వైయస్ఆర్ ఘాట్‌లో మహానేతకు విజయమ్మ నివాళి

ఇడుపులపాయ: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన సతీమణి, ఎమ్మెల్యే విజయమ్మ ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ను ఆమె సందర్శించి మహానేత సమాధి వద్ద పూలమాలలు వేసి 20నిమిషాల పాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయమ్మతోపాటు ఎస్టేట్ ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి, సాక్షి డెరైక్టర్ రాణిరెడ్డి, యాంకర్ స్వప్న, ఎమ్మెల్యే గౌరవ సలహాదారు పి.మోహన్‌రెడ్డి, ఏపీ ఆగ్రోస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, రామగంగిరెడ్డి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అక్కడికి వచ్చిన చక్రాయపేట, వేంపల్లె వాసులను ఆమె పలకరించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన దాదాపు 300మంది వైఎస్‌ఆర్ సీపీ నాయకులు మహానేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద సాయంత్రం నివాళులర్పించారు. ఆప్యాయంగా పలకరించిన విజయమ్మ
పులివెందుల: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రవారిపల్లె, చిన్నగట్టుగల్లు, ఆర్.సి.పురం ప్రాంతాల నుంచి దాదాపు వేయిమంది పార్టీ కార్యకర్తలు, నాయకులు మంగళవారం పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. వీరందరినీ ఎమ్మెల్యే విజయమ్మ ఆప్యాయంగా పలకరించారు. విజయమ్మతో కరచాలనం చేసేందుకు వందలాది మంది కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు రావడంతో కొంత ఇబ్బంది కలిగినా తర్వాత అందరితో ఆప్యాయంగా మాట్లాడారు.  కృష్ణా, అనంతపురం జిల్లాల నాయకులతో

ఎమ్మెల్యే విజయమ్మను కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అప్పిడి రాజశేఖరరెడ్డి, సిశీంధర్‌రెడ్డితోపాటు కొంతమంది వచ్చి కలిశారు. ఈ సందర్భంగా అక్కడ పార్టీ పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనంతపురం జిల్లా పుట్టపర్తి ట్రేడ్ యూనియన్ కన్వీనర్ కె.లక్ష్మినారాయణతోపాటు మరికొంతమంది విజయమ్మను క్యాంపు ఆఫీసులో కలిశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సత్యసాయిబాబాతో కలిసినప్పటి ఫొటోను ఆమెకు జ్ఞాపికగా అందజేశారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు
అమడగూరు: చినగానిపల్లి, చినపానిపల్లి, మారుతీపురం, ఆకులవారిపల్లి, కమ్మవారిపల్లిలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన దాదాపు 500 మంది కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నేడు వైఎస్సార్ సీపీ సమావేశం
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని వీకే భవన్‌లో సమావేశం జరగనుంది. జిల్లా ఇన్‌చార్జ్ దేవగుడి నారాయణరెడ్డితో పాటు మరికొందరు రాష్ట్ర నేతలు హాజరుకానున్నారు. సభ్యత్వ నమోదు పుస్తకాల స్వీకరణ కోసం నియోజకవర్గాల వారీగా 14 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
జగన్‌తోనే రామరాజ్యం
గుంతకల్లు టౌన్: జననేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితోనే రామరాజ్య స్థాపన సాధ్యమ ని వైఎస్సార్‌సీపీ గుంతకల్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వై.వెంకటరామిరెడ్డి అన్నారు. మంగళవారం గడప గడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని గంగానగర్‌లో 600 మంది పార్టీ లో చేరారు. వీరిలో 400 మంది మహిళ లున్నారు.
విజయమ్మను కలిసిన పూతలపట్టు నేతలు
చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూతలపట్టు నియోజక వర్గ నేతలు మంగళవారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను పులివెందులలో కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు తలపులపల్లె బాబురెడ్డి, పాడేరు రామచంద్రారెడ్డి, ఐరాల బుజ్జి రెడ్డి, బైటపల్లె దొరస్వామిరెడ్డిలతో విజయమ్మ అరగంట పాటు నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులు, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చ ర్చించారు. అనంతరం మూడు రోజుల పాటు విద్యుత్ సమస్యలపై చేపట్టనున్న ధర్నాలు, 31న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బంద్, సెప్టెంబర్ 2న మహానేత వైఎస్సార్ వర్ధంతి నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను నేతలు వివరించారు. అనంతరం నాయకులు ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు.
జగన్‌తోనే రాజన్న రాజ్యం: అంబటి
సత్తెనపల్లి : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డి అందించిన సువర్ణపాలన తిరిగి రాష్ట్ర ప్రజలకు దక్కాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో భాగమైన నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన ప్రజారాజ్యం, సీపీఐ, టీడీపీలకు చెందిన 21 మంది మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్టణంలోని తన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వారికి అంబటి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Back to Top