దళితులను మోసం చేయడం చంద్రబాబు నైజం

 

విజయవాడ: దళితులను మోసం చేయడం చంద్రబాబు నైజమని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో, టీడీపీలో దళితులకు స్థానం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత శమంతకమణి చెప్పారని తెలిపారు. గురువారం విజయవాడలో మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు..ఆంధ్రప్రదేశ్‌లో దళితుల చట్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించడం, దళితుల భూములను లాక్కోవడం, దళిత ఉద్యోగులను వేధించడం, దళితులను వాడుకొని వదిలేస్తున్నారని మండిపడ్డారు. దళితులంటే చంద్రబాబుకు గౌరవం లేదని విమర్శించారు. ప్రతిపక్షం సభ్యులు మాట్లాడే మాటలు చంద్రబాబుకు లెక్క లేదన్నారు. టీడీపీకి చెందిన సీనియర్‌ నాయకురాలు శామంతక మణి మీ నైజాన్ని చెప్పేందుకు ఎక్కడ సంకోచించలేదన్నారు. టీడీపీలో ఉన్న దళిత నాయకుల్లారా ఒక్కసారి ఆలోచించమని కోరారు. దళిత నేతల ఇళ్లలో పెళ్లిలు ఉంటే టీడీపీ నేతలు రారని, అదే పయ్యవుల కేశవ్‌ ఇంట్లో పెళ్లికి మాత్రం వెళ్తారన్నారు. పయ్యవుల ఇంట్లో పెళ్లికి శాసన సభకు, శాసన మండలికి సెలవు ప్రకటించారని తెలిపారు. చంద్రబాబుకు దళితులంటే చులకనభావమని,  దళితుల్లో ఎవరు పుడుతారని చంద్రబాబు గతంలో చెప్పారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లాలో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. దళితుల సంక్షేమం చంద్రబాబుకు పట్టదన్నారు. శమంతకమణి మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెబుతారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. శమంతకమణి చెప్పింది నిజమా కాదా? మీరు గుండెపై చెయ్యి వేసుకోవాలని టీడీపీలోని దళిత నాయకులకు సూచించారు. సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించేందుకు జీవోలు తెచ్చారన్నారు. రాజ్యాంగబద్ధంగా నిధులు ఖర్చు చేయకుండా తన కాంట్రాక్టులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. నిధుల దుర్వినియోగంపై కమిషన్‌ ఏర్పాటు చేస్తే నిజాలు బయటపడుతాయని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో, ఆలోచనలో దళితులకు స్థానం లేదన్నారు. కొంత మందిని వాడుకొని ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి నాడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. దళితులకు రావాల్సిన చట్టబద్ధమైన అంశాలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని నాగార్జున హెచ్చరించారు.
 
Back to Top