రెండు రాష్ట్రాల సమస్యలను సభలో ప్రస్తావిస్తాం


హైదరాబాద్, నవంబర్ 22: పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను సభలో లేవనెత్తాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ శనివారం నిర్ణయించింది. పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు లోటస్ పాండ్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు.

సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి మిగిలిన ఎంపీలతో కలసి మీడియాతో మాట్లాడారు. 'రైతులు, ఇరిగేషన్, రైల్వేలు ఇతర అంశాలకు సంబంధించి ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై పార్లమెంట్ సమావేశాలలో ప్రస్తావించడంతోపాటు వాటిపై సంబంధిత మంత్రులు, అధికారులతో చర్చించి సత్వర పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ఉభయ రాష్ట్రాల అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు అవుతాం' అని రాజమోహన్ రెడ్డి చెప్పారు.

'హుదూద్ తుపాను విధ్వంసానికి గురైన ప్రజల కష్టాలను సభాపతి దృష్టికి తీసుకువస్తాం. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తాం. అలాగే మా పార్టీ అధ్యక్షుడి ఆదేశానుసారం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయిన పోలవరం ముంపు మండలాల ప్రజలకు సంబంధించి చేపట్టవలసిన సంక్షేమ చర్యలపై కూడా సభలో ప్రస్తావిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మండలాలను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోంది. కాబట్టి ఈ అంశాన్ని లోక్ సభలో చర్చకు పెడతాం' అన్నారాయన.

పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీల గురించి మేకపాటి ప్రస్తావిస్తూ, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా మొదట ప్రకటించి ఆ పార్టీకి ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆ తర్వాత మాట మార్చి తాను వైఎస్సార్సీపీని వీడి పోవడం లేదని, కేవలం తన నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి పనుల నిమిత్తం మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసినట్లు వివరణ ఇచ్చారు. అలాగే మరో ఎంపీ కొత్తపల్లి గీత కూడా చెప్పారు. ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయింపు అంశం ప్రివిలేజెస్ కమిటీ ముందుకు వచ్చింది. ఇక గీతపై కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరతాం' అని వివరించారు.

పార్టీ ఫిరాయింపుల బిల్లును ఆమోదించింది పార్లమెంట్. ఏ సభ్యుడైనా పార్టీ ఫిరాయించదలిస్తే వారిని ముందుగా అనర్హులుగా ప్రకటించిన ఆ తర్వాత  ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందని మేకపాటి చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top