ఎవరిని కాపాడేందుకు సీబీఐ వద్దని జీవో తెచ్చారు?– సీబీఐ పేరు చెబితే బాబు వణికిపోతున్నారు
 – ప్రభుత్వ పథకాల్లో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు
– సీబీఐని ఏపీలోకి రానివ్వకుండా సర్కార్‌ కీలక నిర్ణయం
– ఐటీ దాడులకు వచ్చిన వారికి సెక్యూరిటీ ఇవ్వమని సీఎం చెప్పారు
– కొందరి వ్యక్తిగత అవసరాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారా? 
 హైదరాబాద్‌: ఎవరిని కాపాడేందుకు రాష్ట్రంలో సీబీఐ వద్దని జీవో తెచ్చారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలోని కుట్రలు ఎక్కడ బయటకు వస్తాయో అని భయంతో చంద్రబాబు  ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కేవలం కొందరి వ్యక్తిగత అవసరాల కోసమే సీబీఐని బ్యాన్‌ చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా విడుదల చేసిన 176 జీవోలో సీబీఐ వ్యవస్థ ఏపీలో విచారణ చేపట్టకూడదని పేర్కొన్నారన్నారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆగస్టు 3వ తేదీన 109వ జీవో విడుదల చేసిందన్నారు. ఆ జీవోలో సీబీఐ రాష్ట్రంలో ఎలాంటి విచారణ అయినా చేయవచ్చు అని పేర్కొన్నారన్నారు.  సహజంగా సీబీఐ ఏర్పడినప్పుడు రాష్ట్ర పరిధిలో ఏదైనా అంశంపై విచారణ చేసేసమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం ఉండాలన్నది ఉండేదన్నారు. అయితే 13 సంవత్సరాలకు పైగా చంద్రబాబు సీఎంగా ఉన్నారన్నారు. 23 సంవత్సరాల్లో ఎవరూ కూడా సీబీఐ విచారణపై బ్యాన్‌ వేసిన సంఘటనలు లేవన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఎప్పుడు లేదని, ఇప్పుడే అర్ధాంతరంగా ఎందుకు దాపురించిందని ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు. ప్రజల శ్రేయస్సు కోరి ఈ నిర్ణయం తీసుకున్నారా అని నిలదీశారు. ఎవరైనా వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, వాళ్లను తప్పించేందుకు ఈ ప్రభుత్వం ఇలాంటి జీవో విడుదల చేసిందని ఆరోపించారు. ఇక్కడ ప్రజల ఇబ్బందులు ఏమీ కనబడకపోయినా అర్ధాంతరంగా ఆగస్టులో ఇచ్చిన  జీవోను విత్‌ డ్రా చేసుకోవడం పలు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. గత కొన్ని నెలల క్రితం ఏపీలో ఐటీ దాడులు జరిగాయని, దాడులకు వచ్చిన ఐటీ అధికారులకు సెక్యూరిటీ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పిందన్నారు. ఆ రోజు ఎందకు చెప్పారని, ఇవాళ ఎందుకు ఆంక్షలు పెట్టారని మండిపడ్డారు. సామాన్య ప్రజలపై ఐటీ దాడులు జరగలేదని, నల్లధనం ఎక్కువగా ఉన్నవారిపైనే ఐటీ దాడులు చేశారన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన సందర్భంగా ఆయన కోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ విచారణకు రాకముందు, సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నారా అని భయపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు.సీబీఐ విచారణ జరుగకూడదని నిషేదం విధించడం ఎంతవరకు న్యాయమన్నారు. పోలవరంలో చాలా అవకతవకలు జరిగాయని కాగ్‌ తేల్చిందన్నారు. దానిపై విచారణ జరుగకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చాలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయని, వాటిలో అవకతవకలు జరిగితే ఎవరు విచారణ చేస్తారని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఎలాంటి జడ్జిమెంట్‌ వస్తుందో అని భయపడి ఇలాంటి జీవో తెచ్చారని మండిపడ్డారు. సీబీఐ విచారణ అసలు జరుగకూడదు అనుకుంటే విచారణను అర్ధాంతరంగా ఆపేయాలని అనుకున్నారా అని నిలదీశారు. దీనిలో జాతీయ ప్రయోజనాలు కాపాడాలని చెప్పే చంద్రబాబు దేశంలోని అన్ని పార్టీలతో కలుస్తున్నారని, కాంగ్రెస్‌తో జత కట్టారన్నారు. రాహుల్‌ గాంధీ సీబీఐ విచారణ కోరుతున్నారని గుర్తు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు ఛిన్నాభిన్నం చేశారన్నారు. విచ్చలవిడగా జరిగే అన్యాయాలను ఏవిధంగా అరికడతారని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగత ఇబ్బందుల వల్లే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. 
 
Back to Top