ఇళ్ల నిర్మాణంలో రూ. 5 వేల కోట్ల స్కామ్‌

ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు రూ.16 వందలు
తెలంగాణతో పోల్చితే రూ. 400ల వ్యత్యాసం
అవినీతి నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడానికి గొప్పలు
హైదరాబాద్‌ కట్టించానంటే కుతుబ్‌షా ఏం చేసినట్లు బాబూ
తుపాన్‌ను జయించాం.. సముద్రాన్ని కంట్రోల్‌ చేశామంటే ప్రజలు నవ్వుతున్నారు
రూ. 5 వేల కోట్ల స్కామ్‌పై కేంద్రం స్పందించకపోవడం దారుణం
హైదరాబాద్‌: గొప్పలు చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు తప్ప ప్రపంచ వ్యాప్తంగా మరొకరు కనిపించరని పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని డైవర్ట్‌ చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనిపిస్తోందని బుగ్గన అనుమానం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం లేకుండా పెథాయ్‌ తుపాన్‌ను గుర్తించే పరిస్థితి లేనట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబెల్స్‌ ప్రాపగాండలో చంద్రబాబు ముందున్నారని, ప్రకృతిపై గెలుపు, సముద్రాన్ని కూడా కంట్రోల్‌ చేయగలిగాం, హుద్‌ హుద్‌ను జయించాం, తిత్లీని జయించాం.. టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేశానంటూ చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తుపాన్‌లను జయించడం ఏంటీ.. సముద్రాన్ని కంట్రోల్‌ చేయడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. 

చంద్రబాబు వ్యాఖ్యలు విని ప్రజలంతా నవ్వుకుంటున్నారని బుగ్గన అన్నారు. అగ్రికల్చర్‌కు నోబుల్‌ ప్రైజ్‌ ఇప్పిస్తా.. ఒలంపిక్స్‌లో గెలిచినవారికి నోబుల్‌ ప్రైజ్, రూ. 100 కోట్ల బహుమతి అని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్‌కు కరెంటు లేదు. నీరు లేదు.. నేను వచ్చాకే అన్ని తెచ్చానని మాట్లాడుతున్నాడని, అందుకే తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఇన్ని కట్టించిన వ్యక్తి మాకు అవసరం లేదని ప్రజలు చంద్రబాబును తిప్పిపంపించారని ఎద్దేవా చేశారు. ఆర్టిజిఎస్‌పై చంద్రబాబు సర్కార్‌ గొప్పలు చెబుతోందని, ఆర్టిజిఎస్‌ లేనప్పుడు తుపానులపై అలెర్ట్‌ చేయలేదా? ఇంతవరకు భారతదేశంలో వాతావరణశాఖ పనితీరు ఏమైంది బాబూ అని ప్రశ్నించారు. 7వ తేదీన తుపాన్‌ను గుర్తించాం. 70 లక్షల ఫోన్‌కాల్స్‌ చేశామని చంద్రబాబు అంతుపొంతూ లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. 

తన అవినీతి నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడని బుగ్గన అనుమానం వ్యక్తం చేశారు. సామాన్య మానవుడికి కావాల్సినవి.. కూడు, గూడు, దుస్తులు అని, వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని చంద్రబాబుకు సూచించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పార్టీలకు అతీతంగా ఇంటి నిర్మాణాలు చేపట్టారని, దేశం మొత్తానికంటే ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే అధిక ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. చంద్రబాబు తన నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్ని ఇళ్లు కట్టించారని బుగ్గన ప్రశ్నించారు. 139 పట్టణాల్లో 4,22,349 ఇల్లు నిర్మిస్తున్నాడని, 2014 నుంచి 2017 వరకు గృహ నిర్మాణాలు మొదలు పెట్టలేదన్నారు. కట్టే అరకొర ఇళ్లకు ఒక్క చదరపు అడుగుకు రూ. 16 వందలు చెల్లిస్తున్నాడన్నారు. అది కూడా 6 కాంట్రాక్ట్‌ సంస్థలతో కుమ్మకై అధిక ధర చెల్లిస్తూ రూ. 5 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని బుగ్గన చెప్పారు. 

ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణానికి రూ. 16 వందలు ఇస్తున్నారని, అదే కర్నూలులో భూమితో కలిపి చదరపు అడుగుకు రూ. 2 వేల నుంచి రూ. 25 వందలకు ఫస్ట్‌క్లాస్‌ ఇల్లు దొరుకుతుందన్నారు. ప్రభుత్వ భూమిపై కట్టిన ఇంటికి రూ. 16 వందలు ఇవ్వాల్సిన అవసరం ఉందా చంద్రబాబూ అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏ లావాదేవీలు లేనిది ఇంత పెద్ద దేశంలో వేల మంది కాంట్రాక్టర్లు ఉండగా కేవలం 6 సంస్థలకు ఇవ్వడం కరెక్టా..? అని ప్రశ్నించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మేడ్చల్‌ నియోజకవర్గం కీసర మండలం రాంపల్లి గ్రామంలో 6,200 ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం కడుతుందన్నారు. ఈ ప్రాజెక్టును డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ కైవసం చేసుకొని రూ. 1290కి చదరపు అడుగు ఇటుకతో పాటు షేర్‌వాల్‌తో కడుతుందని, షేర్‌వాల్‌కు 9 శాతం ఎక్కువ అయినా ఆ నిర్మాణ సంస్థే భరిస్తూ టర్కీ నుంచి టన్నల్‌ ఫాం టెక్నాలజీ తీసుకొచ్చిందన్నారు. ఇదే కాకుండా దుండిగల్‌లో షేర్‌వాల్‌తో రూ. 1350కి ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రూ. 13 వందలు చదరపు అడుగుకు ఇంటి నిర్మాణాలు జరుగుతుంటే.. ఏపీలో రూ. 16 వందలు ఇంత వ్యత్యాసం ఎందుకు బాబూ అని ప్రశ్నించారు. ఈ తేడా కాకుండా తెలంగాణ రూరల్‌ ఏరియా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో డబుల్‌ బెడ్‌రూం ఇంటి నిర్మాణానికి అడుగుకు రూ. 950, అదే పక్క గ్రామం ప్రతాపసింగారంలో కేవలం రూ. 900లకే ఇల్లు నిర్మిస్తున్నారన్నారు. ఎక్కడ రూ. 900, ఎక్కడ రూ. 16 వందలు ఏంటీ వ్యత్యాసం బాబూ అని నిలదీశారు.  

ఇళ్ల నిర్మాణాల పేరుతో చంద్రబాబు రూ. 5 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని బుగ్గన అన్నారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణంతో పోలిస్తే రూ. 5 వేల కోట్ల తేడా ఉందన్నారు. త్రిమూర్తులు, పంచపాండవులు, నవరత్నాలు, దశావతారాలు టైపులో చంద్రబాబు కాంట్రాక్టర్‌లను సెట్‌ చేసుకొని అవినీతికి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో కేంద్రం వాటాతో నిర్మిస్తున్న ఇళ్లలో ఇంత కుంభకోణం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వానికి స్పందించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జీఓ నెంబర్‌ 609లో ప్రధాన మంత్రి ఆవాజ్‌ యోజన అర్బన్‌లో లబ్ధిదారులకు పాదర్శకంగా ఇల్లు కేటాయించాలని ఉందని, దానికి ఒక కమిటీ వేయాలని సూచించిందన్నారు. ఏపీలో కమిటీలు వేశారా..? వాటిల్లో ఒక్కరైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. జన్మభూమి కమిటీల ద్వారా ఇష్టానుసారంగా ఇళ్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కేంద్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రాజధాని నిర్మాణంలో శివరామకృష్ణన్‌ కమిటీæసిఫార్స్‌లను పట్టించుకోకపోయినా కేంద్రం ప్రశ్నించలేదన్నారు. 
 
Back to Top