చంద్రబాబు దేశం విడిచి పారిపోతారా..?

అనే రీతిలో టీడీపీ, పచ్చ మీడియా ప్రచారం.. భయం..
ఐటీ సోదాలకు రాజకీయరంగు పూస్తూ విష ప్రచారం
కేంద్రం, రాష్ట్రం మధ్య యుద్ధం జరుతున్నట్లుగా కుట్రలు
బీజేపీ, టీడీపీ లోపాయకార ఒప్పందంతోనే సోదాలు
ఐటీ దాడుల గురించి కేబినెట్‌ సమావేశం విడ్డూరం
దొంగసారా కాచేవారు పోలీసులపై తిరగబడినట్లుగా బాబు వైఖరి
వైయస్‌ఆర్‌ను ఆదర్శంగా తీసుకొని బాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలి
టీడీపీ దొంగల ముఠాకు రానున్న రోజుల్లో జైలు జీవితం తప్పదు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌
హైదరాబాద్‌: ఐటీ దాడులకు భయపడి చంద్రబాబు దేశం విడిచి పారిపోతారా..? అధికారులు బాబు పాస్‌పోర్టు రద్దు చేస్తారా...? అనే విధంగా ఐటీ సోదాలపై టీడీపీ ప్రచారం సాగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. రెండ్రోజులుగా వ్యాపార రంగాలు, సంస్థలపై దాడులు జరుగుతుంటే చంద్రబాబు దీనికి రాజకీయాలు అంటగట్టి సానుభూతి సంపాదించుకోవాలని చూస్తున్నాడన్నారు. ఐటీ సోదాలు టార్గెట్‌ చేసి జరుపుతున్నవిగా వైయస్‌ఆర్‌ సీపీ భావించడం లేదన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో సోదాలు జరుగుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో ఆక్వా, జీడిపప్పు వ్యాపారం, స్థిరాస్తులు, సిమెంట్‌ వ్యాపారం వంటి వివిధ రంగాల్లో ఐటీ అధికారులకు ఉన్న సమాచారం మేరకు తనిఖీలు చేపడుతున్నట్లుగా భావిస్తున్నామన్నారు. దీన్ని తనకు ఆపాదించుకొని అనుకూల మీడియాతో విష ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. 

ఐటీ దాడుల గురించి చంద్రబాబు అత్యవసర కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే సురేష్‌ అన్నారు. ఐటీ సోదాల వైనాన్ని ఏ విధంగా రాజకీయంగా మల్చుకోవాలి.. తనకు కావాల్సిన వ్యక్తులు, వారి సంస్థలకు ముందస్తుగా సమాచారం ఏ విధంగా అందించి ఆస్తులు కాపాడాలనే అనే అంశాలపై కేబినెట్‌లో సమావేశంలో మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి కేబినెట్‌ సమావేశం దేశ చరిత్రలోనే జరిగి ఉండదన్నారు. ఐటీ దాడులు ఎవరిపై జరగుతున్నాయో.. చంద్రబాబుకు ఎలా సమాచారం అందుతుందని ప్రశ్నించారు. ఐటీ దాడులను రాష్ట్ర సమస్యగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కేబినెట్‌ సమావేశంలో ఇంకా ఒక అడుగు ముందుకెళ్లి దాడుల నుంచి బయటపడేందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎప్పటి నుంచో అలవాటు మాదిరిగా సుప్రీంకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు. 

ఐటీ దాడులపై చంద్రబాబుకు ముందస్తు సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రంతో లోపాయకార ఒప్పందం చేసుకొని దాడులు చేయించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి విష ప్రచారాలు చేయిస్తున్నాడన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య యుద్ధం అనే ధోరణి తీసుకువస్తున్నారన్నారు. గతంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, గట్కరీ చంద్రబాబుతో తమ బంధం ఫెవికల్‌ లాంటిదని చెప్పారని గుర్తు చేశారు. కేంద్రంతో చంద్రబాబుకు బంధం లేకుంటే ఎందుకు మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్‌గా ఎందుకు ఇంకా కొనసాగిస్తారని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఇంకా చంద్రబాబు చాలా సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. కానీ చంద్రబాబు తన అనుకూల మీడియాతో కుట్రపూరితంగా చేస్తున్న దాడులుగా చిత్రీకరించుకుంటున్నారని, చంద్రబాబు పాస్‌పోర్టు స్వాధీనం చేసుకుంటారా..? బాబు దేశం విడిచి పారిపోతారా..? దేశం విడిచిపోకుండా రెడ్‌ అలర్ట్‌ నోటీసులు ఇస్తారా..? అన్నట్లుగా చంద్రబాబు భయపడుతున్నారని, అంతేస్థాయిలో ప్రచారాలు చేయించుకుంటున్నారన్నారు. 

చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకొని సీబీఐ విచారణకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే సురేష్‌ సవాలు విసిరారు. ఒక పక్క దేనికి భయపడనని చెప్పే చంద్రబాబు మరో పక్క గజ గజ వణుకుతున్నాడన్నారు. వీరప్పన్‌ తిరుగుబాటు చేసినట్లుగా, దొంగసారాయి కాసే ముఠా పోలీసులపై ఎదురుదాడికి దిగినట్లుగా చంద్రబాబు వైఖరి ఉందన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదా..? ఎమ్మెల్యేలను వందల కోట్లు వెచ్చించి కొనుగోలు చేయలేదా..? కాంట్రాకర్ల నుంచి కమీషన్లు తీసుకోలేదా..? పోలవరం కోసం ప్రత్యేక హోదా తాకట్టుపెట్టలేదా..? నంద్యాల ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేయలేదా..? వచ్చే ఎన్నికల కోసం ప్రతీ నియోజకవర్గానికి రూ. 20 కోట్లు పంపించలేదా..? అమరావతిని రియలెస్టేట్‌ వ్యాపారంగా మార్చుకోలేదా..? చివరకు ఎస్టీ, ఎస్టీ, బీసీ బడ్జెట్‌లో అవినీతికి పాల్పడలేదా..? ముందుగా వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏ అర్హత లేకున్నా.. లోకేష్‌ను దొడ్డిదారిన మంత్రిని చేసి కేబినెట్‌లో కూర్చోబెట్టి అవినీతి ట్రైనింగ్‌ ఇస్తున్నారన్నారు. 

ఐటీ అధికారులు చంద్రబాబు, లోకేష్‌ ఆస్తులపై దాడులు చేయాలని ఆదిమూలపు సురేష్‌ డిమాండ్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఇటీవల చెప్పినట్లుగా వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతీ నియోజకవర్గానికి టీడీపీ రూ. 20 కోట్లు పంపించి ఎక్కడ దాచిందో బయటకు తీయాలని కోరారు. చంద్రబాబు వందల కొద్ది తప్పులు చేశారని, ఆర్థిక నేరగాళ్లు ఉగ్రవాదుల కన్నా ప్రమాదమని సుప్రీం తీర్పు ఇచ్చిందని, ఇందులో చంద్రబాబు ఎలాంటి వ్యక్తి అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పరాభవం తప్పదని, టీడీపీ దొంగల ముఠా అంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top