‘జీవితానికి ముగింపుగా మనం భావించే రోజు, నిజానికి అమరత్వానికి తొలి రోజు!’ అన్నాడట -క్రీస్తుకు సమకాలికుడయిన రోమన్ తత్వవేత్త, నాటకకర్త, రాజనీతిజ్ఞుడు- సెనెకా.ఇది ఎందరి విషయంలో నిజమయిందో ఏమో తెలియదు. అయితే, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విషయంలో మాత్రం సెనెకా మాట నూటికి నూరుపాళ్లు నిజం. మూడేళ్ల కిందట సెప్టెంబర్ రెండవ తేదీన వైయస్‌ఆర్ విమానం కూలిపోయిన ప్రమాదంలో మరణించిన నాటి నుంచీ, ఆయన ప్రజల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయారు. ఈ నాటికీ, జనహృదయాల్లో వైయస్ఆర్ చిరంజీవిగా నిలిచే ఉన్నారు. ‘మరణానంతర జీవితం’ అంటే ఇదేనేమో!మనమందరం మర్త్యులం. అంటే, ఏదో ఒకనాడు మరణించేవాళ్లమే. కానీ, మనలో కొందరు దశాబ్దాలూ, శతాబ్దాలూ, సహస్రాబ్దాలూ ‘జీవించడం’ చూస్తూనే ఉంటాం. ఒక వ్యక్తి, మరణించిన తర్వాత సైతం జనజీవనంలో సజీవంగా మిగలడం -అనుకున్నంత, అన్నంత- ఆషామాషీ కాదు. అతగాడి వల్ల సమాజ జీవనం ప్రగాఢంగా ప్రభావితం అయితే తప్ప ఈ ఫలితం సాధ్యంకాదు. మనిషికి నిప్పు చేసుకోవడం నేర్పిన ప్రొమిథియస్‌ను మానవజాతి మరువలేదు. వరద ముప్పు నుంచి మానవాళిని కాపాడిన గిల్గమేష్‌ను మనుషులు మర్చిపోలేదు.మధ్య ప్రాచ్యంలో వ్యవసాయ నాగరికతకు చాళ్ళు వేసిన ఆదిమ మానవులను మనం ఎన్నటికీ మరువలేం. ఒకఫాదర్ డామియెన్‌నూ, ఒక ఫ్లారెన్స్ నైటింగేల్‌నూ, ఒక నార్మన్ బెత్యూన్‌నూ, ఒక కోట్నిస్‌నూ మర్చిపోయిన నాడు మనం మనుషులం అనిపించుకోం. వాళ్లందరూ అమరులయి మన మధ్యనే జీవిస్తున్నారు!సమకాలీన తెలుగు చరిత్రలో అమరత్వం సిద్ధింపచేసుకున్న రాజనీతిజ్ఞుడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. నాలుగు సార్లు లోక్‌సభకూ, అయిదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయినందువల్లనో- 1980-83 సంవత్సరాల మధ్యకాలంలో మూడు మంత్రిత్వ శాఖలు నిర్వహించినందుకో- 2004-09 సంవత్సరాల మధ్య రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి కడదాకా ఆ పదవిలో ఎదురు లేకుండా కొనసాగినందుకో వైయస్ఆర్‌కు అమరత్వం సిద్ధించలేదు.2009 సెప్టెంబర్ రెండవ తేదీన ఆయన కన్నుమూసినప్పుడు బీబీసీ వార్తాసంస్థ ప్రకటించినట్లుగా- మన రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలకు మారుపేరుగా నిలిచినందువల్లనే వైయస్‌ఆర్ అమరత్వం పొందారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిననాడే ఉచిత విద్యుత్తు ఫైలుపై తొలి సంతకం చేసి తన విశ్వసనీయతను మరోసారి రుజువు చేసుకున్నారు వైయస్‌ఆర్. ఆరోగ్యశ్రీ, 108, పావలా వడ్డీ, ఇందిరమ్మ ఇళ్లు, రెండు రూపాయలకు కిలో బియ్యం, వరికి కనీస మద్దతు ధర, ఫీజు రీయింబర్సమెంట్, గ్రామీణ ఉపాధి పథకం సమర్థ నిర్వహణ- ఇవి వైయస్‌ఆర్ హయాంలో అమలయిన సంక్షేమ పథకాల్లో కొన్ని మాత్రమే!గ్రామీణ పేదరికం నిర్మూలించడం లక్ష్యంగానే ఈ పథకాలన్నీ రూపుదిద్దుకోవడం విశేషం. ఇక, రైతులకు సాగునీటి కొరత సమస్యను సమూలంగా పరిష్కరించే దిశగా చేపట్టిన జలయజ్ఞం ఈ పథకాలకు తలకట్టులాంటిది. వైయస్‌ఆర్‌ను ప్రజా హృదయ సీమలో సుస్థిరంగా ప్రతిష్ఠించిన పథకాలివి.వైయస్‌ఆర్ మరణవార్త విన్న వెంటనే కొన్ని వందల గుండెలు ఆగిపోయాయి. మరెందరో దుఃఖభారం భరించలేక ప్రాణాలు వదిలేశారు. అలా కన్నుమూసిన వారందరి కుటుంబ సభ్యులనూ వారివారి ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తానని ఆ మహానేత కుమారుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి నల్లకాలువ బహిరంగ సభలో ప్రకటించారు. చెప్పినట్లే ఓదార్పు యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ అధిష్టానం మొదలుకుని ఇక్కడి చిల్లర దేవుళ్ల వరకూ ఎందరెన్ని అభ్యంతరాలు లేవదీసినా జగన్ వెనక్కు తగ్గలేదు. ఈ ప్రవృత్తి ఆయనకు తండ్రి నుంచి సంక్రమించింది. ఆ వారసత్వం అలా కొనసాగుతోనే ఉంది!వైయస్‌ఆర్‌ను ఇడుపులపాయలో నిద్రిస్తున్న ఈ అవిశ్రాంత యోధుడని ఎవరో అభివర్ణించారు. వాస్తవానికి వైయస్‌ఆర్ లేని చోటే లేదీ రాష్ట్రంలో. ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారు కనీసం ఒక్కరయినా ఉంటారు. వారి గుండెలో వైయస్‌ఆర్ సజీవంగా నిలిచే ఉంటారు. అమరత్వం సిద్ధింపచేసుకోవడమంటే ఇదే కదా! ఇంతకు మించిన మరణానంతర జీవితం మరేముంటుంది?'జీవితాన్ని సంపూర్ణంగా జీవించు! ఎంత సంపూర్ణంగానంటే, అర్ధరాత్రి మృత్యువు దొంగలా నిన్ను చేరే వేళకు తన చేతికి ఏమీ దక్కకూడదు సుమా!’ అన్నారెవరో కవిగారు. అంత సంపూర్ణంగా జీవితాన్ని గడపగలిగే వారు ఎందరో ఉండరు. ఆ అరుదయిన పక్షుల కోవకు చెందినవారే జననేత వైయస్ రాజశేఖరరెడ్డి.