పొగరుమోతు‌ రాజకీయ పోట్లగిత్తలు

నోటికొచ్చినట్లు మాట్లాడ్డం ఓ కళ. అలా మాట్లాడినవాళ్లను అంతే నోటిదురుసుతో దులిపేయడం కూడా గొప్ప కళారూపమే! మొదటిరకం కళలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరితేరిన వ్యక్తి. కాగా, రెండో రకం కళారూపంలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అందె వేసిన చెయ్యి. ఇటీవల వీళ్లిద్దరూ కూడబలుక్కుని జనానికి అద్భుతమయిన కాలక్షేపం -ఉచితంగా- అందచేస్తున్నారు.

ఆ మధ్యన పీసీసీ అధ్యక్షుడు బొత్స తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటన్న ప్రశ్నకు డొంకతిరుగుడు సమాధానమిస్తూ ‘తెలంగాణ వస్తే అందరికీ హ్యాపీయే!’ అని జనాంతిక ప్రకటన చేశారు. తెలుగు మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఉంటే తప్పేమిటని కూడా బొత్స నిలదీశారు. అక్కడితో ఆగకుండా తెలంగాణ రాష్ట్రం రావడంగానీ, రాకపోవడంగానీ అంతా చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉందని ఓ చురక తగిలించారు కూడా. దాంతో, టీడీపీ నేతలకు -సహజంగానే- మండింది. ఆ పార్టీ తరఫున అయినదానికీ కానిదానికీ ప్రత్యర్థులను చెరిగిపొయ్యడమే ప్రవృత్తిగా గల పయ్యావుల కేశవ్ రంగంలోకి దిగారు.

బుధవారం రాత్రి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కేశవ్ బొత్సకు క్లాస్ పీకారు. బాధ్యతగల పదవిలో ఉన్న బొత్స ఇష్టమొచ్చినట్లు మాట్లాడ్డం సరికాదన్నారాయన. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రజలను గందరగోళంలో పడెయ్యడం తగదని హితవు కూడా చెప్పారు. జనాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసేవారికి ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారని కేశ‌వ్ హెచ్చరించారు కూడా.

నిన్నగాక మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో, బుజాలమీద చేతులేసుకుని తిరిగి, వై‌యస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను ఓడించడానికి ఉమ్మడిగా చెమటోడ్చిన కాంగ్రెస్ - టీడీపీ నేతలు ఇలా రోడ్డెక్కి దుమ్మెత్తిపోసుకోవడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులూ, శాశ్వత మిత్రులూ ఉండరని పెద్దలంటారు- అంచేత, అదలా ఉంచండి! అసలు తెలంగాణ సమస్య పరిష్కారం కావాలని కాంగ్రెస్ పార్టీకి గానీ, టీడీపీకి గానీ ఏ కోశాన్నయినా ఉందా? ఇదీ అసలు ప్రశ్న!

‘తెలంగాణ ఇచ్చేదీ మేమే- తెచ్చేదీ మేమే!’ అంటూ కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో ఇప్పటికీ అద్వైతం మాట్లాడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు పాము పగ- పడగ ముద్దు అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు. కేంద్ర నాయకత్వాన్ని నోరారా కీర్తిస్తూ, రాష్ట్ర నాయకత్వం మీద మాత్రం రాళ్లు వేస్తున్నారు. గాంధీ భవన్లో పాగావేసిన ‘సీమాంధ్ర వలసవాదులు’ తెలంగాణ ఏర్పాటుకు మోకాలు అడ్డుపెడుతున్నారని కాంగ్రెస్ ఎంపీలు వాపోతున్నారు. ఈ ఏడుపులూ మొత్తుకోళ్లను జనం సీరియ‌స్‌గా తీసుకోడం లేదు. రోజూ చచ్చేవాడి కోసం ఏడ్చేదెవరు? అన్న చందంగా, తెలంగాణ ఎంపీలు ఎంత దైన్యం నటిస్తూన్నా ప్రజలు పట్టించుకోడం లేదు.

లేస్తే మనిషిని కాదన్నట్లు మాట్లాడే కేశవరావు, అదిగో తెలంగాణ ఆ మూలమలుపులో వేచిచూస్తోందన్నట్లు ఊరించే పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రిగానూ ఏఐసీసీ సభ్యుడిగానూ మా డాడీ పొడిచింది పోగా ఇక మేమేదో పొడిచేసి చూపిస్తామన్నట్లు కబుర్లు చెప్పే వివే‌క్, ప్రి‌న్స్ రాహు‌ల్ గాంధీ తన జేబులో బొమ్మేనని కోతలు కోసే మధు యాష్కీ, ప్రతి ప్రె‌స్‌మీట్‌లోనూ ఆరడుగుల అతిశయోక్తులు వల్లించే సుఖేందర్‌రెడ్డి తదితరులు మరెందరో మహానటులు! కాంగ్రెస్ అధిష్టానాన్ని తెలంగాణ ఏర్పాటుకు ఏనాడో ఒప్పించామనీ- కావూరి, రాయపాటి, లగడపాటి తమ ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసేశారనీ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాచిపాటనే పల్లవిస్తున్నారు.

తెలంగాణ జనం నిజంగానే అమాయకులయితే కావచ్చుకానీ, మరీ ఏళ్ల తరబడి సాగే ఇలాంటి చ్యూయింగ్‌ ప్రహసనాన్ని నిజమని నమ్మేంత అమాయకులు కారు. కాంగ్రెస్‌ ప్రజల ముందు నిలబడివలసి వచ్చిన రోజున జనమే ఆ విషయాన్ని రుజువు చేస్తారు!

ఇక, తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు రెండాకులు ఎక్కువే చదివిన బాపతు! తెలంగాణ ఏర్పాటు విషయంలో తమ పార్టీ ఏనాడో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేసిందనీ, తమ అభిప్రాయం ప్రకటించలేదని చిదంబరం చెప్పడం పచ్చి అబద్ధమనీ ఎర్రబెల్లి దయాకర్‌ టి టీడీపీ నేతలు అరిచి ప్తున్నారు.

మోత్కుపల్లి నరసింహులు టి తీవ్రవాదులు తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గిర -తాడు చుట్ట చుట్టుకుని బుజానికి తగిలించుకుని మరీ- ప్రెస్‌ మీట్‌ పెట్టి కేసీఆర్‌ను బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేశారు. కేసీఆర్ నోటి తీటకు పదిరెట్లు ఎక్కువయిన నాలుక తుత్తర ప్రదర్శించారు. సభ్యప్రపంచం సిగ్గుపడే స్థాయిలో టీఆరెస్ నేతలపై బురద చల్లారు. అంతే తప్ప, తెలంగాణపై నిర్మాణాత్మకమయిన సలహా ఒక్కటి కూడా ఇవ్వలేదు.

ఇదే నాటకం సీమాంధ్ర రంగంపై రీప్లే చెయ్యడానికి బొత్స-పయ్యావుల లాంటి వృత్తికళాకారులు ప్రయత్నిస్తున్నారు. సిద్ధేంద్ర యోగికీ, జాయప సేనానికీ కూడా పాఠాలు చెప్పగల ఈ అభినయ వేత్తలు గుర్తించాల్సిన విషయం ఒకటుంది. ప్రజలు అమాయకులు కారు- వాళ్లకు అన్ని విషయాలూ తెలుసు! మొన్నటి ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం!

Back to Top