబ్బందులు
పట్టణంలోని తాగునీరు, కరెంటు, డ్రైనేజీ, గుంతల రోడ్ల వంటి మౌలిక సదుపాయలు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వివరించారు. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆయన 31, 32 డివిజన్లలో పర్యటించి ప్రజలకు ప్రజాబ్యాలెట్‌ను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 31, 32 డివిజన్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను అధికారులకు అందజేస్తానని ఆయన వివరించారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు.
బాబుకూ ప్రత్యేక హోదా తీసుకొచ్చే దమ్ము లేదు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దమ్ములేక, హోదా గురించి ప్రధాని మోడీని నిలదీయలేక చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే పి. అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు పట్టణంలోని 4వ డివిజన్ శ్రీనివాసనగర్, జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో పోలంరెడ్డి వెంకటేశ్వర్లరెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు గాలికి...
అధికార పార్టీ నేతలు, అధికారులు ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విమర్శించారు. గడపగడపకూ వైయస్సార్ కార్యక్రమంలో భాగంగా ఆమె కల్లూరు అర్బన్‌లో ప్రజలకు ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు. ఎస్టేట్ ప్రధాన రహదారికి ఒకవైపున మురుగు కాలువ నిర్మిస్తామని మట్టితవ్వేసి పట్టించుకోవడం లేదని ఆయా దుకాణాల యాజమానులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. తన కుటుంబంలోని మాలన్‌బీ అనే మానసిక వికలాంగురాలికి పింఛన్ తొలగించారని ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.