చంద్రబాబు ఏదో ఒక మాట మీద నిలబడాలి

ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ తన వైఖరీ వెల్లడించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ సూచించారు. ఢిల్లీ పార్లమెంట్‌ ప్రధాన గేటు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కమీషన్లపై మోజుతో ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించారని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఏదో ఒక మాటపై నిలబడాలని సూచించారు. మూడున్నరేళ్ల పాటు ప్రత్యేక హోదా వద్దు..ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న వ్యక్తి తన ప్రతినిధులను అరుణ్‌జైట్లీ వద్దకు పంపించి ప్యాకేజీ ఎంత అని అడుగుతూ..మరో వైపు ఆ పార్టీ ఎంపీలు మాకు ప్రత్యేక హోదా కావాలని పార్లమెంట్‌ వద్ద ప్లకార్డ్సుతో ఆందోళన చేపడుతున్నారన్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి టీడీపీ ఎంపీలు కూడా మాతో కలిసి రావాలని సూచించామన్నారు. అవిశ్వాస తీర్మానానికి మాతో పాటు చాలా పార్టీలు కలిసి వస్తున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదాపై ఏమాత్రం చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా డ్రామాలు ఆపి, మాతో పాటు కలిసి రావాలని సూచించారు. టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి బయటకు వస్తేనే వారి చిత్తశుద్ధిని చూపిన వారు అవుతారన్నారు. లేదంటే ఏపీ ప్రజలు టీడీపీని క్షమించరని హెచ్చరించారు.
 
Back to Top