ప్రజాభిప్రాయ ఫలితం సిద్ధించుగాక!

'సింగ్‌జీ మీ సేవలిక చాలు.. గద్దె దిగండి' అంటూ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహ‌న్ సింగ్‌ను సవియనంగా కోరుతున్నారు దేశ ప్రజలు. బొగ్గు కేటాయింపుల్లో సర్కారు బొక్కసానికి పెద్ద ‘బొక్క’ పడేలా వ్యవహరించిన ‘మౌన ముని’ పీఠం దిగితేనే మంచిదన్న అభిప్రాయంతో జాతి జనులున్నారు. తన హయాంలో యూపీఏ-2 ప్రభుత్వంపై పడిన అవినీతి మచ్చలకు మన్మోహన్ బాధ్యత వహించి, పదవి నుంచి వైదొలగాలని ప్రజలు వేడుకుంటున్నారు. ‘నేను మాత్రం నిజాయితీపరుణ్ణి, నా సహచరులు మంత్రులు చేసిన దాంతో నాకు సంబంధం లేదు’ అన్న తీరుగా కొనసాగుతున్న సింగ్ ‘సీటు’ వదులుకోవాల్సిందేనని విన్నవించుకున్నారు. సీఎ‌న్‌ఎన్ ఐబీఎ‌న్ సెప్టెంబ‌ర్ 7న నిర్వహించిన ‌ఆ‌న్‌లైన్ సర్వేలో ‘మౌన’ ప్రధానిపై జనం తమ అంతరాన్ని ఆవిష్కరించారు. 

కోల్‌గేట్ కుంభకోణానికి బాధ్యత వహించి మన్మోహ‌న్ పదవికి రాజీనామా చేయాలని 75 శాతం మంది సర్వేలో అభిప్రాయపడ్డారు. వివా‌దాదస్పద బొగ్గు గనుల కేటాయింపులను రెండో మాట లేకుండా రద్దు చేసి పడేయాలని 80 శాతం మంది ఢంకా బజాయించారు. బొగ్గు గనుల కేలాయింపుల్లో కాంగ్రెస్ పార్టీకి ముడుపు‌లు అందాయని అత్యధిక శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీఏ సర్కారులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి పార్టీగా ప్రజల ‘మన్ననలు’ చూరగొంది. కాంగ్రె‌స్‌తో పోల్చుకుంటే బీజేపీ కాస్త నయమేనని నిట్టూర్చారు. 73 శాతం మంది కాంగ్రెస్ అత్యంత అవినీతి పార్టీ అనే అభిప్రాయాన్ని ప్రకటించారు. 

అవినీతిపై ఆధునిక రాజకీయ పార్టీలు వల్లిస్తున్న నీతులు నీటి‌ మీద రాతలేనని మేధావులైన ఓటరు దేవుళ్లు గ్రహించారు. ఈ విషయంలో అన్ని పార్టీలు ఆ తాను ముక్కలేనని లెక్కగట్టారు. అవినీతిపై అన్ని పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని 78 శాతం భావిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ‘యువ’ గాంధీ (రాహుల్ గాంధీ) పట్టాభిషేకానికి ప్రజల ఆమోదం లభించలేదు. మన్మోహ‌న్ దిగిపోతే రాహు‌ల్‌ను ప్రధాని పీఠంపై కూర్చొబెట్టొందంటూ ఏకంగా 88 శాతం మంది మొత్తుకుంటున్నారు. అంటే 12 శాతం మంది మాత్రమే సోనియా తనయుడికి మద్దతు ఇస్తున్నారని సీఎన్‌ఎస్ ఐబీఎ‌న్ సర్వే తేల్చింది. 

కో‌ల్‌గేట్ కుంభకోణంలో ఇంటా‌ బయటా ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్మోహన్ సింగ్ ప్రజా మద్దతు కోరారు. ‘మసి’ పేరుతో పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ధిచెప్పాలని ప్రజానికానికి సింగ్‌జీ సందేశమిచ్చారు. ఆటంక రాజకీయాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆయన తెగ బాధ పడిపోతున్నారు. మరి దేశానికి జరిగిన నష్టం మాటేమిటని ప్రశ్నిస్తే మాత్రం ‘నేను నీతివంతుణ్ణి’ అని సమాధానమిస్తారు మన్మోహన్. మరి బాధ్య‌త ఎవరిది అని అడిగితే ‘నాకు సంబంధం’ లేదంటారు. అయ్యా సింగ్‌గారూ ప్రభుత్వ పెద్దగా మీరు జవాబు చెప్పాల్సిన పనిలేదా అంటే మౌనం దాలుస్తారు. కాగ్ నివేదికపై చర్చలకు సిద్ధమంటూనే చర్యలకు వెనుకంజ వేస్తున్న మన్మోహ‌న్ వైఖరి కడు విచిత్రం. అందుకో కాబోలు ‘సా‌ర్’ని సాగనంపాలని జనం కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టమే చెల్లుతుంది. ప్రజా‌భిప్రాయ ఫల సిద్ధిరస్తు!
Back to Top