దాడిపై స్పీకర్‌కు వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు

హైదరాబాద్, 16 డిసెంబర్ 2013:

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దౌర్జన్యానికి పాల్పడిన సంఘటనపై వై‌యస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం‌ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహ‌ర్కు ఫిర్యాదు చేశారు. టీ.కాంగ్రె‌స్ నేతలతో పాటు కొందరు మీడియా ప్రతినిధులు కూడా తమపై దాడికి పాల్పడినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదుపై స్పందించిన స్పీక‌ర్ మీడియా ఫుటే‌జ్ పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులను‌ స్పీక‌ర్ తన ఛాంబర్కు పిలిపించుకుని చర్చలు జరుపుతున్నారు.

అంతకు ముందు సోమవారం ఉదయం నుంచీ అసెంబ్లీలోనూ, ప్రాంగణంలోనూ యుద్ధ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఇరు ప్రాంత నేతలు ఒకరినొకరు తోసుకోవటంతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కనీసం బీఏసీని కూడా పిలవకుండా తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారంటూ వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను తగులబెట్టారు. దీ‌నితో చీఫ్ వి‌ప్ గండ్ర వెంకటరమణారెడ్డి‌ వారిని  అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గండ్రకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తోడ‌వటంతో ఉద్రిక్తత మరింత ఎక్కువైంది. పోలీసుల సాక్షిగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులపై దాడి జరిగింది. ఈ సందర్భంగా జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో మీడియా పాయింట్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది.‌

 వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి జరగడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ధర్మాన కృష్ణదాసు అభివర్ణించారు. ఇందుకు ముఖ్యమంత్రి కిర‌ణ్ కుమా‌ర్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలన్నారు. అసెంబ్లీలో కూడా సమైక్య తీర్మానం చేయాలంటూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. సమైక్య రాష్ట్రం కోసం చివరివరకు పోరాడతామని స్పష్టం చేశారు. వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ ఎమ్మెల్యేలను మీడియాతో మాట్లాడనీయకుండా అక్కడి‌ నుంచి పంపేందుకు ప్రయత్నించారు.

తాజా వీడియోలు

Back to Top