వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై పోలీసుల జులుం

హైదరాబాద్: కరెంటు కోతలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైంది. పోలీసులు బందును అడ్డుకోవడానికి తీవ్రంగా యత్నించారు. వివిధ జిల్లాల్లో ముఖ్యనేతలను గృహనిర్బంధం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో పోలీసులు కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగుతున్నారు.

పులివెందులలో పోలీసుల జులుం

కడప : బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారు. వైఎస్సార్‌ జిల్లాలో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పులివెందులలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం కన్వీనర్‌ అవినాష్ రెడ్డిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. కార్యకర్తల్ని ఈడ్చుకెళ్ళి, పోలీసు వాహనాల్లో పడేశారు. పులివెందులలో అదనపు బలగాలు మోహరించి, భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ అవినాష్ రెడ్డి ఈసందర్భంగా డీఎస్పీని ప్రశ్నించారు.

వంగవీటి రాధాకృష్ణ గృహనిర్బంధం

విజయవాడ : విజయవాడలో పోలీసుల ఓవరాక్షన్‌ కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రస్‌ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణను గృహనిర్బంధం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వంగవీటి రాధా ఇంటికి చేరుకున్నారు. దాంతో బెజవాడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

గుంటూరులో పోలీసుల అత్యుత్సాహం

గుంటూరు : గుంటూరు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహాం ప్రదర్శిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని రైతులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. అర్ధరాత్రి వేళ గ్రామాల్లోకి వెళ్లి పార్టీ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు స్వామి భక్తిని మానుకోకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.

ఖమ్మంలో ప్రశాంతంగా బంద్

ఖమ్మం: విద్యుత్ కోతలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్కు సంఘీభావంగా ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్చందంగా మూసివేశాయి. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, మండలాల్లో వర్తక, వాణిజ్య సముదాయాలను మూతపడ్డాయి. పలుచోట్ల డిపోల ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా చేస్తున్న అయూబ్ను అరెస్టు చేశారు. భద్రాచలంలో 20 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలో పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేతలు ఎడవల్లి కృష్ణ, మచ్చ శ్రీను, ఎర్రంశెట్టి ముత్తయ్య సహా 200మందిని అరెస్టు చేశారు.

వైఎస్ఆర్ సీపీ నేతల ఇళ్లపై దాడులు

కరీంనగర్: జిల్లాలోని ఆ పార్టీ నేతల ఇళ్లపై పోలీసులు దాడులు చేశారు. కరీంనగర్లో సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా అయిదుగురిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. రామగుండంలో అయోథ్య సింగ్ సహా మరో ఇద్దర్ని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. జమ్మికుంటలో పట్టణ అధ్యక్షుడు బోళ్ల స్వామి సహా పదిమందిని అరెస్ట్ చేశారు. మల్లాపూర్లోనూ అయిదుగురు వైఎస్ఆర్ సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

ఆదిలాబాద్లో కొనసాగుతున్న బంద్

ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌ జిల్లాలో తెల్లవారుజాము నుంచే బంద్ కొనసాగుతోంది. భైంసాలో పార్టీ కో కన్వీనర్‌ రవిప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు బైఠాయించారు. దాంతో నిరసన తెలుపుతున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావ్‌, అనిల్‌కుమార్‌ల ఆధ్వర్యంలో బస్సు డిపోల ఎదుట ఆందోళన సాగుతోంది. రాష్ట్ర సర్కారు మొండి వైఖరికి నిరసనగా భారీ ర్యాలీ చేపట్టారు. ఇటు పలుచోట్ల బంద్ పాటిస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు విద్యా, వ్యాపార సంస్థలు బంద్‌ను స్వచ్ఛందంగా పాటిస్తున్నాయి.

 

Back to Top