శాసనమండలి నుంచి వైయస్ఆర్‌సీపీ వాకౌట్

హైదరాబాద్:‌

అసమగ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సభ్యులు శుక్రవారం శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు.‌ బిల్లుపై సమగ్ర సమాచారాన్ని రప్పించడంలో విఫలమైన ప్రభుత్వం తీరును వారు తీవ్రంగా నిరసించారు. శుక్రవారం ఉదయం మండలి ప్రారంభం కాగానే బిల్లుపై మాట్లాడేందుకు మండలి నాయకుడు, మంత్రి సి.రామచంద్రయ్యను చైర్మన్ చక్రపాణి అనుమతించారు. ఆ సమయంలోనే వై‌యస్ఆర్‌సీపీ ఫ్లోర్‌లీడర్ ఆదిరెడ్డి అప్పారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసమగ్రంగా ఉన్న బిల్లును ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆర్థిక నో‌ట్ లేదని, బీఏసీ సమావేశంలో అడిగితే తెప్పిస్తామని శాసనసభా వ్యవహారాల మంత్రి చె‌ప్పినా ఇంతవరకు ఎందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు కూడా అమలు కాకపోతే ఎలా అని ఆదిరెడ్డి ప్రశ్నించారు.

 అప్పారావు అభ్యంతరంపై మంత్రి రామచంద్రయ్య స్పందిస్తూ.. సమాచారం కోసం కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారన్నారు. కేంద్రం సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఈ దశలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకున్నారు. సమాచారం తెప్పించడంలో ఆలస్యమయ్యే అవకాశాన్ని తాము అర్థం చేసుకుంటామని, వీలున్నంత త్వరగా సమాచారం రప్పించాలని కోరారు.

యనమల వ్యవహారాన్ని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ప్రభుత్వంతో సర్దుకుపోతే ఎలా? అని నిలదీశారు. ఆలస్యమవుతుందని మీరే సభను తప్పుదోవ పట్టిస్తారా? అని ప్రశ్నిస్తూ ప్రభుత్వంతో కుమ్మక్కు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో కొంత గందరగోళం నెలకొంది.

ఈ గందరగోళం మధ్యనే ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ.. బిల్లుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెప్పించనందుకు నిరసనగా సభ నుంచి ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాకౌట్ చేస్తున్న‌దని ప్రకటించి పార్టీ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిపోయారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top