వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది ప్రజల పక్షం

విజయవాడ:

బూటకపు వాగ్దానాలు చేయడం వల్లే టీడీపీ అధికారంలోకి వస్తోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ‌అన్నారు. ప్రజ తీర్పును వైయస్ఆర్‌సీపీ గౌరవిస్తుందని, ప్రజల పక్షం వహించి వారి సమస్యలపై ఆలుపెరుగని పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తారాపేటలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జలీల్‌ఖాన్ మాట్లాడారు.

రాష్ట్ర‌ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కొత్తగా స్థానికేతరులను ఓటర్లుగా చేర్పించి అధర్మ రాజకీయాలకు పాల్పడిందని గుర్తుచేశారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలని విచ్చలవిడిగా నగదు పంచిపెట్టి అక్రమ పద్ధతులకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఒంటరి పోరాటం చేసిన వైయస్ఆర్‌సీపీని ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం లేక చంద్రబాబు నాయుడు మోడీ, పవన్‌ కల్యాణ్‌లతో జతకట్టి అధర్మ యుద్ధం చేశారన్నారు. సీమాంధ్రకు చంద్రబాబు మేలు చేస్తారంటే నమ్మే పరిస్థితి లేదన్నారు.

నియోజకవర్గ సమస్యలపై పోరాటం చేస్తా :

విజయవాడలో ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉందని జలీ‌ల్‌ఖాన్ చెప్పారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎ‌న్‌హెచ్-9, ఎన్‌హెచ్-5ను కలపాలని, అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించాలని అసెంబ్లీలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. నగరాన్ని బుడమేరు ముంపు సమస్య వెంటాడుతోందని, దాని శాశ్వత పరిష్కారానికి ఆయనపై ఒత్తిడి తీసుకొస్తానని అన్నారు.‌ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీపై ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన దాని నిర్మాణం పూర్తి చేస్తానన్నారు.

Back to Top