వైయస్‌ జగన్ను ఎదుర్కోలేక పొత్తులు

తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టుపెట్టాడు
అభివృద్ధిని చూపించి ఎన్నికలకు వెళ్లే దమ్మూ, సత్తా టీడీపీకి లేదు
విలువలు, సిద్ధాంతాలు లేని వ్యక్తి చంద్రబాబు
ప్రజాస్వామ్యం గురించి బాబు మాట్లాడడం హాస్యాస్పదం
రాహుల్‌ మొదబ్బాయి, సోనియా ఇటలీ దెయ్యం అన్నది నువ్వుకాదా..?
ఆఖరికి పాక్కుంటూ వెళ్లి రాహుల్‌ గాంధీ కాళ్లపై పడ్డాడు
విజయవాడ: ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. ఏ సిద్ధాంతంతో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నావు చంద్రబాబూ అని ప్రశ్నించారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బాబు ఢిల్లీలో తాకట్టుపెట్టారన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరి కాళ్లయినా పట్టుకుంటారన్నారు. నాలుగు సంవత్సరాల పాలన చూసి.. కొత్తగా ఏర్పడిన ఏపీని అభివృద్ధి చేసిన తీరును చూసి.. ఇచ్చిన హామీల అమలు చూసి గెలిపించండి అని అడిగే దమ్ము, సత్తా లేక చంద్రబాబు అందరి కాళ్లు, వేళ్లు పట్టుకుంటున్నాడన్నారు. దానికి మళ్లీ జాతీయ కూటమి, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ కొత్త కొత్త భాష్యాలు చెబుతున్నాడన్నారు. రాష్ట్రం ఎన్ని విధాలుగా నాశనం అయినా.. అధికారంలో కొనసాగాలని చంద్రబాబు లక్ష్యమన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోవత్సవం నవంబర్‌ 1వ తేదీన రాష్ట్రాన్ని అన్యాయంగా చీల్చివేసిన కాంగ్రెస్‌తో జతకడుతున్నారంటే చంద్రబాబుకు విలువలు, సిద్ధాంతాలు లేవని అర్థం అవుతుందన్నారు. చంద్రబాబు ఎటువంటి పిచ్చివేషాలు వేసినా టీడీపీ నాయకులు, పచ్చ మీడియా మేసేందుకు సిద్ధపడడం దురదృష్టకరమన్నారు. రాహుల్‌గాంధీని కలిసేందుకు హుటాహుటిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని వెళ్లిన చంద్రబాబు గురించి టీడీపీ నేతలు మా నాయకుడు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని, ఏ పార్టీ అధికారంలోకి రావాలనే ఆయనే డిసైడ్‌ చేస్తారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఒంటరిగా పోరాడే సత్తాలేక చంద్రబాబు గతంలో మోడీ కాళ్లు.. ఇప్పుడు రాహుల్‌గాంధీ కాళ్లు పట్టుకుంటున్నారన్నారు. 

మూడు ప్రభుత్వాలు చంద్రబాబు కూర్చోబెట్టాడని జబ్బలు సరుచుకుంటున్న టీడీపీ నాయకులు ఈ మూడు ప్రభుత్వాల హయాంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏదైనా సాధించారా అని ప్రశ్నించారు. ఎంతసేపు జేబులు నింపుకోవడం.. తనపై కేసులు రాకుండా చూసుకోవడం.. అధికారంతో ప్రతిపక్షాలను అణగదొక్కడమే కాకుండా చంద్రబాబు చేసిందేమైనా ఉందా అని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రజాస్వామిక అణివార్యత అని ఇంగ్లిష్‌లో మాట్లాడిన బాబు దేశంలోనే అప్రజాస్వామికంగా పుట్టిన నాయకుడన్నారు. 1994లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేల క్యాంపు నిర్వహించి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌పైనే చెప్పులు వేయించిన విషయం మరిచిపోయారా అని నిలదీశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన నువ్వా చంద్రబాబూ ప్రజస్వామ్యం గురించి మాట్లాడేది.. ఓటర్‌ ఆశీర్వాదంతో కాకుండా కోట్లు ఖర్చు చేసి అధికారంలోకి రావాలనుకునే నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది.. చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని 2009 ఎన్నికల్లో ఎదుర్కోలేక దొరికిన వారందరి కాళ్లు పట్టుకుని ఎన్నికలకు వెళ్లి ఓడిపోయాడన్నారు. నా పాలన చూసి ఓట్లు వేయండి అని వైయస్‌ఆర్‌ 2019 ఎన్నికలకు వెళ్లారని, చంద్రబాబు అలా వెళ్లే దమ్ముందా అని ప్రశ్నించారు. 2014లోఒంటరిగా వైయస్‌ జగన్‌ చాలెంజ్‌ చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే ఎదుర్కోలేక భారతీయ జనతా పార్టీ, పవన్‌ కల్యాణ్‌ కాళ్లు పట్టుకొని అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా ప్రజస్వామ్యం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఏ సిద్ధాంతంతో పొత్తు పెట్టకున్నాడో రాష్ట్ర ప్రజలకు, ఎన్టీఆర్‌ అభిమానులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

2014 ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ అన్యాయం చేసింది.. చట్టం సక్రమంగా రాయలేదని బీజేపీతో కలిసి మాట్లాడిన చంద్రబాబు దేన్నీ చూసి జతకట్టారని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో ఎప్పుడైనా ఏపీ డిమాండ్లను వెలుగెత్తి చాటిందా..? ఒక గంట అయినా సరే పార్లమెంట్‌ను స్తంభింపజేసిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ మొద్దబ్బాయి, సోనియాగాంధీ ఇటలీ దెయ్యం.. ఏ విధంగా ఏపీలో కాలు పెడతారని చెప్పిన చంద్రబాబు ఆఖరికి పాక్కుంటూ కాంగ్రెస్‌ గూటికి వెళ్లి కాళ్లు పట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకకు బీజం వేసిన సంఘటనలు కాంగ్రెస్‌ అన్యాయాలేనని, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. అలాంటి సిద్ధాంతాలను చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. 
Back to Top